
నిత్యామీనన్
...అంటున్నారు నిత్యామీనన్. గురువారం మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఈ విధంగా అన్నారు. జనరల్‌గా ‘‘ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు.. మగవాళ్లతో సమానం. మగవాళ్లు చేసే ఉద్యోగాలు ఆడవాళ్లు కూడా చేయగలుగుతారు’’.. ఇలాంటి మాటలను మనం మహిళా దినోత్సవం సందర్భంగా వింటుంటాం. అయితే నిత్యామీనన్ డిఫరెంట్‌గా చెప్పారు. ‘‘మన తరానికి చెందినవాళ్లం మగవాళ్లు చేసే పనులు మనం కూడా చేయగలం అని నిరూపించుకోవడంలో బిజీగా ఉంటున్నాం. మన అధికారాన్ని మనం కోల్పోతున్నట్లుగా ఫీలవుతున్నాం.
అయితే నేను చెప్పేదేంటంటే.. మగవాళ్లు చేసే అన్ని పనులు చేయడానికి ఆడవాళ్లు పుట్టలేదు. మగవాళ్లు చేయలేనివి చేయడానికే ఆడవాళ్లు సృష్టించబడ్డారు’’ అని నిత్యామీనన్ పేర్కొన్నారు. అవును కదా.. ఎప్పుడూ మగవాళ్లకు సమానంగా ఉండాలని చాలామంది ఆలోచిస్తారు కానీ, ఇంకో మెట్టు పైన ఉండాలని ఎందుకు ఆలోచించరు? నిత్యామీనన్ చెప్పినట్లుగా మగవాళ్లు చేయగలవి కాకుండా చేయలేనివి చేయగలమని ఆలోచించడం వల్ల ఇంకో మెట్టు పైన ఉన్నట్లే కదా. అన్నట్లు.. పై మాటలు చెప్పాక, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నిత్యామీనన్.