
గెలుపే అతని లక్ష్యం!
ఆ యువకుడి ఇంటి పేరు గెలుపు. ఏం చేసినా అతడు ఓటమి అనేది ఎరగడు. దాంతో అందరూ అతణ్ణి ‘విన్నర్’ అంటుంటారు. ఈ విజేతకు ఓ సవాల్ ఎదురవుతుంది.
ఆ యువకుడి ఇంటి పేరు గెలుపు. ఏం చేసినా అతడు ఓటమి అనేది ఎరగడు. దాంతో అందరూ అతణ్ణి ‘విన్నర్’ అంటుంటారు. ఈ విజేతకు ఓ సవాల్ ఎదురవుతుంది. ఇటు తండ్రి లక్ష్యాన్నీ, అటు ప్రేయసి మనసునూ గెలవాలి? దాని కోసం ఈ యువకుడు ఏం చేశాడు? గెలుపే లక్ష్యంగా ఎలాంటి పోరాటం చేశాడు? అనే కథతో రూపొందుతోన్న చిత్రం ‘విన్నర్’. సాయిధరమ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే విదేశాల్లో షెడ్యూల్ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘టర్కీ దేశంలోని ఇస్తాంబుల్‌లో క్లైమాక్స్‌లోని యాక్షన్ సీన్లు తీశాం.
‘బాహుబలి’లోని మంచు కొండల్లో యాక్షన్ సీన్లు తీసిన స్టంట్ డెరైక్టర్ కలయాన్ ఆధ్వర్యంలో ఈ క్లైమాక్స్ చిత్రీకరించాం. అలాగే, ఉక్రెయిన్‌లో సాయిధరమ్‌తేజ్, రకుల్‌లపై రెండు పాటల్ని.. తేజ్, అనసూయలపై ఓ పాటను చిత్రీకరించాం. షెడ్యూల్ ప్రకారం చిత్రీకరణ జరుగుతోంది’’ అన్నారు. ‘‘జనవరితో చిత్రీకరణ పూర్తవుతుంది. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. జగపతిబాబు, ముఖేశ్ రుషి, అలీ, ‘వెన్నెల’ కిశోర్ నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, కళ: ప్రకాశ్, కూర్పు: ప్రవీణ్ పూడి, రచన: అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన, కెమేరా: ఛోటా కె.నాయుడు, సంగీతం: ఎస్.ఎస్.తమన్, సమర్పణ: ‘బేబీ’ భవ్య.