హీరో నితిన్‌కు హైకోర్టులో ఊరట

Relief to Hero nitin in Akhil movie issue - Sakshi

‘అఖిల్‌’మూవీ వివాదంలో నితిన్‌, సోదరిపై కేసు కొట్టివేత

సాక్షి, హైదరాబాద్‌: హీరో నితిన్, ఆయన సోదరి నిఖితారెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. ‘అఖిల్‌’ సినిమాకు సంబంధించి వారిపై సైబరాబాద్ 20వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి తీర్పు వెలువరించారు. ‘అఖిల్‌’ సినిమా హక్కుల విషయంలో తనవద్ద రూ.50 లక్షలు తీసుకుని, హక్కులు ఇవ్వకుండా తనను మోసం చేశారంటూ సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన గంగాధర సత్యనారాయణ అనే వ్యక్తి మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌ రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ 20వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో గతేడాది సెప్టెంబర్‌ 23న ఫిర్యాదు చేశారు.

నితిన్, నిఖితను మూడో, నాల్గో నిందితులుగా పేర్కొన్నారు. నితిన్‌ తండ్రి, నిర్మాత సుధాకర్‌రెడ్డిని రెండో నిందితునిగా, శ్రేష్ట్‌ మూవీస్‌ను మొదటి నిందితునిగా చేర్చారు. వారందరికీ కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై నితిన్, నిఖితారెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రేష్ట మూవీస్‌ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సత్యనారాయణ తన ఫిర్యాదులో నితిన్, నిఖితారెడ్డిలను శ్రేష్ట మూవీస్‌ సంస్థలో భాగస్వాములంటూ తప్పుగా పేర్కొని వారిపైనా కేసు పెట్టారని, అందులో వారు భాగస్వాములు కాదని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను హైకోర్టు ఆమోదించి కేసును కొట్టివేసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top