పాటకు.. సినిమా పాటకు అదే తేడా: అనంత శ్రీరామ్‌

Lyricist Anantha Sriram Special Interview In Sakshi

గతంలో తాగేవాడిని వెలివేస్తే.. నేడు తాగని వారిని వెలివేస్తున్నారు

దర్శకులు ఏది అడిగితే అది రాయాలి

సాహిత్యంపై ఎనలేని అభిరుచి 

‘సాక్షి’తో సినీగేయ రచయిత అనంత శ్రీరామ్‌

11 ఏళ్ల ప్రాయం నుండే తన పాటలతో సాహితి దిగ్గజాలతో శభాష్‌ అనిపించుకున్న సినీగేయ రచయిత సీహెచ్‌ అనంతశ్రీరామ్‌ శుక్రవారం గుంటూరు విచ్చేశారు. హిందూ కళాశాల వార్షికోత్సవంలో విద్యా పురస్కారం అందుకున్న అనంతరం అనంత శ్రీరామ్‌ “సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..  

సాక్షి, గుంటూరు : నాకు చిన్ననాటి నుంచి సాహిత్యంపై ఎనలేని అభిరుచి. ప్రత్యేకంగా గురువు ఎవరూ  లేకపోయినా మా పాఠశాలలోని తెలుగు మాస్టారు, గొప్ప పండితులతో పరిచయాలు నాలోని సాహితి తృష్ణకు పదును పెట్టాయి. మా నాన్న తరచూ పద్య గానం చేసేవారు.. అవే నాకు ప్రేరణ. నాకు భాష మీద కన్నా భావం మీద పట్టు ఎక్కువ. తెలిసిన భాషలో భావాన్ని వ్యక్తం చేయడమే నా విజయానికి సోపానం. ఇప్పటికి ఎన్ని చిత్రాలకు పాటలు రాశానో  గుర్తులేదు కానీ 1006 పాటలు పూర్తయ్యాయి. సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నేను రచించిన.. తాను నేను అన్నపాట నాకు బాగా ఇష్టమైంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి నా అభిమాన రచయితలు. దేశభక్తి జోడించిన సినిమాలు ఎక్కువగా ఇష్టపడతాను.

పాటపాటకు కొత్తదనం ఉండాలనేది నా తపన. నాకు కొత్తగా అనిపిస్తేనే కాగితం మీద పెడతాను. సినిమా రంగంలో పాటలు రాసేటప్పుడు ఓ ప్రత్యేక పరిస్థితి ఎదుర్కొంటుంటాం. ఒక సిట్టింగ్‌లో భక్తి పాట రాసి వెంటనే మరో సిట్టింగ్‌లో రక్తి పాట రాయాల్సివస్తోంది. నిర్మాత, దర్శకులు ఏది అడిగితే అది రాయగలగాలి. అదే పాటకు, సినిమా పాటకు తేడా. ఏడాదికి వెయ్యి పాటలు సినీ పరిశ్రమకు అవసరమైతే దర్శకుడు కోరుకున్న విధంగా రాయగలిగే రచయితలు పట్టుమని పది మందే ఉన్నారు. కాబట్టే  రచయితల మధ్య పోటీ తక్కువ. సినిమా రంగంలో ఎదగాలంటే గాడ్‌ ఫాదర్స్‌ తప్పక ఉండాలన్నది నిజం కాదు. ఫాదర్‌ కంటే ముందు మదర్‌ ఉండాలి కదా?. నెసెసిటీ ఆఫ్‌ ఇన్వెన్షన్‌ అన్న నానుడి అనుసరించి గాడ్‌ ఫాదర్‌ లేకపోయిన రచయిత తన ప్రతిభతో ముందుకు వెళ్లగలడు. 

సామాజిక రుగ్మతలు పెరిగాయి   
నా విషయానికి వస్తే ఓటేస్తావా అనే పాట నా మదిలో నుంచి రాగానే అప్పటికప్పుడు బల్లపై వేళ్లతో మ్యూజిక్‌ కొడుతూ పాడాను. అది సామాజిక మాధ్యమాల్లో ఎంత హిట్‌ కొట్టిందో మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల వల్ల మెతుకు సంపాదించడం కోసం బతుకంతా కష్టపడాల్సిన పరిస్థితులు నేడు సామాన్యులకు లేవు. అయితే కడుపు నిండక పోతే వంద సమస్యలు.. నిండితే కోటి సమస్యలు అన్న విధంగా నేటి సామాజిక రుగ్మతలు పెరిగాయి. మద్యం మహమ్మారితో సమస్యలు, ప్రేమ పేరుతో జరిగే అఘాయిత్యాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.

గతంలో తాగేవాడిని వెలివేస్తే నేడు తాగని వారిని వెలివేస్తున్నారు. సినిమా వ్యాపారాత్మక కళ, కళాత్మకమైన వ్యాపారం. దీంతో నిర్మాత, దర్శకులు సగటు యువకుడు ఏమి కోరుకుంటున్నాడో కథా వస్తువుగా తీసుకొని సినిమా తీయాల్సిన పరిస్థితి. ప్రేమ విఫలమై కొందరు యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు అనే అంశంపై అనంత శ్రీరామ్‌ మాట్లాడుతూ ప్రేమించేటప్పుడు కెరీర్‌ను కలుపుకుంటే ఇలాంటివి జరగవు. ప్రేమే జీవితం కాదు. ప్రియురాలితో పాటు మన చుట్టూ ఉన్న బంధాలను సంతోష పెట్టాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top