పరస్సర అంగీకారంతో జరిగిన | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 11 2019 2:55 PM

Southwark Crown Court in London: T​hey Are A Life Saver! - Sakshi

లండన్‌ శివారులో తన సోదరుడితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న 20 ఏళ్ల చెర్రీ ఇటీవల ఓ వీకెండ్‌ సాయంత్రం పార్టీకి వెళ్లింది. అక్కడ అనుకోకుండా తానంటే అమితంగా ఇష్టపడే ఓ స్కూల్‌ ఫ్రెండ్‌ను కలుసుకొంది. అతను ఐదు గ్లాసుల వోడ్కా, ఓ కోక్‌ను ఆమెకు ఆఫర్‌ చేశాడు. చిన్ననాటి జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటూ ఇద్దరు తాగారు. అనంతరం ఇద్దరు కలిసి డాన్స్‌ చేశారు. చెర్రీ డాన్స్‌ చేస్తూ చేస్తూ ఓ దశలో కింద పడబోయి నిలదొక్కుకుంది. వారిద్దరు బయటకు వచ్చేసరికి బాగా రాత్రయింది. టాక్సీ పిలుచుకొని వారిద్దరు చెర్రీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే బాగా మత్తులో ఉన్న చెర్రీ అలాగే వెళ్లి బెడ్‌ మీద పడి పోయింది. ఆమె పక్కనే పడుకున్న బాల్య మిత్రుడు ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాడు. ఇది రేప్‌ కేసుగా ఇంగ్లీషు క్రౌన్‌ కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. 

ఇంతకు అది రేపా ? పరస్సర అంగీకారంతో జరిగిన సెక్సా ? న్యాయం చెప్పాల్సిన బాధ్యత 11 మంది సభ్యులు గల జ్యూరీ, ఓ జడ్జీ మీద పడింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు, కేసులోని వాస్తవాలు తేల్చేందుకు ‘క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ (సీపీసీ)’ న్యాయవాదులు కోర్టు హాలుకు హాజరయ్యారు. అత్యాచారం కాకుండా రేప్‌గా తెలిస్తే అన్యాయంగా ఓ యువకుడి జీవితం పాడవుతుంది. రేప్‌ జరిగినా కాదని తెలిస్తే కుటుంబంలో, సమాజంలో ఓ యువతి పరువు పోతుంది. ఐదు పెగ్గుల వోడ్కా తాగిన అమ్మాయి స్పృహలో ఉండే అవకాశం తక్కువ. అలాంటి పరిస్థితుల్లో పరస్పర సెక్స్‌కు ఆమె అంగీకారం తెలపగలదా ? ఆ మత్తులోనే ఆమె శారీరక సుఖాన్ని కూడా కోరుకున్నదా ? ఆమె మత్తును ఆసరాగా తీసుకొని ఆ యువకుడే రెచ్చిపోయి రేప్‌ చేశారా? అన్నది తేలిస్తే కేసు సులభంగా కొలిక్కి వస్తుందన్నది జ్యూరీకి అర్థమైంది. 

ఇంగ్లండ్‌లో నమోదవుతున్న వంద రేప్‌ కేసుల్లో కేవలం మూడు కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడుతున్నాయి. జడ్జీ, పెద్ద జ్యూరీతో విచారణ జరిపించడం, వారిలో ఎక్కువ మంది పురుషులవైపు మొగ్గు చూపడంతో నిందితులకు శిక్షలు పడడం లేదని వామపక్ష మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు గత కొంత కాలంగా లండన్‌ వీధుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వారి ఆందోళన కారణంగా మహిళలు ముందుకు వచ్చి రేప్‌ కేసులను నమోదు చేయడం మూడింతలు పెరగ్గా. శిక్షలు మాత్రం పెద్దగా పెరగలేదు. అందుకని జ్యూరీతో కాకుండా ఓ జడ్జీ, ఇద్దరు సభ్యుల కమిటీతోని రేప్‌ కేసుల విచారణ జరిపించాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చెర్రీ రేప్‌ కేసుకు ప్రాధాన్యత చేకూరింది. రేప్‌ జరిగిన రోజు చెర్రీ బెడ్‌ రూమ్‌ నుంచి బయటకు రాగానే సోదరుడు ఎదురు పడి నిలదీశాడు. బెడ్‌ రూమ్‌ నుంచి ఓ పురుషుడు బయటకు రావడం తెల్లవారుజామున తాను చూశానని, అసలు ఏం జరిగిందో చెప్పంటూ బెదిరించాడు. తాను వద్దంటున్న, తాను ఒప్పుకోక పోయినా బలవంతంగా తనతో సెక్స్‌ జరిపాడని ఆమె చెప్పింది. ఆమె సోదరుడు వెంటనే అంబులెన్స్‌ను, పోలీసులను పిలిపించారు. ఆమెను అస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా, సెక్స్‌ జరిగినట్లు, రక్తంలో ఆల్కాహాల్‌ ఉన్నట్లు తేలింది. 

చెర్రీ ఆ రోజున ఐదు పెగ్గుల ఆల్కాహాల్‌ తీసుకుందని, ఆమె దాదాపు స్పృహ తప్పిందంటూ, అందుకు సాక్ష్యంగా ఆమె డాన్స్‌ ఫ్లోర్‌లో నేలపై పడుబోతున్నట్లుగా ఓ పత్రికలో వచ్చిన ఫొటోను, వైద్యుల నివేదికను ఆమె తరఫు న్యాయవాది జడ్జీకి సమర్పించి, ఆమె సెక్స్‌కు అంగీకరించే స్థితిలోనే లేదని వాదించారు. రేప్‌ కేసుగా పరిగణించి నిందితుడిని దోషిగా తేల్చాలని కోరారు. అప్పుడు జ్యూరీ నుంచి ఓ సభ్యుడు జడ్జీకి ఓ కాగితంపై ఏదో రాసి పంపిచారు. చెర్రీకి బ్రేక్‌ డ్యాన్సర్‌గా, అంతకుముందు మంచి అథ్లెట్‌గా మంచి గుర్తింపు ఉందని, నేలపై పడుతున్నట్లు కనిపించడం డ్యాన్స్‌లో ఓ భంగిమ అని ఆ కాగితంలో ఆ సభ్యుడు సూచించారు. 

జ్యూరీలోని మరో సభ్యుడు జోక్యం చేసుకొని చెర్రీని పోలీసులు ఇంటరాగేట్‌ చేసిన వీడియో క్లిప్‌ను మరోసారి ప్లే చేయమని కోరారు. అందులో ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఐదు పెగ్గుల వోడ్కాకు ఆర్డర్‌ ఇచ్చిన మాట నిజమే. అయితే అందులో నేను రెండు పెగ్గులు తీసుకోగా, అతను మూడు పెగ్గులు తీసుకున్నారు’ అని చెర్రీ చెప్పడం కనిపించింది. ఆమెకు మద్యం ఎక్కువ కాలేదని, వైద్య పరీక్షల్లో కూడా ఆమె రక్తంలో ఆల్కాహాల్‌ శాతం చాలా తక్కువ ఉన్నట్లు పేర్కొన్నారని సదరు జ్యూరీ సభ్యుడు కోర్టుకు నివేదించారు. ఈ కారణంగా చెర్రీ ఇష్ట పూర్వకంగానే సెక్స్‌లో పాల్గొన్నదని, సోదరుడికి భయపడి ఆమె అబద్ధం చెప్పిందని జ్యూరీ తేల్చింది. 

జడ్జీ కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించడంతో అందరు ఊపిరి పీల్చుకోగా, కేసు విచారణ జరిపిన ఇద్దరు పోలీసు అధికారులు మాత్రం తలపై చేతులు పెట్టుకున్నారు. నిందితుడు చిరునవ్వుతోనే జ్యూరీ సభ్యులకు అభినందనలు తెలిపి కోర్టు బయటకు వెళ్లాడు.  అక్కడ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రులు కుమారుడి వెన్ను తట్టి వెంట తీసుకెళ్లారు. అప్పటి వరకు అక్కడే కనిపించిన మహిళా సంఘాల నాయకులు కనుమరుగయ్యారు. 

Advertisement
Advertisement