సిగరెట్‌ పడేస్తే.. లక్షా పాతికవేలు ఫైన్‌..!

Smoker Fined Heavy For Dropping Cigarette At Railway Station In UK - Sakshi

కెంట్‌ : పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది మనం ఇప్పటివరకు వింటున్న హెచ్చరిక. ఇక తాజా హెచ్చరిక ఏంటంటే.. పొగతాగి సిగరెట్‌ ముక్క నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ పడేస్తే మాత్రం భారీ జరిమానా తప్పదు. కాకాపోతే ఇంతటి కఠిన నిబంధనలు మన దగ్గర కాదు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో. బహిరంగ దూమపానం చేస్తున్నవారిపై, నిర్లక్ష్యంగా పడేస్తున్నవారిపై అక్కడి ప్రభుత్వాలు కొరడా ఝళిపిస్తున్నాయి. తాజాగా ఓ రైల్వే స్టేషన్‌లో సిగరెట్‌ తాగిన ఓ వ్యక్తికి ఏకంగా రూ. 1.25 లక్షలు జరిమానా విధించారు. ఈ సంఘటన కెంట్‌లోని యాష్‌ఫోర్డ్‌ అంతర్జాతీయ రైల్వే స్టేషన్‌లో ఇటీవల చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌ ఆవరణలో సిగరెట్‌ తాగి కాలికింద నలిపేసిన జాన్‌ విల్సన్‌ (56)ను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. ఏడు వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సిందిగా కౌన్సిల్‌ ఎన్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

కానీ, విల్సన్‌ చెల్లించలేదు. దాంతో మొదట విధించిన మొత్తంతోపాటు అదనంగా మరో 25 వేలు చెల్లించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ అతను జరిమానా కట్టలేదు. కాంటెర్‌బరీ కోర్టులో ఈ జరిమానా చలాన్లను సవాల్‌ చేశాడు. అయితే, వాదనలు విన్న కోర్టు.. కింది కోర్టు ఉత్తర్వులను ధిక్కరించావని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకుముందు విధించిన జరిమానాకు మరో 90 వేలు, ఇతర ఖర్చులు జతచేసి ఆ మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. విల్సన్‌ నిరుద్యోగి కావడం గమనార్హం. ఈ భారీ జరిమానా (1.25 లక్షలు) చెల్లించేందుకు అతనికి కోర్టు 18 నెలల గడువిచ్చింది.

కాగా, సిగరెట్‌ తాగి బహిరంగా పడేసినందుకు లిన్నెట్‌ విల్‌డిగ్‌ అనే మహిళకు కూడా ఇటీవలే భారీ జరిమానా విధించారు. ఈ సంఘటన స్టాఫార్డ్‌షైన్‌లోని మెక్‌డొనాల్డ్స్‌ కార్‌ పార్కింగ్‌ వద్ద జరిగింది. తొలుత విధించిన రూ.7 వేల జరిమానా చెల్లించకపోవడంతో ఆమె ముప్పైవేల జరిమానా కట్టక తప్పలేదు. చెత్త వేయడం, సిగరెట్లు ఎక్కడపడితే అక్కడ పడేయడం వంటివి యూకేలో శిక్షార్హం. భారీ జరిమానా తప్పదు. ఫైన్‌ను 10 నుంచి 14 రోజుల్లో చెల్లిస్తే ఏ చిక్కూ లేదు. గడువు దాటిందో.. ఆ మొత్తం భారీ మొత్తం భారీ మొత్తమయి కూర్చుకుంటుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top