సీఏ ఫైనల్‌లో మెరిసిన తెలుగుతేజం | CA final telugu person | Sakshi
Sakshi News home page

సీఏ ఫైనల్‌లో మెరిసిన తెలుగుతేజం

Jan 19 2018 2:24 AM | Updated on Jan 19 2018 2:24 AM

CA final telugu person - Sakshi

లబ్బీపేట (విజయవాడ తూర్పు)/గుంటూరు ఎడ్యుకేషన్‌: గత ఏడాది నవంబర్‌లో ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించిన సీఏ ఫైనల్‌ పరీక్షా ఫలితాల్లో తెలుగుతేజం మాదాటి ఫణీష్‌రెడ్డి సత్తాచాటాడు. విజయవాడ కృష్ణలంకకు చెందిన ఫణీష్‌రెడ్డి దక్షిణ భారతదేశంలో ఫస్ట్‌ ర్యాంక్, జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఫణీష్‌రెడ్డి ఆడిటర్‌ తుమ్మల రామ్మోహనరావు వద్ద ఆర్టికల్స్‌ చేస్తూ స్వతంత్రంగా పరీక్షకు సన్నద్ధమయ్యి ఈ ర్యాంకు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఫణీష్‌రెడ్డికి ఆడిటర్‌ అభినందనలు తెలిపారు. 
పెరిగిన ఉత్తీర్ణత..

ఒక గ్రూపుతో లేదా రెండు గ్రూపుల్లోనూ పరీక్షలకు హాజరైన 30,054 మంది విద్యార్థులకు గాను, 6,841 మంది ఉత్తీర్ణులై 22.76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐసీఏఐ చరిత్రలోనే ఇది రికార్డుగా నిలిచింది. కాగా, సీఏ గ్రూప్‌–1, గ్రూప్‌–2 విభాగాలను కలుపుకొని దేశ వ్యాప్తంగా 9,479 మంది సీఏ కోర్సు పూర్తి చేశారు. గ్రూప్‌–1 విభాగంలో దేశవ్యాప్తంగా 39,328 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వారిలో 6,257 మంది ఉత్తీర్ణులై 15.91 శాతం, గ్రూప్‌–2 విభాగంలో 39,753 మంది పరీక్షలు రాయగా వారిలో 6,006 ఉత్తీర్ణులు కాగా 15.11 శాతంగా నమోదైంది. గతేడాది జనవరిలో విడుదలైన సీఏ ఫైనల్‌ ఫలితాల్లో 11.57 శాతం ఉత్తీర్ణత నమోదవగా, ప్రస్తుతం దాదాపు రెట్టింపు శాతం నమోదైంది. జీఎస్టీ ప్రభావంతో దేశవ్యాప్తంగా సీఏలకు డిమాండ్‌ నెలకొన్న పరిస్థితుల్లో తాజా ఫలితాలు విద్యార్థులను సీఏ కోర్సు వైపు ఆకర్షితులను చేసే విధంగా ఉన్నాయని స్థానిక ఆడిటర్లతో పాటు శిక్షణ సంస్థలు చెబుతున్నాయి. 

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే...
‘‘నేను ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంకు సా«ధించేందుకు నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. నాన్న శ్రీనివాసరెడ్డి ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా చేస్తారు. అమ్మ శోభారాణి గృహిణి. నేను పదవ తరగతి చదువుతున్న సమయంలో సీఏ చేయాలనే నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పగా, వారు ఎంతో ప్రోత్సహించారు. ఐపీసీసీలో 71 శాతం, సీఏ సీపీటీలో 91 శాతం మార్కులు సాధించాను. ప్రస్తుతం ఆలిండియా స్థాయిలో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. సీపీటీ, ఐపీసీసీకి ఓ విద్యాసంస్థలో శిక్షణ తీసుకున్నా. సీఏ ఫైనల్స్‌ విషయంలో ఆర్టికల్స్‌ చేస్తూ సొంతంగా ప్రిపేర్‌ అయ్యాను’’.   
  – ఫణీష్‌ రెడ్డి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement