సింహానికి గొంతు అరువిచ్చిన సిద్ధార్థ్‌

Siddharth Voice To The Lion King Movie - Sakshi

తమిళసినిమా: చిత్రాలకు నేపథ్య వాయిస్‌ను ప్రముఖ నటులు ఇవ్వడం ఆ చిత్రాలకు అదనపు బలంగానే మారుతోంది. ఇటీవల నటుడు విజయ్‌సేతుపతి అవేంజర్స్‌ చిత్రంలోని హీరో పాత్రకు డబ్బింగ్‌ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు సిద్ధార్థ్‌ ఏకంగా ఒక సింహానికే తన గొంతును అరువిచ్చారు. ఈ సంగతేంటో చూద్దాం. ఇంతకు ముందు హాలీవుడ్‌ చిత్రం ది జంగిల్‌బుక్‌ ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ చిత్ర నిర్మాణ సంస్థ డిస్నీ తాజాగా నిర్మించిన చిత్రం లయన్‌కింగ్‌. ఇంతకు ముందు నిర్మించిన జంగిల్‌బుక్‌ చిత్రం తరహాలోనే యానిమేషన్‌ చిత్రం అయినా లయన్‌ కింగ్‌ను మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బలమైన, భావోద్రేకాలతో కూడిన కథ, కథనాలతో తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఒక సింహం తన వీరత్వాన్ని నిరూపించుకుని తనకుంటూ ఒక స్థానాన్ని అధిరోహించడమే లయన్‌కింగ్‌ చిత్ర ఇతివృత్తం అయినా, పలు విశేషాలతో కూడిన చిత్రంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు.

లవ్, యాక్షన్‌లతో కూడిన చిత్రాలను సిల్వర్‌స్క్రీన్‌ చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తారన్నారు. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులను అద్భుతమైన విషయాలతో తరాల వారు కూడా ఇష్టపడే విధంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. అలాంటి లయన్‌కింగ్‌ చిత్రంలో సింహం పాత్రకు తమిళ వెర్షన్‌లో నటుడు సిద్ధార్థ్‌ వాయిస్‌ ఇవ్వడం మరో విశేషంగా పేర్కొన్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ  సింహాన్ని తాను వెండితెరపైనా, వేదికపైనా తొలిసారిగా చూసిన అనుభవాన్ని ఎప్పటికీ మరచిపోనన్నారు. ఈ కాలంలో మరచిపోలేని క్లాసిక్‌ చిత్రం లయన్‌కింగ్‌లో సింబాగా తాను మాట్లాడటం, పాడటం మరువలేని అనుభవంగా పేర్కొన్నారు. సినిమాలో తన కొత్త అవతారాన్ని ప్రేక్షకులతో కలిసి చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సిద్ధార్థ్‌ పేర్కొన్నారు. ది జంగిల్‌ బుక్‌ చిత్ర దర్శకుడు జాన్‌ ఫేవరునే ఈ లయన్‌కింగ్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో జూలై 19న తెరపైకి రానుంది.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top