అప్పుడు విజయ్‌ మాస్టర్‌ జాగ్రత్తలు చెప్పారు

JR NTR Dynamic Entry at Ee Maya Peremito Audio Launch - Sakshi

ఎన్టీఆర్‌

‘‘సినిమాల్లో మేం చేసే ఫైట్లకు అప్లాజ్‌ వస్తుంది. అయితే వాటిని చేయించిన ఫైట్‌ మాస్టర్లను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ వారు పడే శ్రమ మెచ్చుకోవాల్సిందే. విజయ్‌ మాస్టర్, ఆయన శ్రీమతిగారు కలిసి కన్న కలలకు ప్రతి రూపం ఇద్దరు బిడ్డలు. వారిద్దరూ ప్రయోజకులు అవుతుంటే వాళ్ల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది’’ అని ఎన్టీఆర్‌ అన్నారు. ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ తనయుడు రాహుల్‌ విజయ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. కావ్యా థాపర్‌ హీరోయిన్‌. రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్‌ నిర్మించారు.

ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని సీడీ రిలీజ్‌ చేసిన ఎన్టీఆర్‌ మాట్లాడుతూ – ‘‘నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విజయ్‌ మాస్టర్‌గారు నేర్పారు. విజయ్‌ మాస్టర్‌ది ప్రేమ వివాహం. ఆయన శ్రీమతి ఆయన్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని విజయ్‌ మాస్టర్‌ ఎప్పుడూ వమ్ము చేయలేదు. చాలా కష్టపడి  పైకి ఎదిగారు. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నా ను’’ అన్నారు.  ‘‘ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు.. మీరేం సాధించారు అని ఒకరు అడిగితే ఇండస్ట్రీ అనేది తల్లి.

ఆ తల్లి ఆశీర్వాదం ఉంటే నేర్చుకుంటాం. కానీ ఇక్కడ సాధించడం ఏమీ ఉండదు.  ఎన్టీఆర్‌ ఆనందంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అనేది నా నమ్మకం. మంచి మనసున్న మనిషి ఎన్టీఆర్‌.  నేనేం సాధించానో నాకు తెలియదు కానీ ఎన్టీఆర్‌ ఫంక్షన్‌కి రావడం మాత్రం నా సాధనగానే భావిస్తున్నా. టెక్నీషియన్స్‌ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. మణిశర్మగారు మాకు ఇచ్చిన సపోర్ట్‌ చాలా గొప్పది. మా పిల్లలు ఇంత దూరం రావడానికి కారణం మా టెక్నీషియన్లు. వాళ్లందరికీ ధన్యవాదాలు’’ అన్నారు విజయ్‌. ‘‘ఇది నాకు ప్రత్యేకమైన రోజు.

ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్‌ అందరూ నా చిన్నతనంలో నన్ను పెంచారు. తెలిసిన వాళ్ల మధ్యలో పని చేయడం కొత్తగా అనిపించలేదు. అందరి ఇళ్లల్లో జరిగే కథతో ఈ సినిమాను తీశాం. నటీనటులు చాలామంది ఉన్నారు. వాళ్లందరి దగ్గర నుంచి ఎలా పనిచేయాలో నేర్చుకున్నా’’ రాహుల్‌ విజయ్‌ అన్నారు. ‘‘నా తొలి సినిమా ‘బద్రి’ నుంచి విజయ్‌ మాస్టర్‌తో పనిచేస్తున్నాను. మాస్టర్‌ కొడుకును హీరోగా, కూతురుని నిర్మాతగా చేస్తూ సినిమా చేశారు. వాళ్ళకు శుభాకాంక్షలు’’ అన్నారు çపూరి జగన్నాథ్‌. ‘‘ఈ సినిమా  సమష్టి కృషి.

శ్యామ్‌గారు, చిన్నాగారు మా నాన్నకు పిల్లర్స్‌ లాగా పనిచేశారు. ఎన్టీఆర్‌ అన్నయ్య మా ఆడియో విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆడియో లాంచ్‌ అనుకుంటున్నామని అనగానే ఎన్టీఆర్‌ అన్నయ్య డేట్‌ ఏంటి? ఎక్కడ? అని అడిగారు’’ అన్నారు దివ్య. ‘‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుకలో ఈ చిత్రకథ మొదలైంది. ఆ కథను నేను విజయ్‌గారికి చెప్పాను. ఆయన ఇక్కడిదాకా తీసుకొచ్చారు. ఈ పాయింట్‌కు అందరూ కనెక్ట్‌ అవుతారు. రాహుల్‌ క్యారక్టర్‌  బావుంటుంది. విజయ్‌ మాస్టర్‌గారు నా వెన్నంటి ఉండి నడిపించారు’’ అన్నారు రాము కొప్పుల.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top