సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

chiranjeevi speech about Telugu Cine Production union Executive Union press meet - Sakshi

– చిరంజీవి

‘‘ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్లు ఎంత కష్టపడతారు, ఎంత శ్రమిస్తారు అనేది నేను చూశా. సినిమా ఆఫీస్‌ ప్రారంభం నుంచి ఆ చిత్రం విడుదలయ్యే వరకు శ్రమించేది మేనేజర్లు. సినిమా అనేది అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునాదిరాళ్లు’’ అని హీరో చిరంజీవి అన్నారు. తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ‘తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం’ హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ–‘‘షూటింగ్‌ జరుగుతున్న సమయంలో తక్కువ నిద్రపోయేది మేనేజర్లే. కాబట్టి సినిమా సక్సెస్‌లో వారి వంతు చాలా ఉంటుంది. ‘సైరా’ సినిమా షూటింగ్‌ లొకేషన్‌ కోసం మా మేనేజర్‌ లొకేషన్‌ వారి కాళ్లమీద పడి అనుమతి తీసుకున్నారు. ఇందుకు మేనేజర్స్‌కి మా హృదయపూర్వక నమస్కారాలు. మేనేజర్స్‌ సిల్వర్‌ జూబ్లీ రజతోత్సవం ఇంత వైభవంగా జరగడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ–‘‘సినిమా ఇండస్ట్రీలోని అతిరథ మహారథులు ఈ ఫంక్షన్‌కు రావడం హర్షించదగ్గ విషయం. ఈ వేడుకను ఇంత గ్రాండ్‌గా చేసిన మేనేజర్స్‌ యూనియన్‌కు అభినందనలు. భవిష్యత్తులో కూడా నేను చిత్ర పరిశ్రమకు సహాయపడతాను’’ అన్నారు.

నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘ప్రొడక్షన్‌ మేనేజర్స్‌ ఇంత మంచి ఫంక్షన్‌ చేస్తారని ఊహించలేదు. వారు తలుచుకుంటే సినిమాని టైమ్‌లో పూర్తి చేయగలరు. తెలుగు చిత్ర పరిశ్రమలో గత 50 ఏళ్ల నుండి ఎంతో మంచి మేనేజర్స్‌ను చూశాను. వారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి’’ అన్నారు.

నటుడు గిరిబాబు మాట్లాడుతూ– ‘‘ప్రొడక్షన్‌ మేనేజర్ల సేవలు చాలా అమూల్యమైనవి. సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు వారు సినిమాకు చాలా సహాయంగా ఉంటారు. వారు పదికాలాల పాటు చల్లగా ఉండాలి’’ అన్నారు.

దర్శకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప ఫంక్షన్‌ చూడలేదు. మేనేజర్లు చేస్తున్న ఈ ఫంక్షన్‌ పెద్ద సక్సెస్‌ దిశగా ముందుకు వెళుతుంది. నేను ఇన్ని గొప్ప సినిమాలు చేయడానికి సహకరించిన మేనేజర్స్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు.

హీరో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ ఫంక్షన్‌లో చిరంజీవిగారిని కలవడం కొత్త ఎనర్జీని ఇచ్చింది. మేనేజర్స్‌ చేస్తున్న ఈ వేడుకకు రావడం సంతోషంగా భావిస్తున్నా. భవిష్యత్తులో వారు మరిన్ని సక్సెస్‌ ఫుల్‌ ఈవెంట్స్‌ చేయాలి’’ అన్నారు.

నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘మేనేజర్లు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమానికి హాజరవడం సంతోషం. నేను 32 సినిమాలు తీశాను కాబట్టి రూ.32 లక్షలు మేనేజర్స్‌ యూనియన్‌కు ఇస్తున్నా. నేను నిర్మించిన మంచి చిత్రాల్లో మేనేజర్స్‌ సహాయ సహకారాలు ఉన్నాయి’’ అన్నారు. కాగా మేనేజర్స్‌ యూనియన్‌కు నటీనటులు జీవిత, రాజశేఖర్‌ రూ.10లక్షలు విరాళం ప్రకటించారు.

ఈ వేడుకలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, చినజీయర్‌ స్వామి, కోటా శ్రీనివాసరావు, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, అల్లు అరవింద్, సురేశ్‌ బాబు, నీహారిక, నాగబాబు, రామ్‌–లక్ష్మణ్, సందీప్‌ కిషన్, రాశీఖన్నా, రెజీనా, ప్రగ్యాజైస్వాల్, పూజాహెగ్డే, ఎమ్‌.ఎల్‌.కుమార్‌ చౌదరి, శ్రీకాంత్, అశ్వినీదత్, బోయపాటి శ్రీను, టి.సుబ్బిరామిరెడ్డి, సాయి ధరమ్‌ తేజ్, మారుతి, తనీష్, శివ బాలాజీతో పాటు ‘తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ యూనియన్‌’ గౌరవ అధ్యక్షుడు  ఎమ్‌.సీతారామరాజు, అధ్యక్షుడు అమ్మిరాజు కాసుమిల్లి, ప్రధాన కార్యదర్శి: ఆర్‌.వెంకటేశ్వర రావు, కోశాధికారి: కె.సతీష్, ఉపాధ్యక్షులు డి.యోగనంద్, కుంపట్ల రాంబాబు, జాయింట్‌ సెక్రటరీలు సురపనేని కిషోర్, జి.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. రోజారమణి, సుమలత, టి. సుబ్బరామిరెడ్డి, జయప్రద, చిరంజీవి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, రఘురామకృష్టం రాజు, అమ్మిరాజు, రాజశేఖర్‌

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top