వర్క్‌ వీసాల నిలిపివేత

Trump Temporarily Suspends H-1B Visa - Sakshi

హెచ్‌ 1బీ వీసా జారీలో సంస్కరణలు

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌ 1బీ వీసాను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆదేశించారు. ఇక ఈ ఏడాది డిసెంబర్‌31 వరకూ హెచ్‌ 1బీ, హెచ్‌ 2బీ, జే 1, ఎల్‌ 1 వీసాల జారీని నిలిపివేశారు. హెచ్‌ 1బీ రెన్యువల్స్‌కు ఢోకా లేదని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. హెచ్‌ 1బీ వీసాల జారీ విధానంలో సంస్కరణలకు ట్రంప్‌ పిలుపు ఇచ్చారు. మెరిట్‌ ఆధారంగానే హెచ్‌1బీ వీసాల జారీకి మొగ్గుచూపారు. దీంతో ప్రతిభావంతులకే అమెరికాలో ఎంట్రీ లభించనుంది.

కాగా అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం వలస ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకే ట్రంప్‌ హెచ్‌ 1బీ వీసాల జారీలో సంస్కరణలకు మొగ్గుచూపారని వైట్‌హౌస్‌ పేర్కొంది.

అమెరికన్ల ఉద్యోగాలు కాపాడేందుకే..
కరోనా మహమ్మారితో అమెరికాలో నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగిన క్రమంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడే లక్ష్యంతో వలస విధానం, వీసాల జారీ ప్రక్రియలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని వైట్‌హౌస్‌ వెల్లడించింది. ఈ సంస్కరణలు అమెరికన్‌ ఉద్యోగుల వేతనాలను కాపాడతాయని పేర్కొంది. అత్యధిక నైపుణ్యాలతో కూడిన విదేశీ ప్రొఫెషనల్స్‌కే అమెరికాలో ప్రవేశానికి అనుమతి లభిస్తుందని తెలిపింది. అమెరికన్‌ ఉద్యోగుల స్ధానంలో తక్కువ వేతనాలకే లభించే విదేశీ ఉద్యోగులను యజమానులు నియమించుకుంటున్న క్రమంలో ఆ లోటుపాట్లను సవరించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వైట్‌హౌస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

వలసలతో ముప్పు
వీసాల నిలిపివేత ఉత్తర్వుల్లో ట్రంప్‌ ప్రధానంగా అమెరికన్ల ఉద్యోగాలకు వలసదారులతో ముప్పు ఎదురవుతుందనే అంశాన్ని నొక్కిచెప్పారు. అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థలో దాదాపు ప్రతి రంగంలో అమెరికన్లు ఉద్యోగాల కోసం విదేశీయులతో పోటీపడాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. తాత్కాలిక పనుల కోసం అమెరికాలోకి వచ్చే లక్షలాది విదేశీయులతో అమెరికన్లు పోటీపడుతున్నారని, వలసదారులతో పాటు వారి కుటుంబసభ్యులతో సైతం అమెరికన్లు ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారని ప్రస్తావించారు. సాధారణ పరిస్ధితుల్లో తాత్కాలిక ఉద్యోగుల రాకతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగినా కోవిడ్‌-19 వ్యాప్తితో నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో తాత్కాలిక ఉద్యోగులు అమెరికన్‌ ఉద్యోగుల ఉపాథికి పెనుముప్పుగా పరిణమించారని ట్రంప్‌ పేర్కొన్నారు.

మూడు నెలల్లో 2 కోట్ల ఉద్యోగాలు మాయం
ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్‌లో అమెరికాలో పలు పరిశ్రమల్లో కోల్పోయిన 17 లక్షల ఉద్యోగాల భర్తీకి యజమానులు హెచ్‌2బీ నాన్‌ఇమిగ్రెంట్‌ వీసాల ద్వారా నియామకాలకు ప్రయత్నిస్తున్నారని గుర్తుచేశారు. ఇదే సమయంలో కీలక పరిశ్రమల్లో పనిచేసే 2 కోట్ల మందికి పైగా అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోగా, ఈ స్ధానాల భర్తీకి యజమానులు హెచ్‌1బీ, ఎల్‌ 1 వర్కర్ల వైపు చూస్తున్నారని ఉత్తర్వుల్లో ట్రంప్‌ యంత్రాంగం పేర్కొంది. జే1 వీసాదారులతో ఉద్యోగాలకు పోటీపడే అమెరికన్‌ యువతలో నిరుద్యోగ రేటు అత్యధికంగా 20 శాతం పైగా ఉందని వెల్లడించింది.

చదవండి : వెనక్కి రావాల్సిందేనా!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top