అక్కినేని జాతీయ అవార్డుల ప్రదానోత్సవం

ANR National Awards 2018 - 2019 Function At Annapurna Studios - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అక్కినేని జాతీయ పురస్కారాలు ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అతిథులకు అక్కినేని కుటుంబం స్వయంగా స్వాగతం పలికి ఆహ్వానించింది. ఈ వేడుకల్లో 2018, 2019 సంవత్సరాలకు అవార్డులు ప్రదానం చేశారు. 2018కి గాను దివంగత నటి శ్రీదేవికి పురస్కారం ప్రకటించగా, శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీకపూర్‌ ఈ అవార్డును మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదగా అందుకున్నారు. అలాగే 2019కి గానూ బాలీవుడ్‌ సీనియర్‌ నటి రేఖకు అక్కినేని అవార్డు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఉన్నంతవరకూ అక్కినేని నాగేశ్వరరావు అందరి మనస్సులో ఉంటారని అన్నారు. ‘సినిమా తల్లి ఎంతో ఇచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి నాన్న అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ జాతీయ పురస్కారంతో పాటు నాన్న తనపేరు కూడా చిత్ర పరిశ్రమలో చిరకాలం ఉంటుందనుకునేవారు. నాన్నగారు భౌతికంగా మనమధ్య లేకున్నా ఆయన ఆత్మ మన మధ్య, మనతో ఇక్కడే ఉంది. జాతీయ అవార్డుతో పాటు నాన్నగారు కూడా ఈ వేదికపైనే ఉన్నారు. ఆయన సంకల్పం నెరువుతుందని సంతోషంగా ఉన్నారు.’ అని పేర్కొన్నారు. గతంలో దేవానంద్‌ , షాబానా ఆజ్మీ , లతా మంగేష్కర్‌ , కే బాల చందర్‌ ,హేమమాలిని, అమితాబచ్చన్‌ , రాజమౌళి లాంటి ప్రముఖులకు అక్కినేని జాతీయ పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున, నటి రేఖా మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. నటి రేఖ తొలి తెలుగుచిత్రంతో పాటు, అందంపై నాగార్జున చేసిన వ్యాఖ్యలకు అంతే దీటుగా రేఖా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా రేఖ స్పష్టమైన తెలుగులో మాట్లాడి వేడుకకు వచ్చిన వారందరినీ ఆశ్చర్యపరిచారు. తన తొలి తెలుగు చిత్రం ‘ఇంటిగుట్టు’  అని.. సొంత ప్రొడక్షన్‌లో నిర్మించిన ఆ సినిమాలో ఏడాది వయసు పాత్ర తనదని అన్నారు. 

‘రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు’  అన్న నాగార్జున ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ... ‘మీరు ఎంత అందంగా ఉన్నారో నేను అంతే అందంగా ఉన్నాను’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అవార్డుల ఫంక్షన్‌లా లేదని, ప్రశ్నల కార్యక్రమంలా ఉందంటూ రేఖ సరదాగా వ్యాఖ్యలు చేశారు. సినిమా ...సినిమానే...జీవితం ...జీవితమే అని ఆమె అన్నారు.  ఆఖరీ రాస్తా చిత్రానికి శ్రీదేవికి డబ్బింగ్‌ చెప్పిన విషయాన్ని రేఖ గుర్తు చేసుకున్నారు. ఆమె బిజీగా ఉండటంతో ఆ సినిమాకు తాను డబ్బింగ్‌ చెప్పానని తెలిపారు.

అలాగే శ్రీదేవితో కలిసి నాలుగు సినిమాలు చేశాను. మీతో కలిసి నటించాలని ఉందంటూ నాగార్జున ఈ సందర్భంగా రేఖను కోరగా... నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తే అందులో ఒక పాత్రలో రేఖ నటిస్తారంటూ చిరంజీవి మధ్యలో మైక్‌ తీసుకుని తన మనసులో ఉన్న మాట అంటూ చెప్పుకొచ్చారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top