విన్నింగ్ టీమ్ | bahubali Winning Team | Sakshi
Sakshi News home page

విన్నింగ్ టీమ్

Mar 28 2016 11:50 PM | Updated on Sep 3 2017 8:44 PM

విన్నింగ్ టీమ్

విన్నింగ్ టీమ్

హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు! చిత్ర నిర్మాణ సంఖ్యలో హిందీతో పోటాపోటీకి దిగుతూ దేశంలోనే మొదటి ఒకటి,

హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు! చిత్ర నిర్మాణ సంఖ్యలో హిందీతో పోటాపోటీకి దిగుతూ దేశంలోనే మొదటి ఒకటి, రెండు స్థానాల్లో నిలిచే సినిమా - తెలుగు సినిమా!! అయినా, తెలుగు సినిమా... అంటే దేశవ్యాప్తంగా నిన్న మొన్నటి వరకు చిన్నచూపు... 6 పాటలు, 3 ఫైట్లు, జిగేల్మనే దుస్తులు, ప్లాస్టిక్ ఎమోషన్స్ అంటూ పెదవి విరుపులు నేషనల్ అవార్‌‌డ్స 62 ఏళ్లుగా ఇస్తున్నా, ఒక్కసారీ జాతీయ ఉత్తమచిత్ర అవార్డ్ దక్కలేదు.


ఇన్ని నిరాశలు, నిరుత్సాహాల్ని ఇప్పుడు పటాపంచలు చేసిన సినిమా - ‘బాహుబలి... ది బిగినింగ్’. 2015వ సంవత్సరానికి గాను తాజాగా ప్రకటించిన 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చలనచిత్రంగా నిలిచిన భారీ ప్రయత్నం. అందుకే, ఇవాళ తెలుగు సినీసీమ గర్విస్తోంది. తెలుగు ప్రేక్షకులు రొమ్ము విరుచుకొంటున్నారు.

 
ఇప్పటికి అనేక మాసాలుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులందరూ అదేపనిగా చెప్పుకుంటున్న ఈ సినిమాలో ఇంతకీ ఏముంది? పచ్చిగా చెబితే - ‘బాహుబలి-పార్ట్ 1’ పక్కా జానపద కథ. కాలక్షేపం కథ. అన్నదమ్ముల మధ్య పోరాటాన్ని అద్భుతంగా తెరపై చూపిన కథ. ‘ట్రాయ్’, ‘300’, ‘మాస్క్ ఆఫ్ జోర్’ లాంటి అనేక సినిమాల ప్రభావం స్పష్టంగా ఉన్న కథ. యుద్ధ సన్నివేశాలతో కట్టిపడేసిన కథ. ఇలాంటి కథలు బ్లాక్ అండ్ వైట్ శకం నుంచి మనం చూసినవే. కాకపోతే, రంగుల్లో, టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్‌తో వచ్చిన విజువల్ గ్రాండియర్ తోడైంది. కళ, ఛాయాగ్రహణం, కూర్పు, రచన - ఇలా అన్ని కళల సమాహార రూపంగా సినిమా తయారైన తీరు తెరపై కనువిందు చేసింది. రాజమౌళి ఊహించిన దృశ్యాలు, వేసిన సెట్లు, తయారు చేసిన ఆయుధాలు, రథాలు (జాతీయ అవార్డు గ్రహీత సాబూ శిరిల్ ప్రొడక్షన్ డిజైనర్), కాస్ట్యూమ్స్ (రమా రాజమౌళి, ప్రశాంతి) ఆ కథాకాలానికి తీసుకువెళతాయి. తెలుగువాడైన జాతీయ అవార్డు విజేత వి. శ్రీనివాస మోహన్ సారథ్యంలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం కొన్ని పదుల మంది కృషి చేసిన సినిమా ఇది. మైళ్ళ కొద్దీ ఎత్తున్న జలపాతం, భారీ ప్రాసాదాలు, జంతువులు - ఇలా ప్రతిదీ ఏది విజువల్ ఎఫెక్ట్, ఏది వాస్తవం - అనే తేడా తెలియనివ్వకపోవడంలో ఈ టీమ్ కృషి, రాజమౌళి చెక్కుడు అర్థమవుతుంది. రచయిత వి. విజయేంద్రప్రసాద్ ఊహల్లో పుట్టిన ఒక కల్పిత కథనూ, మహిష్మతీ సామ్రాజ్యమనే కల్పిత ప్రదేశాన్నీ, బాహుబలి, కట్టప్ప, భల్లాలదేవ, శివగామి లాంటి కల్పిత పాత్రలనూ వాస్తవంలో ఒక భాగమన్నంతగా భ్రమింపజేసిందీ సినిమా. కళ్ళెదుట భారీ స్క్రీన్‌లో 4కె రిజల్యూషన్‌లో సినిమా చూస్తూ, దృశ్యం తాలూకు వాతావరణాన్ని ‘డాల్బీ ఎట్మాస్’ సౌండ్‌లో అనుభూతించగలిగామంటే - భారీ నిర్మాణ విలువలు, అపూర్వమైన విజువల్ ఎఫెక్ట్‌లు మూలస్తంభాలయ్యాయి.

 
పెద్ద బాహుబలిగా, శివుడిగా రెండు పాత్రల్లో ప్రభాస్, భల్లాలదేవుడిగా రానా, దేవసేనగా అనుష్క, కట్టప్పగా సత్యరాజ్, శివగామిగా రమ్యకృష్ణ - అందరూ అందరే! సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం, కీరవాణి సంగీతం, శ్రీనివాసమోహన్ సారథ్యంలో విజువల్ ఎఫెక్ట్స్, సాబూ శిరిల్ కళాదర్శకత్వం - అన్నీ అన్నే! అయితే, ఇన్నీ ఉన్నా, ఇంత చేసినా, ఇంతకీ ఆ పెద్ద బాహుబలి ఎలా చనిపోయాడు? వెన్నంటి ఉండే నమ్మకస్థుడైన యోధుడు కట్టప్ప (సత్యరాజ్) అతణ్ణి ఎందుకు చంపాడు? ఇలా సవాలక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పకుండానే ‘బాహుబలి... ది కన్‌క్లూజన్’ అనే రెండో పార్ట్ కోసం ఎదురు చూడాల్సిందేనంటూ ఈ ఫస్ట్‌పార్ట్ ముగిసింది. సెకండ్ పార్ట్ 2017 ఏప్రిల్‌కి కానీ రాదట!

 
ఈ సినిమాకు ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలూ తప్పలేదు. రిలీజ్‌కు ముందు దాదాపు రెండేళ్ళుగా నిరంతరం ప్రచారంలో ఉన్న ఈ ‘బాహుబలి పార్ట్1’ సినిమాలో ఉన్నట్టుండి ఆత్మ ఎక్కడో జారిపోయినట్లు అనిపించిందనే విమర్శలూ వచ్చాయి. కథ అటూ ఇటూ కాకుండా, అర్ధంతరంగానే ఆగిపోయిందన్నారు. ఈ కలల లోకవిహారం... ప్లేట్ మీల్సా? ఫుల్ మీల్సా? అని ప్రశ్నించారు. కానీ, ఆ విమర్శలన్నిటికీ అతీతంగా కొన్నేళ్ళుగా థియేటర్ల ముఖం చూడని జనం కూడా ‘బాహుబలి’ జ్వరంతో హాళ్ళకు క్యూలు కట్టారు. పనిలో పనిగా ఏలినవారి అండదండలతో సినిమా టికెట్ రేట్లు అధికారిక, అనధికారిక మార్గాల్లో కొండెక్కి కూర్చున్నాయి. వెరసి, తెలుగు సినిమా వసూళ్ళు వంద కోట్లు దాటాయి.

 
తెలుగు, తమిళ భాషలు రెంటిలోనూ వేర్వేరుగా తయారైన ఈ సినిమా గత ఏడాది ఒక ప్రభంజనమైంది. హిందీ, మలయాళం డబ్బింగ్ వెర్షన్స్‌లోనూ వసూళ్ళ వర్షం కురిపించింది. కరణ్‌జోహార్ - అతని ధర్మా ప్రొడక్షన్స్ జత కలవడంతో ఒక డబ్బింగ్ సినిమా జాతీయ సంచలనమైంది. ఇక, భారీ మలయాళ పోస్టర్ గిన్నిస్ రికార్డుల్లోకి కెక్కింది. తెలుగు మార్కె ట్‌ను విస్తరించింది. తాజాగా చైనాతో సహా అంతర్జాతీయ మార్కెట్లలోకీ అడుగిడుతోంది.

 
ఒక రకంగా మార్కెటింగ్ టెక్నిక్స్‌లోనూ ‘బాహుబలి’ది కొత్త పంథాయే! ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాను పూర్తిగా ఉపయోగించుకొన్న తొలి తెలుగు సినిమా ఇదే! సినిమా విడుదల ముందు వరకూ పేపర్లలో, టీవీల్లో వాణిజ్య ప్రకటనలైనా ఇవ్వకుండా అంతకు మించిన ప్రచారం పొందిన ఈ చిత్రం సినీ ప్రచార, మార్కెటింగ్ రంగాల్లో వారికి ఒక విలక్షణ కేస్‌స్టడీ. ‘బాహుబలి’ బొమ్మలు, కామిక్‌బుక్స్, దుస్తులతో మర్చండైజింగ్ చేసే ప్రయత్నాలూ మొదలయ్యాయి. ఇవన్నీ ఒక ప్రాంతీయ భాషలో, మరీ ముఖ్యంగా తెలుగులో మనమెప్పుడూ కనీవినీ ఎరుగనివి.

 

సగం సినిమా అయిన ‘బాహుబలి... ది బిగినింగ్’ ఇన్ని అద్భుతాలు చేస్తే, మరో సగం వచ్చే ఏడాది అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమవుతోంది. మొదటి భాగానికే జాతీయ అవార్డు వచ్చిందంటే... రెండో భాగం మరెన్ని అవార్డులు సాధిస్తుందో! అందుకే, కొన్ని విమర్శలున్నా, మరికొన్ని భిన్నస్వరాలు వినిపిస్తున్నా... ఇవాళ తెలుగు సినిమాకు కొత్త ఉత్సాహం తెచ్చిందీ... కొండంత బలం తెచ్చిందీ... అక్షరాలా ‘బాహుబలే’! ఎవరో రచయిత అన్నట్లు... కొన్నిసార్లు అంతే... అనుకోకుండా అద్భుతాలు జరిగిపోతుంటాయి! జరుగుతున్నప్పుడు అది అద్భుతమని తెలీదు... జరిగిపోయాక అది అద్భుతమని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు...

 
తెలుగు సినిమాల్లో - ఇవాళ ‘బాహుబలి’ అంతే! బాక్సాఫీస్ రికార్డుల్లోఅద్భుతమే! తెలుగులో తొలిసారి నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్‌‌డ  తేవడమూ అద్భుతమే! దీని వెనక ఎందరున్నా, తెలుగు సినిమా ఈ స్థాయికి చేరడానికి పునాదిరాళ్ళు వేసిన ‘మల్లీశ్వరి’ బి.ఎన్. రెడ్డి, ‘మాయాబజార్’ కె.వి. రెడ్డి, ‘నర్తనశాల’ కమలాకర, ‘మూగమనసులు’ ఆదుర్తి, ‘శంకరాభరణం’ కె. విశ్వనాథ్, ‘సీతా కల్యాణం’ బాపు, ‘మేఘసందేశం’ దాసరి, ‘అన్నమయ్య’ కె. రాఘవేంద్రరావు లాంటి ఎందరో ఈ అద్భుతానికి ప్రేరకులు. వారి అనుంగు వారసుడు రాజమౌళి ఈ అద్భుతానికి కారకుడు. జై... మాహిష్మతీ! జై... జై... తెలుగు సినిమా!!    

- రెంటాల జయదేవ
 


ఇంకా శ్రమిస్తాం!
జాతీయ అవార్డుల జ్యూరీ మాకు ఇచ్చిన గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. మా నిర్మాతలు ‘ది బెస్ట్’ అని వాళ్లను కూడా గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఈ ‘బాహుబలి’ ప్రయాణంలో నా వెన్నంటి నిలిచి, అహర్నిశలూ శ్రమించిన వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్‌కు, ఆయన టీమ్‌కు నా బెస్ట్ విషెస్. మాకు దక్కిన ఈ ప్రోత్సాహంతో ‘బాహుబలి-2’ని ఇంకా ఉన్నంతంగా తీర్చిదిద్దుతాం.     - రాజమౌళి

 

నా టీమ్‌కి కంగ్రాట్స్
ఈ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’ ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. మొత్తం ఈ చిత్రం వెనుక ఉండి పనిచేసినా టీమ్ మెంబర్స్‌కు కంగ్రాట్స్. - ప్రభాస్

 

మా కష్టానికి దక్కిన గౌరవ మిది
‘బాహుబలి’ ఈ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలం అందుకోనుండటం మా టీమ్ పడ్డ కష్టానికి దక్కిన  గౌరవం ఇది.  - అనుష్క

 

థ్యాంక్యూ బాహుబలి!
‘బాహుబలి’ కి జాతీయ అవార్డు వచ్చిందని తెలియగానే చాలా థ్రిల్ ఫీలయ్యాను. థ్యాంక్యూ ‘బాహుబలి’.  టాలెంటెడ్, డెడికేటెడ్ టీమ్‌తో పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.    - రమ్యకృష్ణ

 

రాజమౌళిని నమ్మాం!
మా సినిమా బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపికవడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ స్క్రిప్ట్‌తో సినిమా చేయాలనుకుంటున్నా నని రాజమౌళిగారు చెప్పగానే ఆయనపై నమ్మకంతో 2012లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాం. కేవలం తెలుగులో తీస్తే ఈ బడ్జెట్‌కి వర్కవుట్ కాదు. అందుకే తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేశాం. ప్రభాస్ మూడేళ్లు వేరే ఏ సినిమాలూ చేయకుండా ఈ చిత్రం చేయడం అభినందిం చాలి. ‘బాహుబలి’2పై భారీ అంచనాలుంటాయి. అందరం ఇంకా బాగా కష్టపడి పనిచేస్తాం.

 - నిర్మాతలు శోభు యార్లగడ్డ,  ప్రసాద్ దేవినేని

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement