
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Aagnipariksha)పై సీజన్-2 విజేత కౌశల్ విమర్శలు చేశారు. కామన్ ఆడియన్స్ హౌస్‌లోకి వెళ్లేందుకు వేలాదిమంది అప్లై చేసుకుంటే బిగ్‌బాస్ టీమ్ వారిని జల్లెడపట్టి 45 మందిని సెలక్ట్ చేసింది. వారి మాట, ఆట తీరు బట్టి తొమ్మిదో సీజన్‌కు ఎవర్ని సెలక్ట్ చేయాలి..? ఎవర్ని రిజెక్ట్ చేయాలన్నది బిందు మాధవి, నవదీప్, అభిజిత్ చేతిలో పెట్టారు. అయితే, ఈ విధానాన్ని కౌశల్(Kaushal Manda) తప్పుబట్టారు.
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష గురించి కౌశల్ ఇలా అన్నారు..' బిగ్‌బాస్-9 హౌస్‌లోకి కామన్ ఆడియన్స్‌ను పంపేందుకు వారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. కానీ, జడ్జీలుగా వారిని తీసుకోవడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అభిజిత్ బిగ్‌బాస్- 4 విజేత పర్వాలేదు, బిందు మాధవి ఓటీటీ విజేత కాబట్టి ఓకే... అయితే, నవదీప్ సీజన్-1 సమయంలో మూడో స్థానంలో ఉన్నాడు. ఓడిపోయాన వ్యక్తిని కాకుండా విన్నర్ శివబాలాజీని జడ్జీగా తీసుకుని ఉండుంటే బాగుండేది. అలా చేయడం వల్ల విన్నర్స్‌కు గుర్తింపు ఇచ్చినట్లు ఉండేది.
నన్నెందుకు పిలవరంటే..
బిగ్‌బాస్ సీజన్- 2 తర్వాత కౌశల్ ఎప్పుడూ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వలేదు. చాలామంది పాత కంటెస్టెంట్స్ అతిథుల రూపంలో బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేసినప్పటికీ కౌశల్ మాత్రం దూరంగానే ఉన్నారు. అందుకు కారణం ఇలా చెప్పారు. 'ఇక నా వరకు వస్తే నేను గెలవడం బిగ్‌బాస్ టీమ్‌కు ఇష్టమే లేదు. కేవలం ప్రేక్షకుల అభిమానం వల్ల ట్రోఫీ ఇచ్చారు. ఓట్ల విషయంలో 'నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా' నా తర్వాతి కంటెస్టెంట్స్‌తో ఉండటంతో తప్పని పరిస్థితిలో మాత్రమే నన్ను విజేతగా ప్రకటించారు.
అందుకే బిగ్‌బాస్ టీమ్ వారు నన్ను ఎప్పుడూ కూడా హౌస్‌లోకి రమ్మని పిలువలేదు. బిగ్‌బాస్ చరిత్రలోనే వారికి ఇష్టం లేని కంటెస్టెంట్‌కు ట్రోఫీ ఇవ్వాల్సి వచ్చింది. సాధారణంగా హౌస్ట్‌గా వచ్చిన వారు చెయి పట్టుకుని విజేతను ప్రకటిస్తారు. కానీ, మొదటిసారి దానిని బ్రేక్ చేసి స్క్రీన్ మీద విన్నర్‌ను ప్రకటించారు. దీనిని బట్టే చెప్పవచ్చు.. బిగ్‌బాస్ టీమ్‌కు నా విజయం నచ్చలేదు.' అని అయన అన్నారు.