‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ).. ఈ రియాలిటీ షో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ షో అంత పాపులర్ కావడానికి ప్రధాన కారణం అమితాబ్ బచ్చన్. 17 సీజన్లుగా ఈ షోకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ‘కేబీసీ’ సీజన్ 17 గ్రాండ్ ఫినాలే శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ ఎపిసోడ్‌లో ఆరంభంలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ–‘‘25 ఏళ్లుగా ‘కేబీసీ’ షోతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్నాను.
నా జీవితంలో మూడింట ఒక వంతు సమయాన్ని ఈ కార్యక్రమం కోసమే వెచ్చించాను. సామాన్యుల జ్ఞానానికి అగ్నిపరీక్షలా నిలిచే ఈ వేదికపై ఇంతకాలం హోస్ట్‌గా ఉండటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నవ్వితే నాతోపాటే నవ్వారు వీక్షకులు.. నా కళ్లలో నీళ్లు తిరిగితే మీ కళ్లు చెమ్మగిల్లాయి. మీరు ఇలా తోడుగా ఉన్నంత వరకు ఈ గేమ్ షో ఇలానే కొనసాగుతుంది. థ్యాంక్యూ’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు అమితాబ్.


