ఈ వయసులో డ్యూయెట్లు నిజంగా శిక్షే : రజనీకాంత్

ఈ వయసులో డ్యూయెట్లు నిజంగా శిక్షే : రజనీకాంత్


‘‘నా మొదటి సినిమా తొలి సీన్ చేస్తున్నప్పుడు పడనంత టెన్షన్ ఈ సినిమా కోసం పడ్డాను. ఆ టెన్షన్‌కి కారణం ఇద్దరమ్మాయిలు’’ ...

 

 ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, అనుష్క, సోనాక్షీ సిన్హా హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు కీలక పాత్రలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ‘లింగ’ ఈ నెల 12న విడుదల కానుంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్రం పాటల విజయోత్సవం జరిగింది. ఈ వేడుకలో రజనీకాంత్ కాసేపు తమాషాగా, ఇంకాసేపు సీరియస్‌గా ప్రసంగించారు.

 

 ఇదో అద్భుతం

 ‘‘దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత నేను చేసిన చిత్రం ‘లింగ’. మధ్యలో ‘కోచడయాన్’ వచ్చినా అది యానిమేషన్ ప్రధానంగా సాగే సినిమా. ‘లింగ’ పరంగా కొన్ని అద్భుతాలు జరిగాయి. ఇది చాలా పెద్ద సినిమా. ఇందులో భారీ తారాగణం ఉన్నందువల్ల, భారీ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేయడం వల్ల ఈ చిత్రం పెద్దది అనడం లేదు. ఈ కథ చాలా గొప్పది. స్వాతంత్య్రం రాకమునుపు, ఆ తర్వాత జరిగే కథ ఇది.  ప్రధానంగా ఓ ఆనకట్ట నిర్మాణం నేపథ్యంలో సాగుతుంది. దాదాపు 60, 70 సన్నివేశాల్లో వేల మంది నటీనటులు, ఏనుగులు, రిస్కీ ఫైట్స్, పెద్ద పెద్ద సెట్స్.. ఇలా భారీ ఎత్తున ఉన్న ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి  చేయడం ఓ అద్భుతం. ఆ ఘనత టెక్నీషియన్లదే. అలాగే, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ ప్లానింగ్‌ని మెచ్చుకోవాల్సిందే.

 

 రాజమౌళితో సినిమా చేస్తా...

 30, 40 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలా? అని కేయస్ రవికుమార్, నేను ఆలోచించాం. ఎంత పెద్ద సినిమా అయినా తక్కువ సమయంలో పూర్తి చేయొచ్చని యువతరానికి చెప్పాలనుకున్నాం... సాధించాం. ఒక్క విషయం.. నేను ‘బహుబలి’ గురించి ప్రస్తావించడంలేదు. ఆ చిత్రాన్ని రాజమౌళి ఎంతో గొప్పగా తీస్తున్నారు. నేను కూడా షూటింగ్ చూశాను. తప్పకుండా భారతదేశంలో రాజమౌళి నంబర్ వన్ టెక్నీషియన్. అవకాశం వస్తే ఆయనతో సినిమా చేస్తా.

 

 ఈ ఇద్దరమ్మాయిలే కారణం

 నా మొదటి సినిమా ‘అపూర్వ రాగంగళ్’ మొదటి సీన్ అప్పుడు పడని టెన్షన్ ఈ చిత్రం అప్పుడు పడ్డాను. దానికి కారణం అనుష్క, సోనాక్షి. అనుష్క చాలా మంచి అమ్మాయి. సోనాక్షి నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. ఈ ఇద్దరితో డ్యూయెట్స్ అంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఏ ఆర్టిస్ట్‌కైనా భగవంతుడు విధించే శిక్ష ఏంటో చెప్పనా?.. 60 ఏళ్ల వయసులో అమ్మాయిలతో డ్యూయెట్లు పాడటం. అలాగే, జగపతిబాబు గురించి చెప్పాలి. మేమిద్దరం ‘కథానాయకుడు’లో నటించాం. కానీ, తనేంటో ‘లింగ’ సమయంలో అర్థమైంది. చిత్రపరిశ్రమలో నేను చూసిన జెంటిల్‌మెన్‌లో జగపతిబాబు ఒకరు.

 

 రజనీ సినిమాలో కథ ఉంటుందా అన్నారు

 ఈ నెల 12న లింగ’ విడుదల కానున్న నేపథ్యంలో ‘ఈ కథ మాది’ అంటూ చెన్నయ్‌కి చెందిన నలుగురు వ్యక్తులు కేసు పెట్టారు. దానికి స్పందిస్తూ.. ‘ఏంటీ రజనీ సినిమాలో కథ ఉంటుందా? ఆ కథ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. తప్పకుండా ‘లింగ’ చూడాలి’ అని కొంతమంది ట్విట్టర్లో స్పందించారు. ఈ సినిమాలో అద్భుతమైన కథ ఉంది. కానీ, ఆ కథ పొన్‌కుమరన్‌ది. ఆ నలుగురిదీ కాదు.

 

 నన్ను క్షమించండి

 హుద్ హుద్ బాధితుల సహాయార్థం తెలుగు చలన చిత్రపరిశ్రమ ‘మేము సైతం’ చేసిన రోజున రావాలనే అనుకున్నా. కానీ, మా కుటుంబానికి చెందిన రెండు ముఖ్యమైన పెళ్లిళ్లు ఉండటంతో రాలేకపోయా. నన్ను క్షమించండి. హుద్ హుద్ బాధితుల సహాయార్థం నా వంతుగా కొంత ఫండ్ ఇస్తా’’ అని రజనీకాంత్ చెప్పారు.

 

 అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘రజనీతో గతంలో సూపర్ హిట్ సినిమా తీశాను. మేమిద్దరం మరో సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. భవిష్యత్తులో మరో అవకాశం వస్తుందని భావిస్తున్నా’’ అని చెప్పారు. కె. విశ్వనాథ్ మాట్లాడుతూ -‘‘బాపుగారు, బాలచందర్‌గార్లతో వారం రోజులైనా పని చేయాలనీ, రజనీకాంత్‌తో సినిమా చేయాలనీ ఉండేది. ‘ఉత్తమ విలన్’లో బాలచందర్‌గారితో నటించా. ‘లింగ’లో రజనీతో చేశాను’’ అని తెలిపారు. జగపతిబాబు మాట్లాడుతూ -‘‘అతిశయోక్తి కాదు కానీ, రజనీ అంత గొప్ప మనిషి లేరు. ఎవరేమన్నా పట్టించుకోరు.. ఆశీర్వదిస్తారు. అలా ఎలా ఉండగలుగుతున్నారు? అనడిగితే -‘‘ప్రతి రోజూ ఏదో సందర్భంలో నేనో బస్ కండక్టర్‌ని అనే విషయం గుర్తొస్తుంటుంది’’ అన్నారు. అదీ రజనీకాంత్ అంటే’’ అని చెప్పారు.

 

 కేయస్ రవికుమార్ మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు రజనీకాంత్‌గారి బర్త్‌డే సందర్భంగా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.  ఆ ఘనత దక్కించుకున్న మొదటి సినిమా ఇదే. రజనీగారి పుట్టినరోజుకి ఇది మంచి బహుమతి అవుతుంది’’ అన్నారు.

 

 రాక్‌లైన్ వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా చేయడం నా ఏడు జన్మల అదృష్టంగా భావిస్తున్నా’’ అని చెప్పారు. ఈ వేడుకలో రమేశ్ ప్రసాద్, నందు అహుజా, రత్నవేలు, పొన్‌కుమరన్, బీవీయస్‌యన్ ప్రసాద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయి కొర్రపాటి, అనుష్క, సోనాక్షీ సిన్హా, బీఏ రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top