వెండితెర వెలుగులు.. బతుకుబండి కష్టాలు

hero shankar ashwath drives uber cab for living - Sakshi

క్యాబ్‌ డ్రైవర్‌గా మారిన నటుడు శంకర్‌ అశ్వథ్‌ 

ఆదుకోని తండ్రి వారసత్వం 

స్వశక్తిపై నమ్మకంతో కొత్త బాట 

సాక్షి, బెంగళూరు: ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ రంగుల వెండితెరపై నటించే అనేక మంది చిత్ర నటులు, కళాకారులు నిజజీవితంలో మాత్రం ఆర్థిక కష్టాలతో దయనీయ జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా కొన్ని వందల చిత్రాల్లో అన్ని తరహా పాత్రలను పోషించి కన్నడ ప్రేక్షకుల మన్నన పొందిన అలనాటి నటుడు కే.ఎస్‌.అశ్వథ్‌ కుమారుడు శంకర్‌ అశ్వథ్‌ కూడా అవకాశాల కొరత కారణంగా ఇదేస్థితిలోనున్నారు. జూనియర్‌ అశ్వథ్‌ ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా జీవితం నెట్టుకొస్తున్న వైనం సినీ ప్రేక్షకులకు, అభిమానులకు ఆవేదన కలిగిస్తున్నా అది పచ్చినిజం. 

60 సినిమాల్లో నటన 
సుమారు 370 చిత్రాల్లో పైగా నటించిన తన తండ్రి కే.ఎస్‌.అశ్వథ్‌ నటనను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన శంకర్‌ అశ్వథ్‌ కూడా నటనపై మక్కువ పెంచుకున్నారు. 1993లో ‘హూవు హణ్ణు’ చిత్రంతో సినిమాల్లో అడుగిడిన శంకర్‌ శంకర్‌ గత ఏడాది వరకు 60 వరకు కన్నడ చిత్రాల్లో నటించారు. వెండితెరతో పాటు బుల్లితెరపై వచ్చే పలు ధారావాహికల్లోనూ ప్రతిభ చాటుకున్నారు. అయితే అన్ని చిత్రాల్లో, ధారావాహికల్లోనూ శంకర్‌ అశ్వథ్‌కు చిన్నాచితక పాత్రలు మినహాయిస్తే చెప్పకోదగ్గ పాత్రలు రాలేదు. దీంతో పాటు గత ఏడాదిగా సినిమాలు, టీవీల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో శంకర్‌ అశ్వథ్‌ కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. వీటిని స్వశక్తితో ఎదుర్కోవాలనుకున్న ఆయన ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా మారి ఆ ఆదాయంతో బతుకుబండి లాగుతున్నారు. 

తండ్రి ఆదర్శాలే స్ఫూర్తి: శంకర్‌ 
ప్రస్తుత పరిస్థితిపై తనకు ఏమాత్రం బాధగా లేదని, అవకాశాలు రాకపోవడంతోనే క్యాబ్‌ డ్రైవర్‌గా వృత్తిని ఎంచుకున్నట్లు శంకర్‌ అశ్వథ్‌ తెలిపారు. తమ తండ్రి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా జీవనం సాగించాలనే విషయాలను చిన్నతనం నేర్పించారని ఆయన సూచించిన మార్గంలోనే తాము ప్రయాణిస్తున్నామన్నారు. అవకాశాల కోసం, డబ్బు కోసం ఎవరి ముందు చేయి చాచరాదన్న తమ తండ్రి నేర్పిన సూక్తి ఆదర్శంగానే క్యాబ్‌ డ్రైవర్‌ వృత్తిని ఎంచుకున్నామన్నారు. 

జనవరి 19న తమ తండ్రి కే.ఎస్‌.అశ్వథ్‌ 8వ శ్రద్ధాంజలి సమీపిస్తుండడంతో ఎవరివద్ద అప్పులు చేయకుండా ఆ కార్యక్రమం ఖర్చుల కోసం డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పారు. చిత్తశుద్ధి, నిబద్దతతో పనిచేస్తే ఏ పనైనా ఆదుకుంటుందని ప్రస్తుతం క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నప్పటి నుంచి ఆర్థిక కష్టాలు ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్నామన్నారు. అవకాశాలు ఇవ్వని సినీ పరిశ్రమపై ఏమాత్రం కోపం లేదని, ఎంతో గౌరవమని ఆయన చెప్పారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top