నిశ్శబ్ద యుద్ధం ముగిసిందా..?

నిశ్శబ్ద యుద్ధం ముగిసిందా..? - Sakshi

సినిమా పరిశ్రమలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఈ మాటలను చాలామంది నిజం చేశారు కూడా. తాజాగా, అమితాబ్, ఆయన సతీమణి జయాబచ్చన్, రేఖ కూడా ఆ లిస్ట్‌లో చేశారు. 1970- 80 మధ్య కాలంలో ఆన్‌స్క్రీన్ పరంగా హిట్ పెయిర్ అనిపించుకున్న అమితాబ్, రేఖల మధ్య ఆఫ్ స్క్రీన్ ఎఫైర్ ఉండేదనే వార్తలు అప్పట్లో వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య ‘సమ్‌థింగ్’ ఉందనే కారణంగానో ఏమో! రేఖతో జయాబచ్చన్ మాట్లాడటానికి ఇష్టడేవారు కాదు. రేఖ కూడా అంతే. ఫైనల్‌గా అమితాబ్, రేఖ కలిసి నటించడం కూడా మానేశారు.

 

  ఈ ఇద్దరూ జంటగా నటించిన చివరి చిత్రం ‘సిల్‌సిలా’ విడుదలై 33 ఏళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో ఎన్నో వేడుకల్లో జయ, రేఖ తారసపడ్డారు కానీ, చూసీ చూడనట్లుగా ఉండిపోయేవారు. చివరికి రాజ్యసభలో రేఖ అడుగుపెట్టగానే జయాబచ్చన్ తన సీటుని మార్పించుకున్నారు కూడా. ఈ సంఘటనతో ఇక వీరి మధ్య ఎప్పటికీ మాటలు కలవవని చాలామంది ఫిక్సయ్యారు. అమితాబ్, రేఖల మధ్య కూడా మాటామంతీ ఉండేవి కావు. ఇన్నేళ్లుగా ఈ ముగ్గురి మధ్య జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధానికి ఈ సంక్రాంతి నాడు తెరపడింది. 

 

 ఇటీవల జరిగిన ఓ అవార్డ్ వేడుకలో అమితాబ్, జయ, రేఖ పాల్గొన్నారు. రేఖని చూసిన అమితాబ్ చేతులు జోడించి నమస్తే చెబితే... రేఖ కూడా ప్రతి నమస్కారం చేశారు. అలాగే, జయా, రేఖ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని, స్నేహంగా నవ్వుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. ఫొటో జర్నలిస్ట్‌లైతే ఈ అరుదైన దృశ్యాన్ని కెమెరాల్లో బంధించడానికి పోటీపడ్డారు. మరి, మూడు దశాబ్దాలుగా ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం అన్నట్లుగా ఉన్న వీరి మధ్య హఠాత్తుగా స్నేహం కుదరడానికి కారణాలేమిటో తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇది మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామమే!

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top