కథ విన్నాక ఏం మాట్లాడలేదు  – ఆమని

Amani new moive updates - Sakshi

‘‘అమ్మ దీవెన’ మంచి సబ్జెక్ట్‌. కుటుంబసభ్యులందరికీ కనెక్ట్‌ అవుతుంది. కుటుంబంలో తల్లి బాధ్యత ఏంటి? పిల్లలను ఒక స్థాయికి తీసుకురావడానికి అమ్మ ఎంత కష్టపడుతుంది? అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించనున్నాం’’ అని నటి ఆమని అన్నారు. ఆమె కీలక పాత్రలో శివ ఏటూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మ దీవెన’. పోసాని కృష్ణమురళి, అజయ్‌ ఘోష్, దినేష్, శరత్‌ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పద్మ సమర్పణలో లక్ష్మమ్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎత్తరి గురవయ్య రూపొందిస్తోన్న ఈ చిత్రం మంగళవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్‌ కందుకూరి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో శ్రీకాంత్‌ క్లాప్‌ ఇచ్చారు. డైరెక్టర్‌ బి.గోపాల్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

ఆమని మాట్లాడుతూ– ‘‘దర్శక–నిర్మాతలు నన్ను కలిసి ‘అమ్మ దీవెన’ కథ చెబుతామన్నప్పుడు ఆలోచించాను. కానీ, కథ విన్నాక ఏం మాట్లాడలేదు.. చేస్తానని చెప్పా. ఇలాంటి కథను తీయడానికి నిర్మాతలు చాలా ధైర్యంగా ముందుకొచ్చారు. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఇది చాలా వైవిధ్యమైంది’’ అన్నారు. ‘‘ఉమ్మడి కుటుంబంలోని బంధాలను చక్కగా ఆవిష్కరించే చిత్రమిది’’ అన్నారు శివ ఏటూరి. ఎత్తరి గుర వయ్య, నటుడు అజయ్‌ ఘోష్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్‌.వి.హెచ్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: పద్మజ నాయుడు, ఎత్తరి చినమారయ్య.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top