
అల్లుడు శ్రీను సినిమాతో వెండితెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయినా పెద్దగా బ్రేక్ రాలేదు. కానీ అతడు ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘రాక్షసుడు’ హిట్ కావడంతో తిరిగి సక్సెస్ బాట పట్టాడు. ప్రస్తుతం ఆయన ‘కందిరీగ’, ‘హైపర్’ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ‘అల్లుడు అదుర్స్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్రబృందం గురువారం వెల్లడించింది. ఈమేరకు టైటిల్‌తోతో పాటు హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. (హ్యాపీ బర్త్ డే బెల్లంకొండ శ్రీనివాస్)
‘అల్లుడు అదుర్స్’తో బెల్లంకొండ సాయి మరోసారి అల్లుడి సెంటిమెంట్‌ను నమ్ముకున్నాడు. అయితే రెండూ ఒకటి కావని, మొదటిది వినోదాత్మక చిత్రమని, కానీ ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని అంటున్నాడీ హీరో. ఈ సినిమాలో ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోతో జోడీ కడుతున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్‌పై జి. సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. (నా సినిమా కథలను ముందు నాన్నగారే వింటారు)