
సిడ్నీ : ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియాకు బయల్దేరిన ఎయిర్ ఏషియా విమానం ఒకటి అత్యవసరం వెనక్కి వచ్చింది. దాదాపు 32 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని అర్ధాంతరంగా 10 వేల అడుగుల ఎత్తులోకి దింపేసి 25 నిమిషాల తర్వాత తిరిగి ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో సురక్షితంగా దింపేశారు. క్యాబిన్‌లో సమస్య ఏర్పడటమే కాకుండా టెక్నికల్ సమస్య తోడవడంతో ముందస్తు జాగ్రత్తగా విమానాన్ని అత్యవసరంగా దింపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
సోమవారం ఉదయం ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియాకు ఎయిర్‌ఏషియా విమానం బయలుదేరింది. అలా వెళుతున్న కాసేపటికే విమానం క్యాబిన్‌లో ఒత్తిడి తగ్గిపోవడంతో వెంటనే విమానం వణికిపోవడం మొదలైంది. దీంతో విమానంలోని ప్రయాణీకులంతా ఆక్సిజన్ మాస్క్‌లు ధరించాలని సిబ్బంది ప్రకటన చేశారు. దీంతో ప్రయాణీకులు మరింత బెంబేలెత్తిపోయి తమ ఫోన్‌లు తీసుకోని ఎస్సెమ్మెలు పంపించడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ గట్టిగా భయంతో కేకలు పెడుతూ ఏడ్వడం మొదలుపెట్టారు. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఊపిరిపీల్చుకున్నారు. జరిగిన పొరపాటుకు ఎయిర్ ఏషియా క్షమాపణలు చెప్పింది. సంఘటనపై విచారణకు ఆదేశిస్తామని, సాంకేతిక లోపం వల్లే సమస్య తలెత్తిందని వివరించారు.