శ్రీదేవి చిత్రం.. తెరంగేట్రం

Hyderabad Women Sridevi Movie Release Tomorrow in Amazon - Sakshi

సోషలైట్‌ నుంచి సినీతార స్థాయికి...

సరికొత్త ట్రెండ్‌ సృష్టించిన సిటీ మహిళ

అరంగేట్రంలోనే‘గే’సబ్జెక్ట్‌తో సంచలనం...

సినిమా చూసి, సినీ కలలు కని... అదే శ్వాసగా ధ్యాసగా మారిన, మారుతున్న వారెందరో సిటీ నుంచి సినిమాల్లో రాణిస్తూ ఉండవచ్చు. అయితే సినిమా రంగంతో వ్యక్తిగతంగా ఏ సంబంధం లేకుండా బిజినెస్‌ ఉమన్‌గా, సిటీ టాప్‌ సర్కిల్‌లో సోషలైట్‌గా ఉంటూ అకస్మాత్తుగా సినిమా నటి అయిపోయారు శ్రీదేవి చౌదరి. ఆరంభంలోనే స్వలింగ సంపర్కం అనే సబ్జెక్ట్‌ను ఎంచుకుని టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారారు. ఆమె నటించిన ఫ్రెండ్స్‌ ఇన్‌ లా సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో రేపు విడుదల కానుంది. 

సాక్షి, సిటీబ్యూరో: ‘‘బాధ్యతలన్నీ పూర్తయ్యాయి. మహిళలకు తనకంటూ నిజమైన జీవితం ఆశించే ఆస్వాదించే వయసు, ఆసక్తులు అభిరుచులు, ఆలోచనలకు పదును పెట్టుకునే సమయమిదే నని భావించా’’ అంటున్నారు శ్రీదేవి చౌదరి. జూబ్లీహిల్స్‌లో నివసించే శ్రీదేవి సిటీలోని ప్రముఖ సంపన్నకుటుంబ మహిళగా, పేజ్‌త్రీ సోషలైట్‌గా చాలా మందికి సుపరిచితం. అయితే ఇప్పుడామె సినిమా తారగానూ పరిచయమవుతున్నారు. ఈ నేపధ్యంలోసాక్షితో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే...

ఆఫర్లు వచ్చినాఅందుకోలేదు...
నాకు గతంలో కూడా సినిమా ఆఫర్లు వచ్చాయి. అందులో చాలా పెద్ద సంస్థలవి కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడూ చేయాలని అనిపించలేదు.  కుటుంబ బాధ్యతల నుంచి రిలాక్స్‌ అయిన సందర్భంలో మన జీవితంలో సాధించడానికి వీలైనవి సాధించడానికి ఇదే సరైన సమయం అనిపించింది. యుక్తవయసులోనే  ప్రముఖ ఫొటో గ్రాఫర్‌ అమిత్‌ఖన్నా నన్ను సంప్రదించారు. ఆయన చెప్పిన సబ్జెక్ట్‌ మొదట విని షాక్‌ తిన్నాను. ఆ తర్వాత ఆలోచించాను. చివరకు ఓకే అన్నాను.  

బాలీవుడ్‌ నుంచిపిలుపొచ్చింది...
ఈ సినిమా టీజర్‌ చూసినవాళ్లు అభినందిస్తున్నారు. నటి జీవిత కూడా ఫోన్‌ చేసి అనుభవం ఉన్న నటిలా చేశానంటూ మెచ్చుకున్నారు. ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లాలనుకుంటున్న సమయంలో కాన్స్‌ ఫెస్టివల్‌లో చూసిన అమెజాన్‌ వాళ్లు సంప్రదించారు. తాము విడుదల చేస్తామన్నారు. ఇప్పుడంతా డిజిటల్‌ మీడియానే కదా. పైగా అమెజాన్‌ ద్వారా అయితే ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయవచ్చు. అందుకని అంగీకరించాం. భవిష్యత్తులో కూడా సినిమాల్లో నటిస్తాను. అయితే మంచి ఆఫర్లు వస్తేనే.. క్వీన్‌ ఆఫ్‌ ద సౌత్‌ అని నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్‌ వస్తోంది. అందులో ఓ నెగిటివ్‌ కేరెక్టర్‌ నాకు బాగా నచ్చింది అలాంటివి చేయాలని ఉంది. ప్రస్తుతానికి ఒక బాలీవుడ్‌ ఆఫర్‌ వచ్చింది. నటుడు సంజయ్‌దత్‌ భార్య కేరెక్టర్‌. చర్చలు నడుస్తున్నాయి. 

‘గే’లిపిద్దాం...
ఈ సినిమా గురించి ఇంట్లో చెప్పినప్పుడు... నగరంలోపేరున్న కుటుంబం మాది. ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్‌తో సినిమా చేయడం ఇబ్బంది కదా అని సందేహించారు. ఇందులో వాళ్లని తప్పు పట్టడానికి ఏమీ లేదు. మన చుట్టూ ఎందరో ‘గే’లు ఉన్నారు. నిత్యం చూస్తున్నాం. అయినా స్వలింగ సంపర్కం ఇప్పటికీ  ఇండియాలో చాలా పెద్ద ఇష్యూ. ఆ అంశం గురించి చర్చించడానికే ఇష్టపడరు చాలా మంది. నిజమే అయినప్పటికీ తమ బిడ్డలు గే అని బయటకు చెప్పుకోవడానికి ఏ తల్లీ తండ్రీ ఇష్టపడరు. బహుశా ఆ పరిస్థితుల్లో ఉంటే నేనూ చెప్పలేనేమో...కాని ఇలా ఎంతకాలం? గే మనస్తత్వాన్ని మన సమాజం ఎప్పటికైనా అంగీకరించక తప్పదు. అలా గే గా మారిన వారిని తప్పుపట్టడం, గేలి చేయడం ఇంటినుంచే మొదలవుతుంది. అయితే అది సరికాదని  ఇంటినుంచే వారిని యధాతధంగా అంగీకరించడం అనేది ప్రారంభం కావాలని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశ్యం. మంచి సోషల్‌ మెసేజ్‌ ఉన్న ఇంటర్నేషనల్‌ సబ్జెక్ట్‌ కావడంతో మేం అనుకున్నట్టే ఈ సినిమా అంతర్జాతీయంగా పేరొందిన అన్ని ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కి వెళ్లి మూడు అవార్డులు గెలుచుకుంది.

ఫార్టీప్లస్‌..లేడీస్‌కి ప్లస్‌...
పెళ్లి, పిల్లలు, బాధ్యతలు తీరిపోవడం అయిపోయింది ఇక కృష్ణారామా అనుకోవద్దు నేనూ నా జీవితం అనుకోండి అంటాన్నేను. నలభై ఏళ్లు దాటాక మనం జీవితంలో చేయాలనుకుని బాధ్యతల కారణంగానో మరో కారణంతోనో చేయలేనివి చేసేయాలి. దీనికి డిసిప్లిన్‌ లైఫ్‌ కూడా అవసరం. నేను ఇప్పటికీ వారంలో నాలుగు రోజులు తప్పనిసరిగా 2గంటలపైనే జిమ్‌లో వర్కవుట్‌ చేస్తుంటాను. ఏ పని చేసినా అందులో ఆనందం రావాలి. అది మరో మంచి పనికి మనకి ప్రేరకం అవుతుంది. అదే నేను తోటి మహిళలకి చెప్పే మాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top