దర్శకుడికి ప్రతి సినిమా పరీక్షే

bhimaneni srinivasa rao about silly fellows - Sakshi

‘‘ప్రతి సినిమాకు ప్రెషర్‌ ఉంటుంది. ప్రతి సినిమా ఫస్ట్‌ సినిమా అని చేయాలి. హీరోకు ఇంకో చాన్స్‌ ఉంటుంది. కానీ దర్శకుడికి ప్రతి సినిమా పరీక్షే.  బావుంటే ప్రేక్షకులు ఎంత ఎత్తుకు తీసుకువెళ్తున్నారో బాలేకపోతే అంతే సులువుగా మరచిపోతున్నారు. అది ఎన్ని కోట్లుతో తీసిన సినిమా అయినా, ఎన్ని హిట్స్‌ ఇచ్చిన దర్శకుడు అయినా సరే’’ అని భీమనేని శ్రీనివాస్‌ అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్‌ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్‌’. టీజీ విశ్వ ప్రసాద్‌ సమర్పణలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి, వివేక్‌ కుచ్చిభొట్ల నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా భీమనేని శ్రీనివాస్‌ చెప్పిన విశేషాలు.

► ‘అల్లరి’ నరేశ్, నేను ‘సుడిగాడు’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని చాలా డిస్కస్‌ చేసుకున్నాం. ‘సుడిగాడు’ హిట్‌ అవుతుంది అనుకున్నాం కానీ అంత పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందనుకోలేదు. దాంతో మా కాంబినేషన్‌లో మళ్లీ ఎలాంటి సినిమా చేయాలి? ‘సుడిగాడు’ సీక్వెల్‌ చేయలా? అని ఆలోచించాం. ఓ లైన్‌ కూడా అనుకున్నాం. ఈలోపు ఈ పాయింట్‌ వచ్చి ఈ సినిమా చేశాం. ఇందులో నరేశ్‌ లేడీస్‌ టైలర్‌గా కనిపిస్తారు. జయప్రకాశ్‌ రెడ్డి టైలర్‌ నుంచి ఎంఎల్‌ఏ అవుతారు. అతన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని సినిమాలో నరేశ్‌ కూడా అతని దారినే ఫాలో అవుతాడు.

► సునీల్‌ హీరోగా మంచి సక్సెస్‌ చూశారు. మళ్లీ కామెడీ చేయాలనుకున్నప్పుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్‌ సినిమాతో లాంచ్‌ అవ్వాలనుకున్నారు. ఈ సినిమా నచ్చడంతో ఒప్పుకున్నారు. నరేశ్‌ ఫ్రెండ్‌గా ఓ కీ రోల్‌లో కనిపిస్తారాయన.

► క్లైమాక్స్‌ ముందు వచ్చే 20 నిమిషాలు సినిమాకు హైలైట్‌ అని ఫీల్‌ అవుతున్నాం. ఆడియన్స్‌ సీట్‌లో కూర్చోకుండా నవ్వుతారు. లాజిక్, మేజిక్‌లు పట్టించుకోకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరూ ఎంజాయ్‌ చేసే ఎంటర్‌టైనర్‌ ఇది.

► ఏదైనా క్రాఫ్ట్‌ బాగా చేస్తే మన మీద ఆ ముద్రపyì పోతుంది. ఫస్ట్‌ సినిమా ‘సుప్రభాతం’ హిట్‌ అయింది. ఆ తర్వాత వరుసగా రీమేక్‌లు చేశాను. తర్వాత సొంత కథలతో చేసిన ‘స్వప్నలోకం, నీ తోడు కావాలి’ సరిగ్గా ఆడలేదు. అందుకే రీమేక్స్‌లో బాగా రాణిస్తాడనే ముద్ర పడిపోయింది. దాంతో ఇవే చేస్తున్నాను.

► ఈ నిర్మాతలతో చాలా రోజులుగా అనుబంధం ఉంది. వాళ్లు ఆల్రెడీ ‘నేనే రాజు నేనే మంత్రి’ , ఎం.ఎల్‌.ఎ’ సినిమాలు తీశారు. హ్యాట్రిక్‌ కోసం స్క్రిప్ట్‌ జాగ్రత్తగా ఎంచుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top