బిగ్‌బాస్‌ : సామ్రాట్‌ను హెచ్చరించిన తల్లి

Bigg Boss 2 Telugu Pooja Ramachandran As Wild Card Entry - Sakshi

గత కొన్ని రోజులుగా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీపై వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. లవ్‌ ఫెయిల్యూర్‌, స్వామి రారా సినిమాలతో ఫేమస్‌ అయిన పూజా రామచంద్రన్‌ అర్దరాత్రి దాటాక బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. సోమవారం ఎపిసోడ్‌లోనే ఈ విషయం స్పష్టమైన విషయం తెలిసిందే. అయితే ఆమె వైల్డ్‌ కార్డా లేక యాంకర్‌ ప్రదీప్‌లా గెస్టా.. అనే సందేహం కలిగింది. ఆమె వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అని స్పష్టమైంది. ఇంటి సభ్యులను సర్‌ప్రైజ్‌ చేయడం కోసం.. కౌశల్‌ సలహా మేరకు డైనింగ్‌ టేబుల్‌ కింద దాక్కున్నారు. మొదటగా గణేష్‌, దీప్తి సునయనలు పూజను గమనించారు. అనంతరం ఆమె ఇంటి సభ్యులందరిని పరిచయం చేసుకున్నారు. బిగ్‌బాస్‌ షోపై బయట జనాల అభిప్రాయం, ఇంట్లో తీసిన సినిమా గురించి టాక్‌ ఎలా ఉందో ఇంటి సభ్యులకు వివరించారు. 

ఎమోషనల్‌గా సాగిన కార్యక్రమం...
ఆరు వారాలకు పైగా ఇంటికి దూరంగా ఉన్న హౌస్‌ మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఓ మంచి అవకాశాన్ని అందించారు. వారి ఇంటి సభ్యులతో ముచ్చటించేందుకు ఓ ఫోన్‌ను ఇంట్లో అమర్చాడు. అయితే ఈ ఫోన్‌ను మొదటగా గీత లిఫ్ట్‌ చేసి.. అవతల వారు ఇచ్చే హింట్స్‌తో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి వారికి ఫోన్‌ ఇవ్వాలి. ఇలా ఫోన్‌ మాట్లాడిన వ్యక్తి తరువాతి కాల్‌ను లిఫ్ట్‌ చేసి.. వారిచ్చే హింట్స్‌ను గుర్తుపట్టి సరైన హౌజ్‌మేట్‌కు ఫోన్‌ను ఇచ్చేయాలి. ఇలా గుర్తుపట్టని యెడల ఆ ఫోన్‌ కట్‌ అయిపోతుంది. ఆ హౌస్‌ మేట్‌కు తన వాళ్లతో మాట్లాడే అవకాశం కోల్పోతారు.

మొదటి కాల్‌ కౌశల్‌కు.. 
మొదట వచ్చిన కాల్‌ను గీత లిఫ్ట్‌ చేయగా.. మిష్టర్‌ ఫర్‌ఫెక్ట్‌, మోడలింగ్‌ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చారు అని చెప్పగా.. కౌశల్‌కు ఫోన్‌ ఇచ్చారు. కౌశల్‌ పిల్లలు మాట్లాడగానే కన్నీరు పెట్టుకున్నాడు. తన బిజినెస్‌, పిల్లల స్కూల్‌ వివరాల గురించి అడిగాడు. కౌశల్‌ భార్య మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫ్రెండ్స్‌గా భావించి మాట్లాడే వారే నీ గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమని, బయట తనకు ఫాలోయింగ్‌ ఉందని కౌశల్‌ చెప్పారు. నందిని, దీప్తిల విషయాన్ని కూడా ప్రస్తావించారు. తనకు సోషల్‌ మీడియాలో భారీగా సపోర్ట్‌ లభిస్తోందని, గేమ్‌ జాగ్రత్తగా ఆడాలంటూ సలహా ఇచ్చారు. 

రెండో కాల్‌ రోల్‌ రైడాకు..
మొదటగా ఫోన్‌ మాట్లాడిన కౌశల్‌.. రెండో కాల్‌ను లిఫ్ట్‌ చేసిన వెంటనే.. అటునుంచి గల్లీ పోరగాడు.. బిర్యానీ తిండిబోతు అని హింట్స్‌ ఇవ్వగా... రోల్‌ రైడా అని గుర్తుపట్టి ఫోన్‌ అందజేశాడు. రోల్‌ ఫోన్‌ తీసుకోగా.. తన చెల్లెలితో మాట్లాడాడు. హౌస్‌లో చాలా ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడనీ, రోల్‌కు బయట చాలా మంది ఫ్యాన్స్‌ అయ్యారని చెప్పారు. ఎవరినీ సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకో అని చెప్పకూడదని, నీ ఆట నువ్వు ఆడాలి అంటూ సలహా ఇచ్చారు. 

మూడో కాల్‌ దీప్తి సునయనకు.. 
రెండో కాల్‌ రోల్‌ మాట్లాడగా.. తరువాతి ఫోన్‌ రింగ్‌ అయ్యాక.. అవతలి వ్యక్తి తమ పేరును చెప్పేయడంతో కాల్‌ కట్‌ అయింది. అవతలి వ్యక్తి ఇచ్చిన హింట్స్‌తో దీప్తి సునయనకు ఫోన్‌ వచ్చిందని గుర్తుపట్టాడు రోల్‌. కానీ ముందే పేరు చెప్పేయడంతో కాల్‌ కట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ తెలిపాడు. దీంతో దీప్తి సునయన చిన్నబోయింది. మళ్లీ తరువాత వచ్చే ఫోన్‌ కూడా రోల్‌ రైడానే గుర్తుపట్టాలని ఆదేశించాడు.

ఈ సారి సామ్రాట్‌కు సంబంధించిన వారు ఫోన్‌ చేశారు. వారిచ్చిన హింట్స్‌తో సామ్రాట్‌ను గుర్తుపట్టిన రోల్‌.. తనకి ఫోన్‌ అందజేశాడు. ఫోన్‌లో సామ్రాట్‌ అమ్మ మాట్లాడారు. ఎలిమినేషన్‌ నుంచి తప్పించిన ప్రేక్షకులకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే సామ్రాట్‌ను బిగ్‌బాస్‌ ఎందుకు వచ్చావని, నువ్వు నీలా ఉండాలని, అందరితో కలవాలంటూ, అనవసరమైన ట్యాగ్స్‌ను తగిలించుకోవద్దని, అర్దరాత్రి స్విమ్మింగ్‌ చేయద్దంటూ సలహాలు ఇస్తూ.. ‘నీపై చాలా నెగటివ్‌ ఉంది నాన్నా.. దానిని నేను తట్టుకోలేను.. జాగ్రత్తా’ అని హెచ్చరించారు. 

తరువాతి ఫోన్‌ ఎవరికి వస్తుందో.. వారిచ్చిన హింట్స్‌ను గుర్తుపడతారో లేదో మిగతా హౌస్‌ మేట్స్‌ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం వస్తుందో లేదో చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top