డైరెక్షన్‌ చేస్తా

Allari Naresh interview about Silly Fellows - Sakshi

‘‘డబ్బు గురించి, సినిమాల సంఖ్య గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. క్వాలిటీగా సినిమాలు చేద్దామనుకుంటున్నా. కెరీర్‌ మొదట్లో విలన్‌ అవుదామనుకున్నా. రవిబాబుగారు నాతో ‘అల్లరి’ చేశారు. భవిష్యత్‌లో చిన్న బడ్జెట్‌లో సినిమా డైరెక్షన్‌ చేస్తా’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్‌. భీమినేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, సునీల్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్‌’. టీజీ విశ్వప్రసాద్‌ సమర్పణలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేశ్‌ పంచుకున్న విశేషాలు...

► ‘సిల్లీ ఫెలోస్‌’ లో రాజకీయాలంటే ఆసక్తి ఉండే వీరబాబు అనే లేడీస్‌ టైలర్‌ పాత్ర చేశాను. సూరిబాబు క్యారెక్టర్‌లో సునీల్‌గారు కనిపిస్తారు. ‘తొట్టిగ్యాంగ్‌’ తర్వాత మేమిద్దరం ఫుల్‌లెంగ్త్‌ క్యారెక్టర్స్‌ చేసిన చిత్రమిది. కామెడీలో అందరూ పాత నరేశ్, పాత సునీల్‌ను మిస్‌ అవుతున్నామని అంటున్నారు. ఆ పాతను వెతికి మళ్లీ ఈ సినిమాలో పెట్టాం.

► ఈ సినిమాకి తొలుత ‘సుడిగాడు 2’ టైటిల్‌ పరిశీలనకు వచ్చింది. ఆ పేరు పెడితే ప్రేక్షకులు స్పూఫ్‌ కామెడీ ఆశించి వస్తారు. ఆడియన్స్‌ను మోసం చేయకూడదని ‘సిల్లీ ఫెలోస్‌’ ఫిక్స్‌ చేశాం. భీమనేనిగారికి ‘ఎస్‌’ సెంటిమెంట్‌ ఉందిగా(నవ్వుతూ). ఒకరిని అనుకరించటం నటన కాదని నా భావన.

► రియలిస్టిక్‌ సినిమాలపై నాకు ఆసక్తి ఉంది. కామెడీ చేసేవారు ఏమైనా చేయగలరని నా నమ్మకం. ‘లడ్డుబాబు’ చిత్రానికి ఎంతో కష్టపడ్డా. కానీ, వర్కౌట్‌ కాలేదు. ఇకపై నా కామెడీని, ఎమోషన్‌ని బ్యాలెన్స్‌ చేసే ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుకుంటున్నా. అన్నయ్య(ఆర్యన్‌ రాజేశ్‌) రామ్‌చరణ్‌ సినిమా చేస్తున్నారు. 

► మహేశ్‌బాబుగారి సినిమాలో ఓ మంచి పాత్ర చేస్తున్నా. గిరి దర్శకత్వంలో నేను హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్‌ పూర్తి కావొచ్చింది. మారుతి దర్శకత్వంలో ఈవీవీ బ్యానర్‌లో నేను హీరోగా ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. మరికొన్ని కథలు వింటున్నాను. వెబ్‌ సిరీస్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ వంటి వాటి పట్ల ఆసక్తి ఉంది. తమిళంలోనూ ఆఫర్స్‌ వస్తున్నాయి.  ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీపైనే దృష్టి పెట్టాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top