వివాదాస్పద వీడియో పోస్ట్.. యువకుడి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

వివాదాస్పద వీడియో పోస్ట్.. యువకుడి అరెస్ట్

Published Tue, Mar 31 2015 1:39 PM

Singapore teen in court over anti-Lee Kuan Yew video

సింగపూర్:  సింగపూర్ జాతిపిత, వ్యవస్థాపక తొలి ప్రధాని, ఇటీవల మరణించిన లీ క్యుయాన్ యోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 16ఏళ్ల  టీనేజర్ అమోస్ యీ పాంగ్ కౌన్ను సింగపూర్  కోర్టు విచారించింది. వరుసగా మూడురోజులపాటు ఓ మతాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తూ ఆన్లైన్లో  పోస్ట్లు పెట్టడంతో అతగాణ్ని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.  అమోస్ లీ  కావాలనే ఓ మతాన్ని  అవమానపర్చడం,  దుష్ప్రచారం చేయటంతో పాటు ఆ మతస్తుల మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జీసస్, లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అమోస్ యి పాంగ్ కౌన్పై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.

'ఎట్టకేలకు లీ మరణించాడు' అనే పేరుతో  ఎనిమిది నిమిషాల నిడివి గల ఒక వీడియోను  యూ ట్యూబ్లో అప్లోడ్  చేయడంతో   వివాదం రగిలింది. నిందితుడిపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలపైనే కేసు నమోదైనట్టు సమాచారం.  అయితే కోర్టు  నిర్ణయం తరువాత  కూడా అమోస్ యీ పాంగ్ కౌన్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. కోర్టు ఆవరణలో నిందితుడి ప్రవర్తన పలువురిని విస్మయపర్చిందట.  నిందితుడి తండ్రి  'లీ.... నన్ను క్షమించు' అని వేడుకుంటోంటే.. అతగాడు  మాత్రం విలేకర్లను చూసి చేతులూపుతూ, నవ్వుతూ  కనిపించాడట.  కాగా ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 17 వ తేదీకి వాయిదా వేసింది.
 
91 సంవత్సరాల సింగపూర్ మాజీ ప్రధాని లీ క్యుయాన్ యో మార్చి 23 వ తేదీ మరణించారు. వివిధ దేశాధినేతల అశ్రునివాళుల మధ్య  సింగపూర్లో గత ఆదివారం ఆయన అంత్యక్రియలు ముగిసిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement