హృతిక్ క్షమాపణలు చెప్పాల్సిందే: కంగనా
కంగనా విషయంలో అనవసరమైన ఆరోపణలు చేసి హృతిక్ పెద్ద మూర్ఖుడు అయ్యాడని...
సాక్షి, న్యూఢిల్లీ: ప్రేమ యుద్ధం అంటూ మొదలై బాలీవుడ్‌లో కండల వీరుడు హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల వ్యవహారం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. పరస్పర విమర్శలతో గతేడాది వార్తల్లో ఈ జంట పతాక శీర్షికలో నిలిచింది. అయితే తప్పంతా క్వీన్‌దేనంటూ ఆమె మెయిల్స్ సాక్ష్యాలుగా చూపించాడు హృతిక్. అప్పటి నుంచి ఆ అంశం క్రమక్రమంగా గప్‌చుప్ అవుతూ వస్తోంది.
అయితే హృతిక్ ఓ పెద్ద మోసగాడు అంటూ కంగనా వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై ఆమె పలు విషయాలను చెప్పుకొచ్చారు. ‘ హృతిక్‌తో ఎదురుపడే క్షణం కోసం ఎదురు చూస్తున్నా. కానీ, అతను మాత్రం అందుకు సుముఖంగా లేడు. హృతిక్, అతని తండ్రి రాకేష్ రోషన్ ఇద్దరూ మూర్ఖులే. అసత్య ఆరోపణలతో లోకాన్ని నమ్మించాలని చూశారు. ముఖ్యంగా హృతిక్ చాలా నీచమైన ఆరోపణలు చేశాడు. రెండేళ్లు పక్కా ఫ్లాన్‌తోనే ఇదంతా చేసుకొచ్చాడు. వాటిని నిరూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలేం జరిగిందో నేనే ప్రపంచానికి చెబుతా’ అంటూ కంగానా తెలిపింది.
అతనిక(హృతిక్)కు నా మెయిల్ ఐడీ పాస్‌వర్డ్ తెలుసు. వాటి ద్వారా నీచమైన పనులకు పాల్పడ్డాడు. నేను మౌనంగా ఉండటంతో తండ్రికొడుకులు మరింతగా రెచ్చిపోయారు అని ఆ ఇంటర్వ్యూలో వివరించింది. ఆరోపణలు నిరూపించకపోతే క్షమాణలు చెప్పాల్సిందేనని 30 ఏళ్ల కంగనా అంటున్నారు. మళయాళ నటి భావన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మహిళలకు ఎక్కడా రక్షణ లేదని, తన విషయంలో మాత్రం బాలీవుడ్ పెద్దల నుంచి బెదిరింపులు వచ్చాయని కంగానా చెప్పుకొచ్చింది.
సిల్లీ ఎక్స్ అంటూ కంగనా హృతిక్‌ను కామెంట్ చేయటంతో మొదలైన రచ్చ లీగల్ నోటీసులు, ఆపై పరస్పర విమర్శలతో తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.