తల్లి–తనయుడు–ఇద్దరు మనవళ్లు.. ఓ సినిమా

తల్లి–తనయుడు–ఇద్దరు మనవళ్లు.. ఓ సినిమా


విఠలాచార్య.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇప్పుడున్న  టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే జానపద చిత్రాలు తీసి, ప్రేక్షకుల చేత ఔరా అనిపించారాయన. అటువంటి గొప్ప దర్శకుడి పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘నందిని నర్సింగ్‌ హోమ్‌’ ఫేమ్‌ నవీన్‌ విజయ కృష్ణ, అనీషా ఆంబ్రోస్‌ జంటగా, నరేశ్, ఇంద్రజ కీలక పాత్రల్లో సుహాస్‌ మీరా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విఠలాచార్య’  గురువారం ప్రారంభమైంది.



ముహూర్తపు సన్నివేశానికి నటి–దర్శకురాలు విజయనిర్మల కెమెరా స్విచ్చాన్‌ చేయగా సూపర్‌స్టార్‌ కృష్ణ క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు బి.గోపాల్‌ గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా బ్రోచర్స్‌ను మరో దర్శకుడు కోదండ రామిరెడ్డి విడుదల చేసి, కృష్ణకు అందించారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘విఠలాచార్యతో ‘ఇద్దరు మొనగాళ్లు’ సినిమాకు పనిచేశా. ఆయన ఎన్నో హిట్‌ చిత్రాలు తీశారు. నరేశ్, నవీన్‌ కలిసి చేస్తున్న  ఈ సినిమా కోసం నేనూ వెయిట్‌ చేస్తున్నా’’ అన్నారు.‘‘మా తరతరాలు నటీనటులుగా కొనసాగుతారు. మా పెద్ద మనవడితో పాటు చిన్న మనవడు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు’’ అన్నారు విజయనిర్మల.



‘‘పరుచూరి వెంకటేశ్వరరావుగారి దగ్గర రచనలోనూ, దర్శకుడు గుణశేఖర్‌గారి వద్ద టెక్నికల్‌ విభాగాల్లోనూ పనిచేశా. డైరెక్టర్‌గా చాన్స్‌ ఇచ్చిన నిర్మాతలకు Sథ్యాంక్స్‌’’ అన్నారు సుహాస్‌ మీరా. నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘మాస్, ఫ్యామిలీ, యూత్‌ కాన్సెప్ట్‌ చిత్రమిది. ఇందులో నా ఇద్దరు కుమారులతో పాటు మా అమ్మగారు (విజయ నిర్మల) నటిస్తున్నారు’’ అన్నారు. రచయితలు పరుచూరి బ్రదర్స్, నిర్మాత మల్కాపురం శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: సత్య కశ్యప్, నిర్మాతలు: ఎస్‌.కె.విశ్వేశ్‌బాబు, కె.ఎస్‌.టి.యువరాజ్, యం.వి.కె.రెడ్డి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top