మీకు మాత్రమే చెప్తా : మూవీ రివ్యూ

Meeku Maathrame Chepta Movie Review and Rating in Telugu - Sakshi

టైటిట్‌: మీకు మాత్రమే చెప్తా
జానర్‌: యుత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్
నటీనటులు: తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్
దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్
నిర్మాతలు: వర్ధన్ దేవరకొండ, విజయ్ దేవరకొండ
బ్యానర్‌: కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న నటుడు విజయ్‌ దేవరకొండ. ఎలాంటి వారసత్వం లేకపోయినా.. చిన్నచిన్నగా అడుగులు వేస్తూ.. పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందంలాంటి సినిమాలతో టాలీవుడ్‌ స్టార్‌ హీరోగా ఎదిగిన విజయ్‌.. ఇటు నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో తనకు మంచి బ్రేక్‌ ఇచ్చిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. ఆయన తొలిసారిగా నిర్మించిన యుత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మీకు మాత్రమే చెప్తా’ . ఈ సినిమాతో దర్శకుడి రోల్‌ నుంచి హీరో రోల్‌లోకి తరుణ్‌ భాస్కర్‌ షిఫ్ట్‌ అవ్వగా.. అతని సరసన కన్నడ నటి వాణీభోజన్‌ హీరోయిన్‌గా నటించింది. విజయ్‌ నిర్మాతగా మారడం, తరుణ్‌ హీరో అవతారం ఎత్తడంతో సహజంగానే యుత్‌లో ఈ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. అనుకున్నట్టుగానే యుత్‌ను ఈ సినిమా ఆకట్టుకుందా? ఒకప్పుడు ‘పెళ్లిచూపులు’  సినిమాతో విజయ్‌-తరుణ్‌ జోడీ టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు మారిన రోల్స్‌తో ఈ ఇద్దరు మరోసారి ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేశారా?

కథ:
రాకేశ్‌ (తరుణ్‌ భాస్కర్‌), కామేశ్‌ (అభినవ్‌ గోమటం) జాన్‌జిగిరీ దోస్తులు. ఒక టీవీ చానెల్‌లో ఇద్దరూ పనిచేస్తుంటారు. రాకేశ్‌, కామేశ్‌ ఇద్దరూ డాక్టర్లను ప్రేమిస్తారు. రాకేశ్ ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తుంటాడని ప్రతి విషయంలోనూ అతని లవర్‌ స్టెఫీ అనుమానిస్తూ ఉంటుంది. పెదవాళ్లను ఒప్పించి రాకేశ్‌ స్టెఫీని పెళ్లాడేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో పెళ్లికి రెండురోజుల ముందు రాకేశ్‌ ఫోన్‌కు ఒక వీడియో వస్తుంది. ఒక అమ్మాయితో హానీమూన్‌లో గడుపుతున్నట్టు ఆ వీడియో ఉంటుంది. ఎవరో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియో పెళ్లికి ముందు బయటపడితే.. తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని రాకేశ్‌ తీవ్రంగా టెన్షన్‌ పడుతుంటాడు. మరోవైపు స్టెఫీని లవ్‌ చేస్తున్న ఆమె బావ జాన్సన్‌ పెళ్లిని ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇంకోవైపు ప్రతి విషయంలో రాకేశ్‌ అబద్ధాలు చెప్తున్నాడని స్టెఫీని అనుమానిస్తుంటుంది. అసలు ఈ వీడియో ఎక్కడిది? నిజంగానే ఓ యువతితో రాకేశ్‌ గడిపాడా? ఆ వీడియోను డిలీట్‌ చేసేందుకు రాకేశ్‌, కామేశ్‌ ఏం చేశారు? కింగ్‌ హ్యాకర్‌ ఎవరు? చివరకు రాకేశ్‌ పెళ్లి ఎలా జరిగింది? కామేశ్‌ మీకు మాత్రమే చెప్తా అని మొదలుపెట్టిన ఈ కథ అసలు ఎవరిది అన్నది తర్వాతి కథ.

విశ్లేషణ:
ప్రజల వ్యక్తిగత విషయాలు సోషల్‌ మీడియాలో లీకై రచ్చరచ్చ అవ్వడం.. ఎన్నో దురాగతాలు జరగడం చూస్తూనే ఉన్నాం. ఇది సుమారు అలాంటి కథే కానీ, కేవలం కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఒక చిన్న పాయింట్‌ చుట్టే దర్శకుడు షమ్మీర్‌ ఈ కథను తిప్పాడు. ఎంచుకున్న పాయింట్‌ కొత్తదే అయినప్పటికీ.. పెద్దగా ట్విస్టులు, మలుపులు లేకుండా కేవలం కామెడీ ఎంటర్‌టైనర్‌గా మలచడంపైనే దర్శకుడి దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. పెళ్లికి రెండురోజుల ముందు తన ‘పర్సనల్‌ వీడియో’  బయటపడటంతో ఓ వ్యక్తి ఎలాంటి తిప్పలు పడ్డాడన్నది ఆసక్తికరంగా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు కొంతమేరకు సక్సెస్‌ అయ్యాడు. ఫస్టాఫ్‌ అంతా కామెడీతో ప్రేక్షకులను నవ్వించేలా సాగుతోంది. అయితే, సెకండాఫ్‌లో అంతగా కామెడీ లేకపోవడంతోపాటు స్క్రీన్‌ప్లే పెద్దగా ఇంట్రస్టింగ్‌గా సాగకపోవడంతో సాగదీసిన ఫీలింగ్‌ కలుగుతుంది. తొలిసారిగా హీరోగా చేసిన తరుణ్‌ భాస్కర్‌ తన నటనతో సినిమాకు ప్లస్‌ అయ్యాడు. చాలా సీన్లలో తరుణ్‌ సహజంగా నటించాడు. తరుణ్‌ ఫ్రెండ్‌ కామేశ్‌గా అభినవ్‌ గోమటం మరోసారి అలరించాడు. తనదైన స్టైల్‌లో సినిమాలో నవ్వులు పూయించాడు. హ్యాకర్‌ పపా అక్కగా అనసూయ కీలక పాత్రలో కనిపించారు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా.. నేపథ్య సంగీతం సినిమాను బాగా ఎలివేట్‌ చేసింది. వాణీ భోజన్‌, పావని గంగిరెడ్డి, నవీన్‌ జార్జ్‌ థామస్‌ తమ పరిధిలో పాత్రలకు న్యాయం చేశారు. సినిమా చివర్లో వచ్చే ‘మీకు మాత్రమే చెప్తా’ పాటలో విజయ్‌ దేవరకొండ అలరించాడు. మొత్తానికి విజయ్‌-తరుణ్‌ తమ రోల్స్‌ మార్చుకొని కొత్త రోల్స్‌తో తీసిన ఈ సినిమా యూత్‌ను కొంచెం ఆకట్టుకోవచ్చు.

బలాలు
తరుణ్‌ భాస్కర్‌
కామెడీ
ఫస్టాప్‌

బలహీనతలు
సెకండాఫ్‌
కొన్ని సాగదీత సీన్లు
 

- శ్రీకాంత్‌ కాంటేకర్‌

Rating:  
(2.5/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top