సమంతలా నటించలేకపోయేదాన్నేమో!

Anupama Parameswaran interview about Rakshasudu - Sakshi

‘‘రాక్షసుడు’ కథ నచ్చింది. ఇది తమిళ ‘రాక్షసన్‌’ సినిమాకి రీమేక్‌. నేను తమిళ సినిమా చూడలేదు. మా నాన్నగారు చూసి ‘రాక్షసన్‌’ చాలా బాగుంది.. చూడమంటే చూశా. కథ అద్భుతంగా ఉంది’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్‌. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా రమేష్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్‌ పంచుకున్న విశేషాలు.

► క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. నాకు థ్రిల్లర్‌ సినిమాలంటే ఇష్టం. అందుకే ఈ కథకి బాగా కనెక్ట్‌ అయ్యాను. ఇందులో నేను టీచర్‌ పాత్రలో కనిపిస్తాను. సినిమాలో ఎక్కువ భాగం చీరలో ఉండటం సౌకర్యంగానే అనిపించింది. ఎందుకంటే ఐదో తరగతి నుంచే నాకు చీరలు కట్టుకోవడం అలవాటు. డ్యాన్స్, ఇతర ప్రోగ్రామ్స్‌ టైమ్‌లో చీరలో ఉండేదాన్ని. సినిమాలో నన్ను చూసి ప్రేక్షకులు ఎలా ఫీల్‌ అవుతారో అనే టెన్షన్‌ ఉంది.

► తమిళ ‘రాక్షసన్‌’లో అమలా పాల్‌ చేశారు. ఆమె కళ్లు చాలా బాగుంటాయి. అమలా పాల్‌ పాత్ర నేను చేయడం హ్యాపీగా ఉంది. అయితే ఆమెలా కాకుండా నా శైలిలో నటించాను. ఈ సినిమాకి నేనే డబ్బింగ్‌ చెప్పాను. ఆ సమయంలో నా వాయిస్‌ బాగాలేదు. ఎవరితోనైనా డబ్బింగ్‌ చెప్పించమని రమేష్‌ వర్మగారితో అంటే, ఆయన నేనే చెప్పాలనడంతో చెప్పాను.

► దుల్కర్‌ సల్మాన్‌ నిర్మిస్తున్న ఓ మలయాళ సినిమాకి డైరెక్టర్‌ శ్యాంసు జ్యభ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. ఓ సినిమా కోసం యూనిట్‌ పడే కష్టం ఏంటో తెలుసుకోవాలి.. అప్పుడే వృత్తిపై నాకు మరింత గౌరవం పెరుగుతుందని అసిస్టెంట్‌గా చేశా. వైవిధ్యమైన అనుభూతి కలిగింది.  భవిష్యత్తులో దర్శకత్వం చేస్తా. కొన్ని ఐడియాలు ఉన్నాయి. నేను దర్శకత్వం వహించే సినిమాల్లో జీవితం కనిపించాలి.  

► నా మాతృభాష మలయాళం అయినా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి ఇక్కడే నాకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ నాకు రెండో ఇల్లు లాంటిది. నటిగా సంతృప్తి ఉండదు. మంచి సినిమాలు, పాత్రలు వస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకూ నాకు చాలెంజింగ్‌ పాత్ర రాలేదు. తెలుగు ‘నిన్ను కోరి’ తమిళ్‌ రీమేక్‌లో నటిస్తున్నా. నివేదా థామస్‌ పాత్రను నా శైలిలో చేయనున్నా. ఇది నాకు చాలెంజిగ్‌ పాత్ర అనుకుంటున్నా. ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి, ‘మహానటి’లో కీర్తీ సురేశ్‌ చేసిన పాత్రలంటే చాలా ఇష్టం. నటిగా నేనేంటో నిరూపించుకునే అలాంటి పాత్రలు చేయాలనుంది. ‘రంగస్థలం’ సినిమా అవకాశం కోల్పోవడం కొంచెం బాధగానే ఉంది. అయితే ఆ పాత్రలో సమంతకంటే నేను బాగా చేయలేనేమో? అనిపించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top