నో గ్యాప్‌

Special chit chat with comedian prudhvi Raj - Sakshi

‘‘నేను సినిమాల నుంచి రిటైర్‌ అయ్యాక ‘తాడేపల్లిగూడెంలో ఓ పెద్దాయన ఉంటాడు. పిలవండ్రా మంచిగా రెండు డైలాగ్స్‌ చెబుతాడు’ అని నా గురించి సినిమా యూనిట్‌ చర్చించుకుంటే నేను విజయం సాధించినట్లే’’ అన్నారు పృథ్వీ. ‘జ్యోతిలక్ష్మి, ఘాజి’ చిత్రాల ఫేమ్‌ సత్యదేవ్‌ హీరోగా గోపీ గణేష్‌ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్లఫ్‌ మాస్టర్‌’. అభిషేక్‌ ఫిలిమ్స్‌ పతాకంపై రమేష్‌ పిళ్లై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన çపృథ్వీ చెప్పిన విశేషాలు.

∙‘ఖడ్గం, లౌక్యం’ సినిమాల్లో నటిస్తున్నప్పుడే ఆ సినిమాలు హిట్‌ సాధిస్తాయనే నమ్మకం కలిగింది. ఇప్పుడు ‘బ్లఫ్‌ మాస్టర్‌’ చిత్రానికి అదే కలుగుతోంది. ఇందులో ధనశెట్టి అనే క్యారెక్టర్‌ చేశాను. గోపీ గణేశ్‌ మంచి విజన్‌ ఉన్న దర్శకుడు. ఈ సినిమా క్లైమాక్స్‌లో నా మార్క్‌ కామెడీ ఉంటుంది. అలాగే నా పాత్రకు ‘గోవింద’ అనే ఊతపదం ఉంటుంది. దేవుడి పేరును అపహాస్యం చేయాలని మాత్రం కాదు.

∙ఈ సినిమాలో హీరో సత్యదేవ్‌ అద్భుతంగా నటించాడు. తనకు నటుడిగా మంచి భవిష్యత్‌ ఉంది. ఇంతకుముందు నేను, సత్యదేవ్‌ ఇద్దరం కలిసి ప్రకాశ్‌రాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మా ఊరి రామాయణం’ చిత్రంలో నటించాం. వచ్చే ఏడాది సత్యను హీరోగా పెట్టి ప్రకాశ్‌రాజ్‌ ఓ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారు.

∙నేను ఎవరి చేతిలో అయినా మోసపోయానా? అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో విభిన్నమైన అనుభవాలు ఉన్నాయి. ఏదైనా కాలమే నేర్పిస్తుంది. బేసిక్‌గా నేను హాస్యనటుణ్ని కాదు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుని. ఎక్కువ హాస్యభరితమైన పాత్రలు వచ్చాయంతే. కైకాల సత్యానారాయణ, కోట శ్రీనివాసరావుగార్లు విలన్లుగా, హాస్యనటులుగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా అద్భుతంగా రాణించారు. నేను క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారడానికి ఇదే సరైన సమయమని వారు నాకు సూచించారు. భవిష్యత్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసినప్పటికీ నా మార్క్‌ కామెడీ నా పాత్రలో ఉండేలా జాగ్రత్త వహిస్తాను.

∙ఇండస్ట్రీలో నాకు పెద్దగా గ్యాప్‌ రాలేదు. ‘వినయవిధేయరామ’లో హీరోయిన్‌ తండ్రి పాత్రలో, ‘మహర్షి’ సినిమా సెకండాఫ్‌ సీన్స్‌లో ఎక్కువగా కనిపిస్తాను. మహానేత వైయస్సార్‌ బయోపిక్‌ ‘యాత్ర’లో తెలుగుదేశం ఎమ్మెల్యే పాత్రలో నటించాను. ‘ఎఫ్‌2’లో చేశాను. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఓ సినిమాలో కనిపిస్తా. ‘బృందావనమిది అందరిదీ’ సినిమా చేస్తున్నా. ధనుశ్‌ హీరోగా చేయనున్న ఓ తమిళ సినిమాలో నటించబోతున్నాను.

∙వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారంటే నాకు ప్రాణం. నాకు ఓపిక, ఊపిరి ఉన్నంత కాలం ఆయనతోనే ఉంటాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదనే అనుకుంటున్నాను. రాజకీయాల్లో భవిష్యత్‌ కార్యాచరణ గురించి ఇప్పుడే స్పష్టత ఇవ్వలేను. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top