తెలుగు సినిమా మరోసారి సత్తా చాటాలి

F2 Fun and Frustration Audio Launch - Sakshi

వెంకటేశ్‌

‘‘హలో వైజా........గ్‌.. సౌండ్‌ అంటే అదమ్మా. మీ సౌండ్‌తో నాకు గొంతు పోయినట్టుంది (నవ్వుతూ). వైజాగ్‌ ఉత్సవాల్లో మా ‘ఎఫ్‌ 2’ సినిమా ఆడియో రిలీజ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘ఎఫ్‌ 2’ వండర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌. నా గత సినిమాలన్నీ జాగ్రత్తగా చూసిన అనిల్‌ వాటన్నిటికంటే చాలా బాగా రెచ్చిపోయాలా నన్ను చూపించాడు’’ అన్నారు వెంకటేశ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌ 2’. ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ అన్నది ఉపశీర్షిక.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలవుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఆదివారం వైజాగ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘వైజాగ్‌ నాకెంతో క్లోజ్‌. నా తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ నుంచి ఎన్నో సినిమాలు నేను ఇక్కడ చేశాను. ‘స్వర్ణకమలం, సుందరకాండ, గురు’... ఇన్‌ఫ్యాక్ట్‌ ‘మల్లీశ్వరి’ సినిమాలో  కత్రినాకైఫ్‌తో ఇదే బీచ్‌లో అలా నడుస్తూ ఉన్నాను కదా (నవ్వుతూ). వైజాగ్‌ నాకెంతో లక్కీ ప్రదేశం. మా పెళ్లాలు (తమన్నా, మెహరీన్‌) రాలేదు.

దానికే కొంచెం అందరం ఫ్రస్ట్రేట్‌ అయి ఉన్నాం (నవ్వుతూ). మంచి మ్యూజిక్‌ ఇచ్చిన దేవిశ్రీకి థ్యాంక్స్‌. ‘ఎఫ్‌ 2’ లాంటి మంచి సినిమా ఇస్తున్నందుకు ‘దిల్‌’రాజుగారు, శిరీష్, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్‌. వారితో చేసిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’తో బ్రదర్‌ మహేశ్‌ని సంపాదించుకున్నా.. ‘ఎఫ్‌ 2’ సినిమాకి మరో బ్రదర్‌ వరుణ్‌ని సంపాదించుకున్నా. మా సినిమాతో పాటు రిలీజ్‌ అవుతున్న బాలయ్య బాబు (యన్‌.టి.ఆర్‌. కథానాయకుడు), చరణ్‌ (వినయ విధేయ రామ), రజనీకాంత్‌సార్‌ (పేట) సినిమాలన్నీ బాగా ఆడాలి.. మరోసారి తెలుగు  సినిమా సత్తా చాటాలి’’ అన్నారు.

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘కరెక్టుగా 2014 డిసెంబరు 31న నేను, బన్నీ (అల్లు అర్జున్‌) ఇక్కడే వైజాగ్‌లో న్యూ ఇయర్‌ సెలబ్రేట్‌ చేసుకున్నాం. 2017లో సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్‌ అయినప్పుడు చాలా పెద్ద పోటీ అని అందరం భావించాం. బాలకృష్ణగారి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ క్లాసిక్‌ సినిమా అయింది.. చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా ఇండస్ట్రీ రికార్డ్‌ అయింది. మా ‘శతమానం భవతి’ మంచి సినిమా అయ్యి జాతీయ అవార్డు వరకూ వెళ్లింది. 2019 సంక్రాంతికి మళ్లీ మూడు సినిమాలు పోటీపడుతున్నాయి.

ఈ మూడు సినిమాలు పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెంకటేశ్‌గారితో మా బ్యానర్‌లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, వరుణ్‌తో ‘ఫిదా’ సినిమాలు చేశాం. వారిద్దరితో మల్టీస్టారర్‌గా ఇప్పుడు తీసిన ‘ఎఫ్‌ 2’ సంక్రాంతికి రాబోతోంది. ఇద్దరూ నిర్మాతకి కంఫర్టబుల్‌ హీరోలు. థ్యాంక్యూ వెంకీ సార్‌. మంచి కథ కుదిరితే మీతో మరో సినిమా చేయాలనే కోరిక ఉంది. వరుణ్‌ ఆల్‌మోస్ట్‌ ఓ ఫ్యామిలీ మెంబర్‌. చిరంజీవిగారిలోని లక్షణాలు తీసుకుని మంచి సినిమాలు చేస్తూ ఎదుగుతున్న వరుణ్‌ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరవుతాడు.

అనిల్‌ ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నా. మా బ్యానర్‌కి మరో సూపర్‌ హిట్‌గా నిలుస్తుందని అప్పుడే తెలుసు. అనిల్‌ గత చిత్రాలు ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్‌’ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ అయితే ‘ఎఫ్‌ 2’ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. అందుకే ఈ సినిమాకి ‘సంక్రాంతి అల్లుళ్లు’ వస్తున్నారని మరో ట్యాగ్‌లైన్‌ పెట్టాడు. సినిమాలో ఒకరు ఆంధ్ర అల్లుడు.. మరొకరు తెలంగాణ అల్లుడు. మా బ్యానర్‌లో అనిల్‌కి వరుసగా మూడో సినిమా. కచ్చితంగా హ్యాట్రిక్‌ కొట్టబోతున్నాం. దేవిశ్రీతో ‘ఆర్య’ నుంచి మా జర్నీ మొదలైతే ‘ఎఫ్‌ 2’ పదో సినిమా. ఇప్పటి వరకూ 9 సినిమాలు సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. మా కాంబినేషన్‌ ఇలాగే కొనసాగుతుంది’’ అన్నారు.

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘నా యాక్టింగ్‌ కెరీర్‌ ఇక్కడి నుంచే మొదలైంది. వైజాగ్‌ సత్యానంద్‌గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నా. ‘ఎఫ్‌ 2’కి దేవి వండర్‌ఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. నా గత సినిమాలు చూసి ఈ పాత్ర ఎవరూ నాకు ఇవ్వరేమో? కానీ అనిల్‌ చాలా ధైర్యం చేసి ఇచ్చాడు.. బాగానే చేశా. ఓ ఫ్రెండ్‌లా, మెంటర్‌లా వెంకటేశ్‌ సార్‌ నన్ను ప్రోత్సహించడంతో ఈ జర్నీ చాలా హ్యాపీగా సాగింది’’ అన్నారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మా ఫన్, ఫ్రస్ట్రేషన్‌ వైజాగ్‌ బీచ్‌కి బాగా తెలుసు. ఎందుకంటే ఈ కథ ఇక్కడే రాశాం. వెంకటేశ్‌గారితో పనిచేసే గొప్ప అవకాశం దొరికింది. ఈ సినిమాతో వెంకీగారు మిమ్మల్ని టైమ్‌ మెషీన్‌లో ‘అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి’.. అక్కడికి తీసుకెళ్లిపోతారు. వరుణ్‌ తొలిసారి ఈ సినిమాలో మంచి కామెడీ చేశారు. వీరిద్దరి మధ్య సన్నివేశాలు మిమ్మల్ని నవ్విస్తాయి. దేవిశ్రీగారు ఆరు పాటలూ మంచివి ఇచ్చారు. జీవితంలో ఎన్ని ఉన్నా నవ్వులు లేకపోతే అదో వెలితి. సంక్రాంతికి మీ కుటుంబంతో వచ్చి మా సినిమా చూడండి.. తప్పకుండా నవ్వుకుని బయటికెళతారు’’ అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘సినిమా చూస్తే మీలోని ఫ్రస్ట్రేషన్‌ వదిలేసి ఫన్‌తో ఇంటికెళతారు. వెంకటేశ్‌గారికి విక్టరీ అలవాటైపోయింది. మీరు చాలామందికి స్ఫూర్తి సార్‌. వరుణ్‌తో తొలిసారి చేస్తున్నా. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. అనిల్‌తో చాలా సరదాగా ఉంటుంది. ‘దిల్‌’ రాజుగారితో నా జర్నీ ఇంకా ఇంకా సాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
    ఈ వేడుకలో పాటల రచయితలు కాసర్ల శ్యాం, శ్రీమణి, బాలాజీ, నటుడు ‘సత్యం’ రాజేశ్, నటి హరితేజ, లైన్‌ ప్రొడ్యూసర్‌ రత్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top