వలిమైలో జాన్వీ ఉంటుందా?

Janhvi Kapoor Debut in Telugu Pink Remake - Sakshi

సినిమా: జాన్వీకపూర్‌ ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది అతిలోక సుందరి శ్రీదేవినే. ముద్దుముద్దు మాటలు, వడివడి అడుగులతో చిరు వయసులోనే కళామతల్లి ఒడికి చేరిన నటి శ్రీదేవి అన్నది తెలిసిందే. అలా తన నట జీవితానికి శ్రీకారం చుట్టుకున్న ఆమె ఆల్‌ ఇండియా సూపర్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది. జీవితం అంటే ఆనందమే కాదు. ఆపదలు ముంచుకొస్తాయి. అలాంటి అసంభావంతో తనువు చాలించిన నటి శ్రీదేవి. ఆమెకు ఇద్దరు కూతుళ్లన్న విషయం తెలిసిందే. అయితే వారిని నటిగా చూడడానికి శ్రీదేవి మొదట్లో ఇష్టపడలేదు. అందుకేనేమో తన పెద్ద కూతురు జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రాన్ని కూడా చూడకుండానే ఈ లోకాన్ని వీడింది. ఏదేమైనా శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్‌ హీరోయిన్‌ అయిపోయింది. హిందీలో పలు చిత్రాలతో బిజీగా ఉంది. అయితే ఈ చిన్నదానికీ తన తల్లి మాదిరిగా దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి ఉంది. ఈ విషయాన్ని తనే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. కాగా జాన్వీ తండ్రి, శ్రీదేవి భర్త బోనీకపూర్‌ బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చాలా కాలం తరువాత తమిళంలో అజిత్‌ కథానాయకుడిగా నేర్కొండ పార్వై చిత్రాన్ని నిర్మించారు.

అందులోనే నటి జాన్వీకపూర్‌ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అందులో జాన్వీ నటించలేదు. నేర్కొండపార్వై  చిత్రం మంచి ఫలితాన్నివ్వడంతో తాజాగా మళ్లీ అజిత్‌ హీరోగా చిత్రం చేస్తున్నారు. నేర్కొండ పార్వై చిత్రం ఫేమ్‌ హెచ్‌.వినోద్‌నే ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి వలిమై అనే టైటిల్‌కు నిర్ణయించారు. చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందంతా తెలిసిన విషయమే. అయితే తాజాగా మరోసారి ఈ చిత్రానికి సంబంధించి జాన్వీకపూర్‌ పేరు వినిపిస్తోంది. దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న ఆసక్తిని వ్యక్తం చేసిన జాన్వీకపూర్‌ తెలుగులో విజయ్‌దేవరకొండతో రొమాన్స్‌ చేసే అవకాశం వస్తే నటించడానికి సిద్ధం అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. తాజాగా అజిత్‌ హీరోగా ఆమె తండ్రి నిర్మిస్తున్న వలిమై చిత్రంతో జాన్వీ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతుందనే టాక్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే ఈ విషయం అధికారకంగా వెల్లడి కాలేదన్నది గమనార్హం. ఇకపోతే బోనీకపూర్‌ హిందీ చిత్రం పింక్‌ను తమిళంలో రీమేక్‌ చేసి సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులోనూ నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో జాన్వీకపూర్‌ నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటి గురించి కచ్చితమైన వివరాలు తెలియడానికి మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top