ప్రకాశ్‌రాజ్‌ను బహిష్కరించాలి

Hindu mahasabha Complaint on Prakash Raj in karnataka Film Chamber - Sakshi

ఫిల్మ్‌ చాంబర్‌కు హిందూ మహాసభ ఫిర్యాదు  

సాక్షి, బెంగళూరు: బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ను సినిమాల నుంచి బహిష్కరించాలని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు నమోదైంది. హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారని, ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వవద్దని అఖిల భారత హిందూ మహాసభా వేదిక ఫిర్యాదు చేసింది. ఆయన రామాయణాన్ని అవమానిస్తున్నారని, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని ఫిల్మ్‌ చాంబర్‌కు ఫిర్యాదు లేఖను అందించింది. ఈ నేపథ్యంలో ఆయనను కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని, ఆయనకు కన్నడ సినిమాల్లో అవకాశం కల్పించరాదని, ఒకవేళ ఇస్తే మున్ముందు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. 

వివాదం ఎక్కడ?  
ఇటీవల కొన్ని రోజుల క్రితం ఒక ప్రైవేటు వార్తా చానెల్‌ చర్చలో పాల్గొన్న ప్రకాశ్‌ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో రథోత్సవానికి ముంబై నుంచి హెలికాప్టర్ల ద్వారా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ మోడళ్లను పిలిపిస్తున్నారని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. అంతేకాకుండా మేకప్‌ చేసి ఆ మోడళ్లతో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడి వేషాలు వేయిస్తున్నారని, వారికి ఘనంగా పూల స్వాగతం పలుకుతున్నారని, ఐఏఎస్‌ అధికారులు వారికి నమస్కరిస్తున్నారని, ఈ విధమైన చర్యలు దేశానికి ప్రమాదకరమని అన్నారు. ఈ సందర్భంలో ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా వారికిష్టం వచ్చినట్లు చేయవచ్చునని, అందరి మనోభావాలకు విలువివ్వాలని చర్చ వ్యాఖ్యాత తెలిపారు. దీనికి ప్రకాశ్‌ రాజ్‌ బదులిస్తూ చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూస్తుంటే మౌనంగా ఎలా ఉంటామని, అదే విధంగా దేశానికి ప్రమాదకర విషయాలను ప్రశ్నించాల్సిందేనని చెప్పారు. వేడుకల పేరిట మైనార్టీలకు భయపెట్టే సన్నివేశాలను సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top