వాలెంటైన్స్‌ వీక్‌! 8రోజుల ప్రేమ పండుగ!

Valentine Week Special Days - Sakshi

ప్రేమలో ఉన్నవారికి ప్రతి రోజూ పండగే. అయితే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చే వాలెంటైన్స్‌ డే మాత్రం ప్రేమికులకు ఇంకా ప్రత్యేకం. చాలా మంది ప్రేమికులు వాలెంటైన్స్‌ డే రాకకోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేమికులు ఎంతో సంబరంగా జరుపుకునే వాలెంటైన్స్‌ డే ప్రత్యేక ఆ ఒక్కరోజుకే పరిమితం కాలేదు. ప్రేమికుల రోజు.. ఫిబ్రవరి 14వ తేదీకి వారం రోజుల ముందు ఫిబ్రవరి 7నుంచే వేడుకలు మొదలవుతాయి. దీన్నే వాలెంటైన్స్‌ వీక్‌గా పిలుస్తారు. వాలెంటైన్స్‌ వీక్‌లోని ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాలెంటైన్‌ వీక్‌లోని ఎనిమిది రోజులల్లో ఒక్కోరోజు ఒక్కో విధంగా ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. 

1) రోజ్‌ డే : వాలెంటైన్‌ వీక్‌.. రోజ్‌డేతో ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 7నుంచి 14 వరకు వారం రోజుల పాటు ఈ స్పెషల్‌డేస్‌ ఉంటాయి. ఈరోజు తాము ప్రేమించిన వారికి ఒక గులాబీ పువ్వును బహుమతిగా ఇస్తారు. దానితో పాటు గులాబీ పువ్వులు ఉండే మంచి మెసేజ్‌లు ఉన్న గ్రీటింగ్‌ కార్డులను గిఫ్ట్‌లుగా ఇస్తారు. ‘మనసుకు మాత్రమే తెలిసిన భాషలో.. నా ప్రేమను ఈ గులాబి పువ్వు నీకు తెలియజేస్తుంది’ లాంటి కొటేషన్స్‌ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షిస్తాయి.

2) ప్రపోజ్‌ డే :  ఫిబ్రవరి 8వ తేదీన ప్రపోజ్‌ డే జరుపుకుంటారు. ఈరోజున తాము ప్రేమించిన వారికి ధైర్యంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఎన్ని రోజుల నుంచో ప్రేమను వ్యక్తపరచడానికి సంకోచిస్తూ ఉన్న వారికి ఈ రోజు ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. సో మీరు కూడా మీకిష్టమైన వారికి మీ మనసులో మాట చెప్పాలనుకంటే ఈ ఏడాది కచ్చితంగా చెప్పేయండి. ఒక మంచి గులాబీతోనో, లేక చేతికి రింగ్‌ తొడిగో మీ ప్రేమను వ్యక్తపరచండి. 

3) చాక్లెట్‌ డే : ఇక వాలంటైన్‌ వీక్‌లో మూడో రోజు చాక్లెట్‌ డే. ప్రేమ బంధం ఎంతో తీయనైనది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ మధురమే. తాము ప్రేమించిన వారు పక్కన ఉంటే అంతకు మించిన స్వర్గం ఉండదు. అలాంటి ఆ బంధాన్ని మరింత మధురంగా మలుచుకోవాలంటే చాక్లెట్‌ డే రోజు ప్రేమించిన వారితో చాక్లెట్‌ షేర్‌ చేసుకోవాల్సిందే. 

4) టెడ్డీ డే : ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డేని జరుపుకుంటారు. టెడ్డీలంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూడటానికి ఎంతో అందంగా మృధువుగా ఉండే టెడ్డీలు ఎంతో ఆకర్షిస్తాయి. అంతే కాకుండా అనుక్షణం మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. సో టెడ్డీని ప్రజెంట్‌ చేయడం ద్వారా మీ అందమైన ప్రేమసికి ఎంతో క్యూట్‌గా మీ ప్రేమను తెలియజేయవచ్చు. 

5) ప్రామిస్‌ డే : ఈరోజు ఒకరికొకరు జీవితాంతం తోడుంటాం అంటూ ప్రేమికులు మాట ఇచ్చిపుచ్చుకుంటారు. నీ సంతోషంలోనే కాదు నీ బాధలోనూ నీకు బాసటగా నిలుస్తాను అంటూ తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమ బంధం మరింత బలపడటానికి మీరు చెప్పే ఒక్క మాట చాలు. అందుకే మీ మనసులో ఉన్న భావాల్ని మీరు ప్రేమించిన వారికి అర్థం అయ్యేలా అందంగా చెప్పండి. ‘ నేను చేసిన ప్రమాణాన్ని ఎన్నటికి మర్చిపోను! నిన్ను ఎప్పటికీ వీడిపోను’’ అంటూ మీ ప్రేమను తెలపండి. ఇచ్చిన మాటకు జీవితాంతం కట్టుబడి ఉండండి. ఎందుకంటే ఒక్కసారి మాట నిలబెట్టుకోలేకపోతే తర్వాత సారీ చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు. 

6) హగ్‌ డే : ఈ డే ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన వారిని కౌగిళ్లలోకి తీసుకుని మీ ప్రేమను వ్యక్తపరిస్తే ఆ భావాలు మాటల్లో వర్ణించలేము. ఆ అనుభూతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే హగ్‌డే రోజు తాము ప్రేమించిన వారిని హగ్‌ చేసుకోవడంతో పాటు ఒక మంచి గ్రీటింగ్‌ కార్డును బహుమతిగా ఇస్తారు. 

7) కిస్‌ డే : వాలెంటైన్స్‌ డేకి ముందు రోజైన ఫిబ్రవరి 13వ తేదీని కిస్‌ డేగా జరుపుకుంటారు. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా.. ప్రేమించిన వారు ఇచ్చే చిన్న ముద్దు.. ఆ బాధలన్నింటిని దూరం చేస్తుంది. మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే ముద్దుతో.. రోజును ప్రారంభిస్తే ఆరోజంతా ఆనందంగానే గడుస్తుంది.  

8) వాలంటైన్స్‌ డే : ఇక వాలంటైన్‌ వీక్‌లో చివరి రోజైన ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌డేగా జరుపుకుంటారు. ప్రేమ కోసం ప్రాణాలు అర్పించిన వాలెంటైన్‌ జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ప్రేమికుల రోజుగా  జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమించిన వారికి మంచి గిఫ్ట్‌ ఇచ్చి ప్రేమను వ్యక్తపరచడంతో పాటు ఆరోజంతా వారితో ఆనందంగా నచ్చిన ప్రదేశానికి వెళ్లి గడుపుతారు.

తెలుసుకున్నారుగా వాలెంటైన్‌ వీక్‌లో  ఒక్కొక్క రోజుకు ఉన్న ప్రత్యేకతలు ఇంకెందుకు ఆలస్యం! ఆరోజు ఏం చేయాలో  ప్లాన్‌ చేసుకోండి. 

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top