హవాయి గజగజ : చరిత్రలో భారీ భూకంపం

Valcano Eruption Lead To Historic Quake In Hawaii - Sakshi

కిలౌయి అగ్నిపర్వతం బద్దలు

పెద్ద ఎత్తున సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ విడుదల

బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ద్వీపం ప్రజలు

1700 మందిని తరలించిన అధికారులు

హోనలులు, హవాయి : ఫసిఫిక్‌ మహాసముద్రంలోని హవాయి దీవుల్లో అత్యంత ప్రమాదకరమైన(క్రీయాశీల) అగ్నిపర్వతంగా పేరున్న కిలౌయి అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున లావాను వెదజల్లుతోంది. శనివారం హవాయి దీవుల చరిత్రలో భారీ భూకంపం సంభవించింది. గత నలభై ఏళ్ల ఈ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. రిక్టర్‌ స్కేలుపై 7.4గా భూకంప తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే(యూఎస్‌జీఎస్‌) వెల్లడించింది.

శుక్రవారం వరుసగా రెండు భూకంపాలు(5.6 ; 6.9 తీవ్రతలతో) సంభవించాయి. దీంతో ద్వీప ప్రజలు భయంతో వణికిపోయారు. తూర్పు హవాయి ద్వీపం వైపు పెద్ద ఎత్తున లావా వస్తుండటంతో ఆ ప్రాంతంలోని 1700 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంపాలు సంభవిస్తుండటం వల్ల భూమి నుంచి పెద్ద ఎత్తున సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ వాతావరణంలోకి విడుదల అవుతోంది.

ఈ వాయువును పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ముక్కు, గొంతులో తీవ్రంగా మంట వచ్చి శ్వాస తీసుకోలేక మనిషి చనిపోవచ్చు. స్వల్పస్థాయి భూకంపాలను కలుపుకుని గత వారం రోజుల్లో హవాయిలో 1000కి పైగా సంభవించాయి.

సునామీ అవకాశం లేదు
ద్వీపాల్లో అతి భారీ భూకంపాలు సంభవించినప్పుడు సునామీ సంభవించడం సహజం. కానీ, హవాయికి ఆ ముప్పు లేదని సునామీ నిపుణులు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top