రకుల్‌కు లక్కీచాన్స్‌?

Rakul Preet Singh To Act in Vijay 64 - Sakshi

నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కోసం లక్కీచాన్స్‌ ఎదురుచూస్తోందా? ఇందుకు అవుననే టాక్‌ కోలీవుడ్‌లో వైరల్‌ అవుతోంది. నిజానికి ఈ బ్యూటీ మార్కెట్‌ చాలా డౌన్‌లో ఉందన్నది వాస్తవం. ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్తీతో రొమాన్స్‌ చేసిన దేవ్‌ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఆ తరువాత ఇంకా ఎక్కువ నమ్మకం పెట్టుకున్న సూర్య సరసన నటించిన ఎన్‌జీకే చిత్రం ఆశించిన విజయాన్ని అందించలేదు. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న చిత్రం ఒక్కటే సెట్స్‌ మీద ఉంది.

అయినా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను అదృష్టం విడనాడలేదనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం ఈ అమ్మడికి ఇళయదళపతి విజయ్‌తో జతకట్టే అవకాశం ఎదురు చూస్తుందన్నదే. సర్కార్‌ వంటి సంచలన చిత్రం తరువాత విజయ్‌ తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అగ్రనటి నయనతార నాయకిగా నటిస్తోంది. ఏజీఎస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో విజయ్‌ మహిళా ఫుట్‌బాల్‌ క్రీడా శిక్షకుడిగా నటిస్తున్నారు.

ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ వేగంగా జరుపుకుంటోంది. కాగా విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇది వరకే వెల్లడించారు.

కాగా విజయ్‌ మరో చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించేదెవరన్న విషయంలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. శంకర్, ఏఆర్‌.మురుగదాస్, వినోద్, పేరరసు, మోహన్‌రాజా ఇలా చాలా మంది దర్శకులు విజయ్‌ కోసం కథలను తయారు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా యువ దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈయన ఇంతకు ముందు మానగరం వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం కార్తీ హీరోగా ఖైదీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విజయ్‌ హీరోగా చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు. దీన్ని విజయ్‌ కుటుంబ బంధువైన బ్రిట్టో నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ నిర్మాత ఇంతకు ముందు విజయ్‌కాంత్, విజయ్‌ కలిసి నటించిన సెంథూరపాండి, విజయ్‌ హీరోగా రసిగన్‌ వంటి చిత్రాలను నిర్మించారు.

తాజాగా విజయ్‌తో నిర్మించనున్న ఈ చిత్రంలో కన్నడ నటి, తెలుగులో క్రేజీ నాయకిగా వెలిగిపోతున్న రష్మిక నటించనున్నట్లు ప్రచారం హోరెత్తింది. కానీ ఇప్పుడురకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ అవకాశం కనుక రకుల్‌ను వరిస్తే తను నిజంగా లక్కీనే. చూద్దాం మరి కొద్ది రోజుల్లో విజయ్‌ 64వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top