బాబాయి పాట రీమిక్స్‌లో అబ్బాయి? | Sakshi
Sakshi News home page

బాబాయి పాట రీమిక్స్‌లో అబ్బాయి?

Published Sun, Nov 2 2014 11:03 PM

బాబాయి పాట రీమిక్స్‌లో అబ్బాయి? - Sakshi

ప్రస్తుతం రీమిక్స్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ తరంలో ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన ఘనత మాత్రం పవన్‌కల్యాణ్‌దే. ఎన్టీఆర్ ‘మిస్సమ్మ’లోని ‘ఆడువారి మాటలకు’ పాటను, ఎన్టీఆర్ ‘చిట్టిచెల్లెలు’లోని ‘ఈ రేయి తీయనిది’ పాటను తన ఖుషి, జానీ సినిమాల కోసం ఆయన రీమిక్స్ చేశారు. తర్వాత మహానటుడు ఎన్టీరామారావు పాటలను ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ రీమిక్స్ చేసిన సందర్భాలున్నాయి. రామ్‌చరణ్ కూడా తన తండ్రి చిరంజీవి పాటలను రీమిక్స్ చేశారు. తన అభిమాన నటుడు పవన్‌కల్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’లోని పాటను నితిన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కోసం రీమిక్స్ చేశారు.
 
  ఇలా పాత పాటల్ని రీమిక్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. ప్రస్తుతం కల్యాణ్‌రామ్ ఈ ట్రెండ్‌ని కొనసాగించే పనిలో పడ్డారు. తన బాబాయి బాలకృష్ణ నటించిన బ్లాక్‌బస్టర్ ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’లోని ‘అరెవో సాంబ...’ పాటను తన ‘పటాస్’ సినిమా కోసం ఆయన రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. 1992లో వచ్చిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ కోసం బప్పీలహరి స్వరపరిచిన ఆ పాట అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది. ఒకవేళ ఈ పాటను రీమిక్స్ చేస్తున్న వార్త నిజమైతే.. కచ్చితంగా ఇప్పటి యువతరాన్ని అలరించే విధంగా ఉంటుందని ఊహించవచ్చు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement