
అందరూ హీరోలే
గుంటూరులో జరిగిన ఓ వాస్తవ సంఘటన నేపథ్యంలో ‘డేగల శీను’ చిత్రం రూపొందుతోంది.
గుంటూరులో జరిగిన ఓ వాస్తవ సంఘటన నేపథ్యంలో ‘డేగల శీను’ చిత్రం రూపొందుతోంది. అమర్‌నాథ్ మండూరి స్వీయ దర్శకత్వంలో ఆర్.ఎఫ్.ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ కెమెరా స్విచ్చాన్ చేయగా దర్శకుడు సాగర్ క్లాప్ ఇచ్చారు. మరో దర్శకుడు వి. సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అమర్‌నాథ్ మాట్లాడుతూ – ‘‘యువత అహంభావం 50 హత్యలకు ఎలా దారి తీసిందన్నదే ఈ చిత్రకథ. గుంటూరులో జరిగిన వాస్తవ సంఘటనకు కొన్ని కల్పితాలు జోడించి ఈ సినిమా తీస్తున్నాం.
సమాజంలో పోలీసు వ్యవస్థ ఆవశ్యకతను తెలియజేస్తున్నాం. ఇందులో అందరూ హీరోలే, అందరూ విలన్లే. పెద్ద నటీనటులు ఉంటారు. కాశ్మీర్‌కు చెందిన జహీదా శ్యామ్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు’’ అన్నారు. సుమన్, భానుచందర్, బాబూమోహన్, సీనియర్ బాలయ్య, జయప్రకాష్ రెడ్డి, ‘బాహుబలి’ ప్రభాకర్, వినోద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అడుసుమల్లి విజయ్‌కుమార్.