బిగ్‌బాస్‌: నెక్ట్స్‌ బాబేనా!

Social Media Slams Babu Gogineni Role In Bigg Boss - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ సీజన్‌-2 ఏదైనా జరగొచ్చు.. అన్నట్లే ప్రేక్షకులకు కావాల్సిన అసలు సిసలు మజా లభిస్తోంది. తొలుత కొంత డల్‌గా సాగిన ఈ రియాల్టీ షో సోషల్‌ మీడియా ట్రోల్స్‌తో వేడెక్కింది. ప్రేక్షకులు కంటెస్టెంట్స్‌ అభిమానులుగా విడిపోవడంతో నెట్టింట్లో ఈ రియాల్టీ షో గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. దీంతో హౌస్‌లో ఏం జరుగుతుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక రసవత్తరంగా సాగిన గురువారం ఎపిసోడ్‌ ఆకట్టుకుంది. చివర్లో గీతా మాధురి Vs బాబు గోగినేని మధ్య సాగిన చర్చ హైలైట్‌గా నిలిచింది. 

కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కోల్పోయిన గణేశ్‌, నందిని, దీప్తి సునయనలకు బిగ్‌బాస్‌ మరో అవకాశమిచ్చాడు. కానీ దానికి ఓ మెలిక పెట్టడంతో వారు ఒప్పుకోలేదు. అనంతరం ఈ వారం కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్‌ టాస్క్‌ నిర్వహించాడు. ఓ పాన్‌ షాప్‌ సెట్‌ను వేసి దానికి యజమానిగా ఇటీవల హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణా రామంచంద్రన్‌ను నియమించాడు. హౌస్‌ మేట్స్‌ తమ ఆటపాటలతో ఆమెను మెప్పించి కిల్లీలు తీసుకోవాలని సూచించాడు. ఈ టాస్క్‌లో అపరిచితుడు రాము వేశంలో అమిత్‌ ఆకట్టుకున్నాడు. ఇక పూజా.. అమిత్‌, సామ్రాట్‌, గీతా మాధురి, దీప్తిలు తనను ఆకట్టుకున్నారని బిగ్‌బాస్‌కు సూచించింది. ఈ నలుగురు తదుపరి కెప్టెన్‌ పోటీదారులుగా ప్రకటిస్తూ.. పెయింట్‌ వేసుకోని పెడెస్టెల్స్‌ మీద విగ్రహంలా నిలబడాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. అంతేకాకుండా నచ్చని పోటీదారున్ని కిందికి దిగేలా ఏమైనా చేయవచ్చని మిగతా సభ్యులుకు సూచించాడు.   

కౌశల్‌ Vs తనీష్‌..
కెప్టెన్‌ పోటీదారులను ఇతర సభ్యులు తమ తోచిని రీతిలో ఇబ్బంది పెట్టసాగారు. ఈ సందర్భంగా కౌశల్‌, తనీష్‌ మధ్య తీవ్ర చర్చ జరిగింది. కౌశల్‌ కొబ్బరి నూనేను వారిపై పోస్తుండగా నందిని రాయ్‌, తనీష్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తన ఒక్కడిపైనే పసుపు కొట్టారని, తాను కేవలం కొబ్బరి నూనెను ఎవరికి మద్దతివ్వకుండా అందరిపై పోస్తున్నానని, కౌశల్‌ పేర్కొన్నాడు. దీంతో తనీష్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఇక అనంతరం అమిత్‌, సామ్రాట్‌లను నెట్టేద్దామని పూజా, కౌశల్‌ చర్చించుకున్నారు. కానీ అప్పటికే బాబుగోగినేని బకెట్‌తో దీప్తిని దించేశాడు. ఆ వెంటనే కౌశల్‌ స్టిక్‌తో అమిత్‌, సామ్రాట్‌లను నెట్టేయడంతో గీతా మాధురి ఒక్కరు మిగిలిపోయారు. దీంతో గీతా మాధురినే తదుపరి కెప్టెన్‌గా బిగ్‌బాస్‌ ప్రకటించాడు. 

గేమ్‌ ఆడిన కౌశల్‌..
తన సహజ శైలితో హౌస్‌లో ఒంటరి వాడైన కౌశల్‌ అసలు సిసలు గేమ్‌ ఆడాడు. ముఖ్యంగా పీకలదాక తన మీద కోపం పెంచుకున్న బాబుగోగినేని వ్యూహంపై దెబ్బకొట్టాడు. అంతో ఇంతో హౌజ్‌లో చనువుగా ఉండే గీతా మాధురి, దీప్తిలను కెప్టెన్‌ కాకుండా అడ్డుకోవాలనే బాబు, తనీష్‌, సామ్రాట్‌ల ప్లాన్‌ను విజయవంతంగా అడ్డుకున్నాడు. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న బాబు దీప్తిని కిందపడేసి.. అనంతరం గీతా మాధురిని తోసేయాలనుకున్నాడు. దీంతో అమిత్‌, సామ్రాట్‌లో ఎవరు కెప్టెన్‌ అయినా తన మాట చెల్లుతుందని భావించాడు. కానీ కౌశల్‌ ఈ వ్యూహాన్ని అడ్డుకున్నాడు.

బాబు VS గీతా మాధురి..
తన ప్లాన్‌ విఫలమవడంతో బాబు గోగినేని ఒకింత అసహనానికి గురయ్యాడు. దీంతో కొత్త కెప్టెన్‌ గీతా మాధురితో తగువు పెట్టుకున్నాడు. దీప్తి, సామ్రాట్‌లలో ఒకరిని కెప్టెన్‌ చేద్దామనుకున్నాం.. అంత గొడవ జరుగుతున్నా మీరెందుకు సైలెంట్‌గా ఉన్నారని గీతాను ప్రశ్నించాడు. దీప్తిని కెప్టెన్‌ చేయాలనుకున్నప్పుడు ఎందుకు కిందపడేశారని ఆమె ప్రశ్నించడంతో ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చింది.

‘మీరు కెప్టెన్‌గా హౌస్‌కు నాయకత్వం వహించాలి. కూర్చొని గ్రూప్‌లు చేయ‌కండి’ అంటూ ఫైర్ అయ్యాడు. ‘డిస్క‌ష‌న్‌లో నిజాయితీ లేని మీతో నేను చ‌ర్చ జ‌ర‌ప‌ను. ఆక‌తాయి మాటలతో ఎదుటి వారి ఉద్దేశాలు మాట్లాడ‌టానికి వీల్లేదు’ అని మండిపడ్డాడు. ‘నాకు మాట్లాడాల‌ని లేక‌పోయిన మీ వ‌య‌స్సుకు విలువ ఇచ్చి మాట్లాడుతున్నానంటూ’ గీతా కౌంటర్‌ ఇచ్చింది. కెప్టెన్సీ మొద‌ట్లోనే గ్రూప్‌తో మొద‌లు పెట్టార‌ని.. ఎలా కొనసాగిస్తారో చూస్తానని, మీ ఉద్యోగం మీరు చేసుకుంటే మంచిదని సూచించాడు. దీనికి గీతా సైతం తన బాధ్యతను పర్‌ఫెక్ట్‌గా నిర్వహిస్తున్నాని, మీకు నచ్చకపోతే నామినేట్‌ చేయండి అంటూ బదులిచ్చింది. వీరి సంభాషణలో కౌశ‌ల్ తల దూర్చగా.. సామ్రాట్‌, తనీష్‌లు వాళ్లిద్ద‌రిని మాట్లాడుకోనివ్వండి అంటూ సూచ‌న‌లిచ్చారు.

బాబుపై నెటిజన్ల ఫైర్‌..
ఎలిమినేషన్‌లో నామినేట్‌ అయినప్పటి నుంచి.. ముఖ్యంగా కౌశల్‌ రాజమౌళి విషయం ప్రస్తావించడంతో బాబు గోగినేని తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు కనపడుతోంది. తనే బిగ్గర్‌ బాస్‌నని చెప్పుకునే బాబు.. హుందాగా వ్యవహరించడం లేదని, ఇగోయిస్ట్‌గా ప్రవర్తిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్‌ తప్పించుకున్నా.. వచ్చే వారం బాబు హౌస్‌ వీడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. ‘ఇన్ని రోజులు బాబుపై ఎంతో గౌరవం ఉండేది.. కానీ ఈ చర్యతో అది పోయింది’ అని ఓ నెటిజన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక నేటి ఎపిసోడ్‌ ప్రోమోలో గీతా మాధురి కన్నీటి పర్యంతమైంది. ఆమెను తనీష్‌ ఓదార్చాడు.. మరో వైపు బాబు గోగినేని మాత్రం ఈ వారం తాను ఎలిమినేట్‌ అయితే.. కౌశల్‌, గీతా మాధురిలను బయటకు వచ్చేలా చేయడం తన పనిగా పెట్టుకుంటానని తెలిపాడు. దీంతో నేటి ఎపిసోడ్‌లో ఎం జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొంది.

చదవండి: బాబు గోగినేనిపై చర్యలకు రంగం సిద్ధం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top