ధనుష్‌కు ఆ విషయం తెలుసు | Sakshi
Sakshi News home page

ధనుష్‌కు ఆ విషయం తెలుసు

Published Sun, Apr 9 2017 10:58 AM

ధనుష్‌కు ఆ విషయం తెలుసు

ఒక దర్శకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం ధనుష్‌లో మెండుగా ఉందని సీనియర్‌ నటుడు, దర్శకుడు, నిర్మాత రాజ్‌కిరణ్‌ అన్నారు. ఏ నటుడితో ఎలా మాట్లాడి తనకు కావలసిన నటనను రాబట్టుకోవాలో తెలిసిన దర్శకుడు ధనుష్‌. ఒక దర్శకుడికి కావలసిన ప్రధాన లక్షణం అదే అన్నారు. ఇంతకు ముందు కథా నాయకుడిగా నటించిన రాజ్‌కిరణ్‌ ఇప్పుడు కథకు పాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనదైన నటనతో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటున్నారు. తాజాగా పవర్‌ పాండి అనే చిత్రంలో నాయకుడిగా నటించారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రం ద్వారా ప్రముఖ యువ నటుడు ధనుష్‌ దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టి తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మించడం. సీనియర్‌ నటి రేవతి మరో ప్రధాన పాత్రను పోషించిన ఇందులో ప్రసన్న, ఛాయాసింగ్, విద్యులేఖ రామన్, రిన్‌సన్, దీనా, ఆడుగళం నరేన్, భాస్కర్, మాస్టర్‌ ఎంపీ.రాఘవన్, బేబీ సవిశర్మ, సెండ్రాయన్, అతిథి పాత్రలో మడోనా సెబాస్టియన్, గౌరవ పాత్రల్లో దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, బాలాజీ మోహన్, రోబోశంకర్, దివ్యదర్శిని నటించారు. వేల్‌రాజ్‌ ఛాయాగ్రహణం, సాన్‌ రోల్డన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్‌ యూ సర్టిఫికెట్‌తో ఈ నెల 14న తెరపైకి రానుంది.

ఈ సందర్భంగా నటుడు రాజ్‌కిరణ్‌ పవర్‌పాండి చిత్ర అనుభవాలను శినివారం పాత్రికేయులతో పంచుకున్నారు. అవేమిటో ఆయన మాటల్లోనే చూద్దాం. ‘నేను సాధారణంగా కథ నచ్చక పోతే నటించడానికి అంగీకరించను. అందుకే 27 ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటికీ 25 చిత్రాలే చేశాను. ఈ పవర్‌ పాండి విషయానికి వస్తే తొలుత దర్శకుడు సుబ్రమణ్యం శివ తనను కలిసి ఒక చిత్రం చేయాలనీ, కథ సింగిల్‌ లైన్‌ చెప్పారు. అది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. వెంటనే చేద్దాం, దర్శక నిర్మాతలతో మాట్లాడదాం అని అన్నారు. అప్పుడు ఈ చిత్రానికి దర్శక నిర్మాత ధనుష్‌ అని చెప్పారు. ఆ తరువాత ధనుష్‌ కలిసి కథ చెప్పమంటారా అని అడిగారు. అప్పుడు నేను షూటింగ్‌కు వెళదాం అన్నాను. ఎందుకంటే ఆయన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మంచి మార్కెట్‌ ఉన్న నటుడు. ఆయన అడిగితే రజనీకాంత్‌ కూడా నటించడానికి రెడీ అం టా రు. అలాంటిది నన్ను ఈ చిత్రంలో కాథానాయకుడిగా ఎంచుకున్నారు. అందుకే నేను వెంటనే ఓకే అన్నాను. అలా పవర్‌ పాండి చిత్రం ప్రారంభం అయ్యింది. ధనుష్‌ ఎంచుకున్న కథలో చాలా మంచి సందేశం ఉంది.

ప్రతి ఇంటా ఇలాంటి తాత కావాలని కోరుకుంటారు
తాను తవమాయ్‌ తవమిరిందు చిత్రంలో నటించడానికి ముందు హీరోగా చూసేవాళ్లు. ఆ చిత్రం తరువాత అందరు తండ్రి స్థానంలో గౌరవం చూపేవాళ్లు. ఈ పవర్‌ పాండి చిత్రం చూసిన తరువాత ప్రతి కుటుంబంలో ఇలాంటి తాత ఉండాలని కోరుకుంటారు. అంత ఉన్నతమైన పాత్రను పవర్‌పాండిలో చేశాను. ఇందులో నేను మినహా అందరూ యువతే పని చేశారు. అయితే ఆ భావనే లేకుండా ఒక కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసిన అనుభూతి కలిగింది. ఈ విషయంలో ధనుష్‌ను అభినందించాలి. నటీనటులను చాలా గౌరవంగా, ఎవరికీ అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. ఇందులో నాకు రెండు పోరాట దృశ్యాలు కూడా ఉన్నాయి.

ఈ వయసులోనూ ఫైట్స్‌ దృశ్యాల్లో ఎలా నటించగలుగుతున్నారని అడుగుతున్నారు. నేను ముందుగా నా పాత్రను పూర్తిగా అర్థం చేసుకుంటాను. ఇక అందులోకి పరకాయ ప్రవేశం చేస్తాను. అది ఫైట్‌ అయినా సరే. పవర్‌ పాండి చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఇంటికెళ్లిన తరువాత ఓహో మనకి ఈ విషయం గురించి చెప్పారా? అన్న ఆలోచన వస్తుంది. అంతగా ప్రభావితం చేసే చిత్రంగా పవర్‌ పాండి ఉంటుంది’ అన్నారు. సంగీతదర్శకుడు సాన్‌ రోల్డన్‌ మాట్లాడుతూ ధనుష్‌కు సంగీతం పరిజ్ఞానం మెండన్నారు. తనకు ఏమి కావాలో తెలిసిన దర్శకుడని అన్నారు. అయినా తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారనీ పేర్కొన్నారు.« దనుష్‌ దర్శకత్వం వహించిన చిత్రానికి పనిచేయడం సంతోషంగా ఉందని ఛాయాగ్రాహకుడు వేల్‌రాజ్‌ పేర్కొన్నారు.  

మనిషి వృద్ధాప్య జీవితం గురించి
సగటు మనిషికి ఉద్యోగపరంగా 60 ఏళ్లకు పదవీ విరమణ ప్రకటిస్తున్నారు. ఆ వ్యక్తి చదువు పూర్తి చేసి, ఆ తరువాత ఉద్యోగం, పెళ్లి, పిల్లలు వారి పెంపకం, చదువులు ఇలా బాధ్యతలను పూర్తి చేసేసరికి పదవీ విరమణ స్థాయి చేరుకుంటాడు. ఇక వృద్ధాప్యంలో తనకంటూ ఏమీ ఉండదు. ఇక గౌరవం ఉండదు.అప్పడు ఆ వ్యక్తి వేదన వర్ణనాతీతం. అలా కాకూడదు, తన వృద్ధాప్యం గురించి ముందుగానే ఆలోచించి తన సంపాదనలో కొంత భాగాన్ని వెనకేసుకోవాలన్న సందేశంతో కూడిన చిత్రం పవర్‌ పాండి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement