మాపై నీచ రాజకీయాలు చేస్తున్నారు : నాగబాబు

Actor Nagababu Reacts On Pawan kalyan Issue - Sakshi

నటుడు నాగబాబు, హీరో అల్లు అర్జున్‌  

తాడేపల్లిగూడెం : తమపై నీచమైన రాజకీయాలు చేస్తున్నారని సినీ నటుడు, నిర్మాత నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’సినిమా ఆడియో వేడుక ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మిలటరీ మాధవరంలో ఆదివారం జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్‌ సినిమా ఇండస్ట్రీలో నంబర్‌ 1 పొజిషన్‌లో ఉండి, కోట్ల రూపాయల సంపాదనను కూడా తృణప్రాయంగా వదిలేసి నిస్వార్థంగా ప్రజల సేవ కోసం ముందుకు వెళుతున్నాడు. ఈ సందర్భంలో ఇది మాట్లాడొచ్చో మాట్లాడకూడదో తెలీదు. మెగా అభిమానులందరికీ ఓ మాట చెప్తున్నా. మాపై ఎన్నో కుతంత్రాలు, ఎన్నో కుయుక్తులు, నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే.. మేము సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఎవరూ ఏం అనరు.

కల్యాణ్‌బాబులాంటోడు అన్ని అడ్డంకులు తొలగించుకుని మీ ముందుకు వచ్చాడు. అలాంటోడు రాకూడదు వీళ్లకి. అలాంటోడు వస్తే వీళ్ల వేషాలు సాగవు. మీ అందరి బాగు కోసం, మీ పిల్లల భవిష్యత్‌ కోసం తనకున్న భవిష్యత్‌ను వదులుకుని మీ ముందుకు వస్తున్నాడు. తను రాకూడదని కోరుకునే వ్యక్తులు, పార్టీలు కల్యాణ్‌ను ఏమీ చేయలేక, తన కుటుంబాన్ని నోటికొచ్చినట్లు దుర్భాషలాడించి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. వీళ్లందరికీ దుమ్ముదులిపేలా రాబోతున్నాడు పవన్‌కల్యాణ్‌. అతను ఒక్కడే అనుకోకండి.. వెనకాల చాలా మంది పవన్‌కల్యాణ్‌లు ఉన్నారు. అడ్డగోలుగా స్కామలు చేయాలనో, డబ్బులు సంపాదించుకోవాలనో రావడం లేదు. దేవుడు అభిమానుల రూపంలో ఇచ్చాడు మాకు చాలా. నిస్వార్థంగా సేవ చేయడానికి ముందుకొస్తున్నాం. ఎలా చేయాలో మాకు తెలుసు. ఒకసారి కుదర్లేదు. ఈ సారి కుదిరి తీరుతుంది. ఒక్కొక్కడికి ఉంటది.. థ్యాంక్స్‌’అన్నారు. 

పవన్‌పై వ్యక్తిగత దాడి తప్పు 
హీరో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘కోట్ల రూపాయలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కల్యాణ్‌గారిపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం చిరంజీవిగారినీ చాలా మాటలు అన్నారు. ఈ చెవి అలవాటు పడిపోయింది. ఈ మనసు గట్టిపడిపోయింది. వపన్‌కల్యాణ్‌గారిని మొన్న చాలా పర్సనల్‌గా మాట్లాడారు.. నాకు నచ్చలేదు. చాలా చాలా చాలా తప్పు. మాట్లాడిన వాళ్లది తప్పు. మాట్లాడనిచ్చినోళ్లది తప్పు. ఇలా మాట్లాడారు అని లక్షల మందికి చూపించడం అంతకంటే పెద్ద తప్పు’అని అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top