మనోధర్మం కోసమే సినిమాలు

Harinath Policharla Speech @ Captain Rana Pratap Movie - Sakshi

‘‘వృత్తిధర్మం కోసం డాక్టర్‌గా చేస్తున్నాను. మనోధర్మం కోసం సినిమాల్లో నటిస్తున్నాను. కేవలం డబ్బు వల్లే అన్ని విషయాలూ సాధించలేం’’ అని దర్శక–నిర్మాత హరినాథ్‌ పొలిచర్ల అన్నారు. ఆయన టైటిల్‌ రోల్‌లో రూపొందిన చిత్రం ‘కెప్టెన్‌ రాణాప్రతాప్‌’. హరినాథ్‌ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా హరినాథ్‌ చెప్పిన విశేషాలు.

► మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. రానా ప్రతాప్‌ పాత్రలో నేను నటించాను. ఓ కోవర్టు అపరేషన్‌ కోసం రానా ప్రతాప్‌ పాకిస్తాన్‌ వెళ్తాడు. అక్కడికి వెళ్లి రానా ప్రతాప్‌ ఆ ఆపరేషన్‌ను ఎలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశారన్నదే కథ. మా సినిమాకి, అభినందన్‌ వర్తమాన్‌ (భారతీయ సైనికుడు) సంఘటనకూ సంబంధం లేదు. రెండేళ్ల క్రితమే ఈ కథ రాసుకున్నా.

► చిన్నతనం నుంచే నాకు నటనపై ఆసక్తి ఉంది. స్టేజ్‌ ఆర్టిస్ట్‌ని కూడా. సినిమాలు చేస్తూనే ఉన్నాను. ‘చంద్రహాస్‌’ సినిమా టైమ్‌లో నేను పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తానని... ఆ చిత్రదర్శకుడు శివదత్తా (ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి) గారు నాకు మంచి కాంప్లి్లమెంట్‌ కూడా ఇచ్చారు. ‘కెప్టెన్‌ రాణాప్రతాప్‌’ సినిమాకు హీరోగా నేనైతే న్యాయం చేయగలనని నాకు అనిపించింది. అందుకే నేనే నటించాను. నా విజన్‌ను స్క్రీన్‌పై చూపించడానికి సులువు అవుతుందని నేనే ఈ సినిమాకు దర్శకుడిగా మారాను. ఈ సినిమా రిలీజ్‌కు మైత్రీ మూవీ మేకర్స్‌ సహకరించింది.

► ఇందులో దాదాపు గంటకు పైగా యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి. మార్షల్‌ ఆర్ట్స్‌లో నాకు ప్రవేశం ఉండటంతో యాక్షన్‌ సీక్వెన్స్‌ చేయడం నాకు ప్రాబ్లమ్‌ అనిపించలేదు. అలాగే ఈ సినిమాలో సైనికుల కుటుంబాల సమస్యలను కూడా ప్రస్తావించాం. మహిళా సాధికారిత అంశాన్ని కూడా టచ్‌ చేశాం. ఇందుకోసం కొందరి సైనికుల కుటుంబాలతో మాట్లాడటం జరిగింది. సుమన్‌గారు గ్రేట్‌ యాక్టర్‌ ఆయన ఈ సినిమాలో మేజర్‌గా నటించారు.

► ఈ సినిమా తర్వాత రజాకార్ల కాలంలో పోరాడిన ఓ కుటుంబం నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఇది పీరియాడికల్‌ మూవీ కాబట్టి నేను దర్శకత్వం వహించాలనుకోవడం లేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top