
తమిళసినిమా: మెర్శల్ చిత్రాన్ని ఆదరిస్తున్న వారికి, అండగా నిలిచిన వారికి దండాలండోయ్ అని అంటున్నారు ఇళయదళపతి విజయ్. ఈ స్టార్ నటుడు కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం మెర్శల్. సమంత, కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ మెర్శల్ దీపావళి సందర్భంగా విడుదలై ఎంత సంచలన విజయం దిశగా పరుగులెడుతుందో,అంతగా వివాదానికి తెరలేపింది.
జాతీయ స్థాయిలో దుమారం రేపిన మెర్శల్ చిత్ర కథానాయకుడు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.అందులో సంచలన విజయాన్ని సాధిస్తున మెర్శల్ చిత్రం కొన్ని వ్యతిరేక సంఘటనలను ఎదుర్కొంది. అలాంటి చిత్రానికి ఘన విజయాన్ని కట్టబెట్టడంతో పాటు అండగా నిలిచిన నా చిత్రపరిశ్రమకు చెందిన మిత్రులకు, సన్నిహితులకు, నటీనటులకు, సినీ సంఘాలు దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి, దక్షిణ భారత నటీనటుల సంఘం, నిర్మాతలమండలి నిర్వాహకులకు, అభిమానులకు, ఇతర ప్రేక్షకులకు నా తరఫున, మెర్శల్ చిత్ర యూనిట్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని విజయ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.