అప్పుడే ఎక్కువ సినిమాలు వస్తాయి

ABCD Trailer launch by Trivikram Srinivas - Sakshi

– త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

‘‘కాన్సెప్ట్‌ చిత్రాలు తీసే ‘మధుర’ శ్రీధర్‌గారికి సినిమాలంటే చాలా ప్రేమ. సినిమాలను ప్రేమించే నిర్మాతల చిత్రాలు బాగా ఆడితే మరిన్ని వస్తాయి. కథ చెప్పే విధానం, సినిమాలు చూసే విధానం మారాలంటే శ్రీధర్‌లాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి’’ అని దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అన్నారు. అల్లు శిరీష్, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా భరత్‌ ముఖ్య పాత్రలో సంజీవ్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ’ అన్నది ఉపశీర్షిక. డి. సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్‌ రెడ్డి, యష్‌. రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 17న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను త్రివికమ్ర్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘జల్సా’ టైమ్‌లో శిరీష్‌ను చిన్నకుర్రాడిగా చూశాను.

సినిమాను అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి తను. సినిమాను ప్రేమించే వాళ్లు ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ  ట్రైలర్‌ చూసిన తర్వాత సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ చూస్తే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతోంది. మా చిత్రం గురించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఎక్కువగా మాట్లాడతాను. శ్రీధర్, సురేశ్‌బాబు, యష్‌గార్లకు థ్యాంక్స్‌. నన్ను బాగా ప్రెజెంట్‌ చేసిన దర్శకుడు సంజీవ్‌గారికి, మంచి మ్యూజిక్‌ అందించిన జుడో సాండీకి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘సీరియస్‌ కాన్సెప్ట్‌ సినిమాలు నిర్మించే నేను ఓ ఫన్‌ మూవీ తీయాలని చాలా రోజులుగా అనుకున్నాను. ఆ క్రమంలో చేసిన సినిమాయే ‘ఏబీసీడీ’. శిరీష్, భరత్‌ ఫెంటాస్టిక్‌గా నటించారు’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్‌. ‘‘ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కారణం శిరీష్‌గారే. ఆయన ఎప్పటికీ నా హీరోగానే ఉంటారు. ఈ జర్నీలో ముందు నుంచి నాతో భాగమైన ‘మధుర’ శ్రీధర్‌గారికి థాంక్స్‌’’ అన్నారు సంజీవ్‌ రెడ్డి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top