
‘‘తెలుగువారు మరచిపోలేని, మరచిపోకూడని, మరచిపోని గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అటువంటి గొప్ప వ్యక్తిపై ‘మన అక్కినేని’ పేరుతో చక్కటి పుస్తకాన్ని సంజయ్ కిశోర్ తీసుకు రావడం చాలా సంతోషం’’ అన్నారు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రముఖ సినీ పరిశోధకులు సంజయ్ కిశోర్ రచించి, సేకరించి, రూపొందించిన ‘మన అక్కినేని’ ఫొటో బయోగ్రఫీ పుస్తకావిష్కరణ వేడుకకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ– ‘‘అక్కినేనిగారు అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్నీ, వారి జీవితంలో వివిధ పార్శా్వలను చిత్రసమేతంగా మన కళ్ళకు కట్టినట్లు ఈ పుస్తకంలో చూపించారు. ఏయన్నార్ గొప్పతనాన్నీ, నాటి తెలుగు సినిమా వైభవాన్నీ ప్రజలంతా చూసుకునే అవకాశాన్ని ఈ పుస్తకం ద్వారా కల్పించిన సంజయ్ కిశోర్‌ని అభినందిస్తున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.