సాక్షి, హైదరాబాద్ : వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్, జూనియర్ ఆర్టిస్ట్ అనురాగ్ వినిల్ (నాని) ఆత్మహత్య కలకలం రేపుతోంది. వారం రోజుల కిందట అనురాగ్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. అతడు ఆత్మహత్య చేసుకున్న స్థలం, వివరాలపై భిన్న కథనాలు వెలుగు చూస్తున్నాయి. వికారాబాద్ సమీపంలోని మర్పల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు చెబుతుండగా, హైదరాబాద్ నాగోల్ మమత నగర్‌లో సూసైడ్ చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
కొందరు అనురాగ్‌ను వేధింపులకు గురిచేస్తున్నారని, కొందరి ప్రోద్బలంతో అతడు బలవన్మరణం చెందాడని తెలుస్తోంది. పలు షార్ట్‌ఫిల్మ్స్‌లకు అనురాగ్ పని చేశాడు. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా జరగడం అతడి కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేని కుటుంబసభ్యులు వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 9వ తేదీన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనురాగ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.



 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
