‘హిస్‌’టారికల్‌..

Sick Python Undergoes CT scan - Sakshi

హాయ్‌.. నా పేరు హన్నా.. 
ఇక్కడ పేపరు మడిచేసినట్లు.. మడిచేసేరే అది నేనే.. ఈ మధ్య నాకు ఒంట్లో కాస్త నలత చేసింది లెండి.. హిస్సు.. బుస్సుమని అనలేకపోతున్నాను.. మొహం కూడా కాస్త వాచిందేమో.. దాంతో నేనుంటున్న జూవాళ్లు తెగ కంగారు పడిపోయి.. ఎక్స్‌రేలు వంటివి తీశారు.. అయితే.. దాని వల్ల పెద్దగా ఉపయోగం కనిపించలేదట.. ఇంకేం చేయాలా అని తెగ ఆలోచించేసి.. ఈ మధ్యే మాలాంటి వాటి కోసం ప్రత్యేకంగా చేయించిన సీఏటీ(కంప్యూటరైజ్డ్‌ యాక్సియల్‌ టోమోగ్రఫీ) స్కాన్‌లో నన్ను పరీక్షించేయాలని డిసైడైపోయారు.. నేనేమో ఏకంగా 19 అడుగులు ఉంటాను.. అందులో పట్టనాయే.. ఏం చేద్దామని ఆలోచించి.. ఇలా మడతెట్టేశారు.. 
కాస్త ఇబ్బందిగా ఉన్నా.. నా ఆరోగ్యం కోసమే కదా అని సరిపెట్టేసుకున్నాను.. 

మొన్నటికి మొన్న నా పక్క బోనులోని సింహం మామను ఇలాగే పరీక్షించారు.. అయితే.. ఓ కొండచిలువను సీఏటీ స్కాన్‌లో పెట్టి.. స్కానింగ్‌ చేయడం ఇదే తొలిసారట. అలా ఓ రికార్డు కూడా నా ఖాతాలో పడిందండోయ్‌.. స్కానింగ్‌ రిపోర్టు వచ్చేసింది.. ఊపిరితిత్తుల్లో ఏదో సమస్యట.. మా డాక్టరుగారు.. రిపోర్టును బాగా తిరగేసి..ఇన్‌ఫెక్షన్‌ తగ్గడానికి నాకు యాంటీబయాటిక్‌లు ఇస్తున్నారు.. ఇప్పుడిప్పుడే.. అడపాదడపా హిస్సు.. బుస్సుమనగలుగుతున్నాను.. మందులేసుకునే టైమైంది.. ఉంటానే.. ఇంతకీ నేనెక్కడుంటానో చెప్పలేదు కదూ.. అమెరికాలోని ఒహాయోలో ఉన్న కొలంబస్‌ జూలో.. బాయ్‌.. బాయ్‌.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top