ఏ దుస్తులు వేసుకోవాలో అడగాలి: నటుడు

ఏ దుస్తులు వేసుకోవాలో అడగాలి: నటుడు

  • ఆర్టిస్టులకు నిలువుటద్దం మాయాబజార్‌

  • సినీ నటుడు జయప్రకాష్‌ రెడ్డి

  • ఘనంగా మాయాబజార్‌ షష్టిపూర్తి మహోత్సవం

  • సాక్షి, నాంపల్లి : మాయాబజార్‌ చిత్రంలోని ఏ సన్నివేశం చూసినా నటించే నటన ఎంతో సహజంగా కనిపిస్తుంది కానీ ఈ రోజు ఆ అవకాశం లేదని సినీ నటుడు జయప్రకాష్‌ రెడ్డి అన్నారు. ఈ రోజుల్లో షూటింగ్‌కు వెళ్లాక ఈ రోజు నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలి బాబు అని అడగాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అప్పుడు అలాంటి పరిస్థితి ఉండేదికానీ నెలజీతం కోసం కొన్ని నెలల పాటు రిహార్సల్స్‌ చేసేవారన్నారు.  



    సాహిత్య సంగీత సమాఖ్య సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లి తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో విజయ వారి మాయాబజార్‌ షష్టిపూర్తి మహోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాయాబజార్‌ చిత్ర విశ్లేషకులుగా హాజరైన జయప్రకాష్‌రెడ్డి, రచయిత వెన్నెలకంటి, సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, చాయాగ్రాహకులు ఎస్‌. గోపాల్‌రెడ్డి, నాట్య కళాకారిణి శోభానాయుడు, సినీనటులు తనికెళ్ల భరణి, ప్రఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాస్, శాంతా బయోటెక్‌ అధినేత కెఐ వరప్రసాదరెడ్డి, బి. వెంకటరామరెడ్డి, బి. భారతిరెడ్డి హాజరై విశ్లేషించారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రోజుల్లో సహజంగా నటించే సన్నివేశాలు లేవనన్నారు.



    ప్రతి ఆర్టిస్టుకు మాయాబజార్‌ చిత్రం ఓ నిలువుటద్దం లాంటిదన్నారు. సావిత్ర శశిరేఖ లాగా నటించడమంత గొప్పది కాదేమో కానీ, ఘటోత్కచునిగా నటించడం మాత్రం చాలా గొప్ప సన్నివేశమన్నారు. ప్రతి పాత్రకు జీవం పోసిన చిత్రం మాయాబజార్‌ మరువలేనిదిగా నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా విశాఖ హ్యూమర్‌ క్లబ్‌ సంస్థ ఆధ్వర్యంలో పిబరే హ్యూమరసం కడుపుబ్బా నవ్వించే ఆరోగ్యదాయకమైన సభ్యతతో కూడిన లఘు ప్రహసనాల కార్యక్రమం జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top