బోల్డ్ రకుల్

Marjaavan to De De Pyaar De Rakul Preet has a busy year ahead - Sakshi

బోలెడు మాటలు చెప్పింది... అన్నీ బోల్డే.ఎవరైనా నాతో తిక్క పని చేస్తే రక్కుతానంది.చికుముకు రవ్వే.. రాంగ్‌ సైడ్‌లో రబ్బు చేస్తే ఫైరే.ఎవరో డామ్‌ డిషుకు ఫెల్లో.. డామ్‌ డిషుకు కామెంట్‌ పెడితే.. రక్కేసింది.అది మీడియా అంతా పొక్కేసింది.మరి ‘వాట్‌ డు యు థింక్‌’ అని మేమడిగితే.. బోలెడు విషయాలు బోల్డుగా చెప్పింది.

తెలుగు సినిమా షూటింగ్స్‌లో లేరు కానీ ఫుల్‌ బిజీగా ఉన్నట్లున్నారు?
రకుల్‌: అవును. హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘మర్జావాన్‌’ అనే సినిమా చేస్తున్నాను. అజయ్‌ దేవగన్‌తో ‘దే దే ప్యార్‌ దే’ పూర్తి చేశాను. ఈ సినిమాకి 80 రోజులు వర్కింగ్‌ డేస్‌ ఇచ్చాను. తమిళంలో కార్తీతో చేసిన ‘దేవ్‌’ వేలంటైన్స్‌ డేకు రిలీజ్‌ అవుతుంది. తెలుగులోనూ ఈ సినిమా విడుదలవుతుంది.

అలాగే సూర్యగారితో ‘ఎన్‌జీకే’ పూర్తి చేశా. సమ్మర్‌లో ఈ సినిమా వస్తుంది. తెలుగులో కమిట్‌ అయిన ‘వెంకీమామ’ íసినిమా షూటింగ్‌ త్వరలో ఆరంభం అవుతుంది. తమిళంలో శివకార్తికేయన్‌తో కూడా ఓ సినిమా ఉంది. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలున్నాయి. హిందీ, తమిళ సినిమాలు చేయడంవల్ల తెలుగు సినిమాలు ఒప్పుకునే వీల్లేకుండా పోయింది. అయితే ఈ ఇయర్‌ తెలుగు రిలీజ్‌లుంటాయి.

తెలుగు ప్రేక్షకులకు లాస్ట్‌ ఇయర్‌ మిమ్మల్ని మిస్‌ అయిన ఫీలింగ్‌ ఉంది. మీక్కూడా ఉందా?
కెరీర్‌ ఆరంభించిన ఈ ఐదారేళ్లలో వరుసగా నాలుగేళ్లు నావి 16 సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. లాస్ట్‌ ఇయర్‌ రిలీజ్‌లు లేవు. ప్రతి ఏడాదీ నన్ను ఎక్కువ సినిమాల్లో చూసి ఒక్క ఏడాది లేకపోవడంతో మిస్సయిన ఫీలింగ్‌ కలగడం సహజం. తెలుగు సినిమాలు చేయకపోయినా నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఎంత ప్రేముంటే ఇక్కడ ఇల్లు కొనుక్కున్నానో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్‌గా నాకో గుర్తింపు, గౌరవం అన్నీ తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చాయి. తెలుగుని మాత్రం వదలను. ప్రేక్షకులు చూసినన్ని రోజులు చేస్తూనే ఉంటా. 

 ‘బాహుబలి’ లాంటి సినిమాలను వదిలేస్తే జనరల్‌గా ఒక రెగ్యులర్‌ సినిమాకి హీరోయిన్‌ ఇచ్చే డేట్స్‌ 40, 50 రోజుల్లోపే ఉంటాయి. ‘దే దే ప్యార్‌..’కి 80 రోజులిచ్చారంటే ఆ సినిమా స్పెషాల్టీ ఏంటి?
నా కెరీర్‌లో ఎక్కువ వర్కింగ్‌ డేస్‌ ఈ సినిమాకే ఇచ్చాను. ఆల్రెడీ పెళ్లయిన కథానాయకుడు తనకంటే చాలా చిన్న అమ్మాయిని ప్రేమించే లవ్‌స్టోరీ ఇది. డిఫరెంట్‌గా ఉంటుంది. పైగా ముంబైలో స్టైల్‌ వేరే ఉంటుంది. స్క్రిప్ట్‌ చదవడం, రిహార్సల్స్‌ చేయడం వంటి వాటికి ఎక్కువ టైమ్‌ తీసుకుంటారు. అందుకోసం వర్కింగ్‌ డేస్‌ పెరుగుతాయి. ప్లస్‌ ఇదొక డిఫరెంట్‌ మూవీ కాబట్టి ఎక్కువ రోజులు పట్టింది.

బాలీవుడ్‌లో కొంచెం ఇన్‌సెక్యూర్‌గా అనిపిస్తుందని ఇక్కడ సినిమాలు చేసి అక్కడికెళ్లిన ఓ హీరోయిన్‌ అన్నారు. మీకేమైనా అభద్రతాభావం? 
కచ్చితంగా ప్రెషర్‌ అయితే ఉంటుంది. ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏదైనా మన మనస్తత్వం మీదే ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడి సినిమాలకు ఎంత కష్టపడతానో హిందీ సినిమాలకూ అంతే కష్టపడతాను. బాలీవుడ్‌ కదా.. ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అనుకోను. ఎక్కడికెళ్లినా కాన్ఫిడెన్స్‌ ఉండాలి. నాకది ఎక్కువ. నా పని మీద నాకు నమ్మకం ఎక్కువ. అందుకే హిందీకి వెళ్లినప్పుడు ఏమీ అనిపించలేదు. ఆత్మవిశ్వాసం లేకపోతే సౌత్‌లోనూ అభద్రతాభావం అనిపించొచ్చు. 

బాలీవుడ్‌లో ముఖ్యంగా ‘ఫిజిక్‌’కి ప్రాధాన్యం ఇస్తారు. మీ ఫిజిక్‌ అటు నార్త్‌కు కూడా సూట్‌ అయ్యేలా ఉంటుంది కాబట్టి మీ కాన్ఫిడెన్స్‌కి అదొక కారణమా? 
ఫిజిక్‌తో ఏం సంబంధం లేదు. నేను సన్నగా ఉన్నాను.. అందుకే కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతున్నాను అనుకుంటే తప్పు. మన పని మనం సక్రమంగా చేయాలి. వర్క్‌లో బెస్ట్‌ అయితే ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్‌ వచ్చేస్తుంది. మన ఫిజిక్‌ ఎలా ఉండాలనేది మన చాయిస్‌. ఈ మధ్య వెయిట్‌ తగ్గాను. ‘దే దే ప్యార్‌ దే’ కోసం కొంచెం పెరిగాను. స్క్రిప్ట్‌ బావుండి వెయిట్‌ పెరగాలంటే పెరుగుతాను. తగ్గాలంటే తగ్గుతా. అదే కదా యాక్టర్‌ జాబ్‌. 

ఓ 20–30 కేజీలు పెరగమంటే పెరుగుతారా?
30 అయితే వద్దు (నవ్వుతూ) అది ఆరోగ్యకరం కూడా కాదు. 20 కూడా సేఫ్‌ కాదు. అంత పెరిగి మళ్లీ నార్మల్‌కి రావాలంటే ఈజీగా సంవత్సరం పడుతుంది. 10 కేజీల వరకూ ఓకే. అంతకన్నా బరువు పెరగాలంటే ఎలాగూ ఇప్పుడు వీఎఫ్‌ఎక్స్‌ ఉండనే ఉంది. దాంతో లావుగా కనిపించేలా చేయొచ్చు. లేదా బట్టల ద్వారా కూడా మేనేజ్‌ చేయొచ్చు. అంతేకానీ 20, 30 కేజీలు బరువు పెరిగితే వేరే సినిమాల కోసం వెంటనే బరువు తగ్గాల్సి వస్తుంది. అప్పుడు ఏదేదో చేసేసి అర్జంటుగా తగ్గితే ఆరోగ్యానికి నష్టం. 

మీరిలా సన్నగా ఉండటంతో ‘ఇది హెల్దీ కాదు.. కడుపు మాడ్చుకోవద్దు’ అని కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. దానికేమంటారు? 
నేనవి చదవను. సోషల్‌ మీడియాలో పాజిటివ్, నెగటివ్‌ రెండూ ఉంటాయి. నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వండి. లేకపోతే ఫాలో అవ్వకండి అనుకుంటాను. నేను మీరేం తింటున్నారు? ఏం చేస్తున్నారు అని ఎవరినీ అడగడంలేదు. ఉచిత సలహాలు ఇవ్వడంలేదు. నా లైఫ్‌ నా ఇష్టం. నేనేం తినాలి? ఎలాంటి డ్రస్సులు వేసుకోవాలి? బరువు ఎంత ఉండాలి? అనేది నా ఇష్టం.

అయితే నా వర్క్‌లో ఏదైనా ప్రాబ్లమ్‌ ఉంటే చెప్పండి. నా సినిమాల ఎంపిక విషయంలో సలహాలు ఇవ్వండి. తీసుకుని ఇంకా బెటర్‌గా వర్క్‌ చేస్తాను. మంచి పాత్రలు చేయడం లేదని, చేస్తుందని చెప్పండి. అవి చదువుతాను, పాటిస్తాను. కానీ ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఏం తినాలి? ఎలాంటి వర్కవుట్స్‌ చేయాలని సలహాలు ఇవ్వొద్దు. అవి చదవను. పొరపాటున చదివినా పాటించను. 

ఎలాంటి డ్రస్సులు వేసుకోవాలో నా ఇష్టం అన్నారు. ఈ మధ్య మీరు కారులోంచి దిగుతున్న ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పెట్టి, ‘రకుల్‌ ప్యాంట్‌ వేసుకోవడం మరచిపోయింది’ అని కామెంట్‌ చేశారు. ఏమంటారు?
ఇప్పటివరకూ వచ్చిన నెగటివ్‌ ట్వీట్స్‌ని ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఈసారి పట్టించుకున్నాను. ఈ ప్యాంట్‌ కామెంట్‌ వచ్చిన ముందు రోజు నేనో ఈవెంట్‌కి వెళ్లాను. స్త్రీ సమానత్వం గురించిన కార్యక్రమం అది. ఆడవాళ్లు ఎలా ఉండాలి? ఎలా ఉంటే బాగుంటుంది? అనేదాని గురించి అక్కడ మాట్లాడటం జరిగింది. ఆ మర్నాడు కారులోంచి దిగినప్పుడు ఎవరో ఫొటో తీశారు. యాక్చువల్‌గా నేను వేసుకున్న జాకెట్‌ నా షార్ట్స్‌ని కవర్‌ చేసింది. అందుకని ఆ జాకెట్‌ మాత్రమే వేసుకున్నానని అనుకున్నారు. షార్ట్‌ కనిపించేలా ఉన్న ఫొటోలన్నీ బాగానే ఉన్నాయి. ఆ ఫొటోలను వదిలేసి వేరేవి పెట్టి, చెత్త కామెంట్‌ రాశారు. ఒళ్లు మండిపోయింది.

మీ డ్రెస్‌ గురించి మాత్రమే కాకుండా ‘కారులో ఎవరితో.... (రాయకూడని పదం), సిగ్గు లేదా? ప్యాంటు కూడా లేకుండా బయటకు వచ్చావు? అని సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తి అసభ్యంగా కామెంట్‌ చేస్తే, అతని తల్లిని ప్రస్తావిస్తూ మీరు స్పందించడాన్ని కొందరు విమర్శించడం గురించి?
‘మీ తల్లి కార్లో అలాంటి పనులు ఎక్కువ చేస్తారనుకుంటా. అందుకే నువ్వు ఎక్స్‌పర్ట్‌ అయ్యావు. ఆ తల్లి నీకు కొంచెం బుద్ధి ఇచ్చుంటే బావుండేది. నీలాంటి వాళ్లు ఉన్నంత వరకూ మహిళలకు రక్షణ లేదు. ఊరికే సమానత్వం గురించి, రక్షణ గురించి డిబేట్లు పెట్టడం వల్ల ఏ మంచీ జరగదు’ అనే విధంగా సమాధానం ఇచ్చాను. అతగాడి కామెంట్‌కి నేను ఓ నటిగా సమాధానం ఇవ్వలేదు.. ఓ అమ్మాయిలా స్పందించాను. యాక్టర్‌ రకుల్‌గా రిప్లై ఇచ్చి ఉంటే పొలిటికల్‌గా కరెక్ట్‌గా మాట్లాడాలి అనుకునేదాన్ని.

కానీ అక్కడ ఓ అమ్మాయిలా నా కోపాన్ని వ్యక్తపరిచాను. తమ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ల గురించి ఎవరైనా ఎలా పడితే అలా కామెంట్‌ చేస్తే వాళ్లకు ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్లు కూల్‌గా రియాక్ట్‌ అవుతారా? లేకపోతే వాళ్ల భాషలోనే చెబుతారా? అప్పటికప్పుడు ఏమనిపించిందో అది అనేస్తారు కదా. నేను కూడా అంతే. అయితే కొంచెం బెటర్‌గా చెప్పి ఉండొచ్చు కానీ అప్పుడు బాగా అప్‌సెట్‌ అయ్యాను. ఆ మూమెంట్‌లో అలా అనిపించింది. వాళ్లింటి ఆడవాళ్లను కామెంట్‌ చేస్తే ఎంత బాధగా ఉంటుందో వేరే ఆడవాళ్లకూ అంత బాధ ఉంటుందని తెలియాలి కదా. వాళ్లకూ ఓ ఫ్యామిలీ ఉంటుందని గుర్తు చేయడానికే అలా అన్నాను. నా కామెంట్‌ని విమర్శించేవాళ్లు నా గురించి ఘోరంగా కామెంట్‌ చేసినప్పుడు ఎందుకు సపోర్ట్‌ చేయలేదు?

బట్టలను బట్టి ‘ఈ అమ్మాయి ఈ టైప్‌’ అని జడ్జ్‌ చేయడం కరెక్టేనంటారా?
అస్సలు కాదు. ఎవరికి ఎలా సౌకర్యంగా అనిపిస్తే అలా బట్టలు వేసుకుంటారు. చిన్న బట్టలు వేసుకున్నవాళ్లు అదో టైప్‌ అనలేం. అయినా మన సమాజంలో చిన్న బట్టలు వేసుకున్న అమ్మాయిలను మాత్రమే కామెంట్‌ చేస్తున్నారా? చీర కట్టుకున్నవాళ్లనూ వదిలి పెట్టడంలేదు కదా. మారుమూల గ్రామాల్లో ఒంటి నిండా చీర కట్టుకుంటారు. అక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. సమస్య బట్టలది కాదు. ఆలోచనలది. ఆలోచనలో మార్పు రావాలి. నేను స్ట్రాంగ్‌గా రియాక్ట్‌ అయ్యేసరికి అతను అకౌంట్‌ని డిలీట్‌ చేశాడు. ఇలాంటి ఆకతాయిలను శిక్షించాలి. రేపు వీళ్లే రేపిస్టులు అవుతారు. అమ్మాయిలకు గౌరవం ఇవ్వాలి అనేది ఇంట్లో నేర్పించాలి. అమ్మాయి, అబ్బాయి ఒకటే అని నేర్పించాలి. అప్పుడే అమ్మాయిలపై వేధింపులు తగ్గుతాయి. 

హీరోయిన్స్‌ అంటే కొందరు చిన్న చూపు చూస్తుంటారు. అదేమైనా బాధగా ఉంటుందా?
ఎందుకు చూడాలి? మాది కూడా జాబే కదా. మా పర్శనల్‌ లైఫ్‌ అనేది పర్శనల్‌గా ఉండదు. మా జీవితంలో ఏం జరుగుతుందో పబ్లిక్‌కి కావాలి. జరుగుతున్నవాటి గురించి మాట్లాడుకుంటారు. జరగనివాటి గురించి చెప్పుకుంటారు. మేం ఏమీ చేయలేం. రోజుకి 18, 20 గంటలు వర్క్‌ చేస్తాం. నిద్ర ఉండదు. అయినా కూడా సినిమాని ఇష్టపడి వచ్చాం కాబట్టి ఏమీ అనిపించదు. ఇప్పుడు నాక్కూడా చాలామంది యాక్టర్స్‌ నచ్చరు. కొందరు బాగా నచ్చుతారు. అలాగే నేను అందరికీ నచ్చాలని లేదు. ‘నువ్వు నచ్చలేదు’ అనండి. ఓకే. బాగా నటించలేదు అంటే ఓకే. కానీ వల్గర్‌గా కామెంట్‌ చేయకూడదు కదా. 

ఇండస్ట్రీలో మీకెలాంటి అనుభవాలెదురయ్యాయి?
అది ఇండస్ట్రీ గురించి కాదు. ప్రపంచం గురించి. ఒక ఇండస్ట్రీని తప్పుబట్టడం కరెక్ట్‌ కాదు. అన్ని రంగాల్లో ఉంటుంది. 5–10 పర్‌సెంట్‌ మగాళ్ల ఆలోచనలు తప్పుగా ఉంటే మన కెరీర్‌ చాయిస్‌ తప్పు ఎందుకు అవుతుంది? ఇండస్ట్రీలో చాలామందికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేను ఫేస్‌ చేయలేదు. అయితే వాళ్లు ధైర్యంగా బయటికి వచ్చి చెప్పినప్పుడు మనం వినాలి. వాళ్లకు ధైర్యం ఇవ్వాలి. అంతేకానీ తప్పు పట్టకూడదు. (కొంచెం ఆవేశంగా).

ఓకే కూల్‌ రకుల్‌.. లవ్‌ లైఫ్‌కి వద్దాం. ఎన్ని లవ్‌ లెటర్స్‌ వచ్చాయి? 
ఫ్యాన్స్‌వి చాలా వస్తుంటాయి. నేను ప్రేమలో పడకూడదని అనుకుంటున్నాను. ఇప్పటివరకైతే ప్రేమలో పడలేదు. మా అమ్మ కూడా జోక్‌ చేస్తుంది. ‘సరే ఇప్పుడంటే బిజీగా ఉన్నావు. కానీ నీకోసం కూడా ఆలోచించుకో. మంచి లైఫ్‌ పార్టనర్‌ అవుతాడనిపించే అబ్బాయి ఉంటే చెప్పు. ఇంకో మూడు నాలుగేళ్లల్లో పెళ్లి చేయాలంటే నువ్వు ఎవరో ఒకర్ని ప్రేమించాలి’ అంటుంది. చిన్నప్పుడేమో ప్రేమించొద్దు అంటారు, కానీ ఇప్పుడు ప్రేమించమంటున్నారు? అని సరదాగా అంటుంటాను. సరైన మనిషి దొరకాలి. మీనింగ్‌ఫుల్‌ రిలేషన్‌షిప్‌ కావాలి అనుకుంటున్నాను. 80 లలో పుట్టి ఉండాలి అనిపిçస్తుంది.

అంటే ప్రస్తుతం ప్రేమలో నిజాయితీ ఉండటం లేదంటారా? 
అలా అని కాదు. నిజాయితీగా ప్రేమించేవాళ్లూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక్క సెకన్‌లో ‘ఐ లవ్‌ యు’ ఎలా చెబుతున్నారో ‘ఐ హేట్‌ యు’ అని అలాగే ఒక్క సెకన్‌లో చెబుతున్నారు. ప్రేమని కొందరు జోక్‌ చేసేశారు. 

బ్రేకప్‌కి చాలామంది చెప్పే కారణం ఎవరి ‘స్పేస్‌’ వారికి దక్కడం లేదు అని. కలిసి బతకాలనుకున్న తర్వాత ఎవరి స్పేస్‌ వారికి అంటే?
ఇద్దరూ కరెక్ట్‌ అయితే ఎవరి ప్రైవసీని వాళ్లు గౌరవించుకుంటారు. ఎవరి స్పేస్‌ వారు కోరుకోవడంలో తప్పులేదు. ఒకవేళ నేను రిలేషన్‌షిప్‌లో ఉంటే వంద ప్రశ్నలు వేయను. ప్రేమించడమంటే వేరే వ్యక్తిని కంట్రోల్‌ చేయడం కాదు. మనకు నచ్చిన వ్యక్తిని తనకు నచ్చినట్టు ఉండనివ్వటం. దాన్నే ‘స్పేస్‌’ ఇవ్వడం అంటారు. అంతవరకూ ఓకే. కానీ జీవిత భాగస్వామికి చెప్పుకోలేనన్ని రహస్యాలు ఉంటేనే ప్రాబ్లమ్‌. ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకోకుండా ఉండి కూడా కంఫర్ట్‌బుల్‌గా ఉండటమే లవ్‌. మంచి అనుబంధం అంటే ఎవరి డ్రీమ్‌ను వాళ్లు ఫాలో అవుతూ, వాళ్ల జీవితాలని అందంగా తయారు చేసుకోవడమే.

ఫైనల్లీ మీకు డ్రీమ్‌ ఏదైనా?
ప్రస్తుతం నా డ్రీమ్‌లోనే ఉన్నాను. యాక్టర్‌ అవ్వాలన్నది నా కల. అదే కంటిన్యూ చేస్తున్నాను. 

ఐదారేళ్ల క్రితం మీరు మామూలు అమ్మాయి. ఇప్పుడు సెలబ్రిటీ. మీలో వచ్చిన మార్పు గురించి?
అప్పటి రకుల్‌ ఇప్పటి రకుల్‌ ఒకటే. పెద్దగా ఏం మారలేదు. సెలబ్రిటీ అంటే ఇలా ఉండాలని కొత్తగా అలవాటు చేసుకున్నది ఏదీ లేదు. కాకపోతే స్క్రీన్‌ మీద బాగా కనపడాలి కాబట్టి అందం విషయంలో ఆరోగ్యం విషయంలో చాలా కేరింగ్‌గా ఉంటాం. ఫుడ్‌ హ్యాబిట్స్, లైఫ్‌ స్టైల్‌ మారాయి. మైండ్‌ సెట్‌ మాత్రం సేమ్‌. అందరూ 9–5 జాబ్‌ చేస్తారు. మాకు అలా టైమింగ్స్‌ ఉండవు.

షూటింగ్‌కి ప్యాకప్‌ చెప్పాక నేను నార్మలే. నా ఫ్యామిలీ నన్ను నార్మల్‌గా ఉంచుతుంది. నా ఫ్రెండ్స్‌ కూడా. ఇంకా చెప్పాలంటే ఇంత మంచి లైఫ్‌ ఇచ్చినందుకు పొగరు పెరగకూడదు. దేవుడికి థ్యాంక్‌ఫుల్‌గా ఉండాలి. రుణపడి ఉండాలి. దేవుడు మనకు ఇంత ఇస్తుంటే గర్వం చూపించడం దేనికి? అందుకే అందరితో బాగుంటాను. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటాను అనుకోవాలి. అదే మంచిది.

డల్‌ మూమెంట్‌ని ఎవరితో షేర్‌ చేసుకుంటారు?
నాతోనే. డల్‌గా అనిపిస్తే నాకు నేనే ఎనర్జీ ఇచ్చుకుంటాను. నా సొంత ప్రాబ్లమ్స్‌ను వేరే వాళ్ల దగ్గరకు తీసుకెళ్లను. ఫ్యామిలీని టెన్షన్‌ పెట్టను. నా సమస్యలను నేనే పరిష్కరించుకుంటా. సమస్యలు అందరికీ వస్తాయి. అయితే పరిష్కారం లేని సమస్య ఉండదు. డల్‌ మూమెంట్స్‌ లేకపోతే గ్రోత్‌ ఉండదు. కింద పడితేనే పైకి వెళ్లొచ్చు. సినిమా ఫ్లాప్‌ అయినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఒక్క రోజు మాత్రమే. జరిగింది జరిగిపోయింది. ఒకటి బాధపడటం. రెండోది నెక్ట్స్‌ ఏం చేయాలి? ఎలా చేయాలి? అనుకుని వెళ్లిపోవడం. అంతే.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top